సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి జిల్లాలో మూడు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ల వ్యవహారం తేలలేదు. మిగతా నియోజకవర్గాల్లో దాదాపు కొలిక్కి వచ్చినా దేవరకొండ, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఆశావహులు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు నాగార్జునసాగర్‌లో మాజీ మంత్రి జానారెడ్డినే పోటీలో దింపాలని భావించినా ఆయన తన కుమారుడికే టికెట్ ఇప్పించుకునేందుకు మొగ్గుచూపుతున్నారు.
ఇదిలా ఉంటే.. పొత్తులో భాగంగా ఉమ్మడి జిల్లాలో కమ్యూనిస్టులకు రెండు స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకారానికి వచ్చిందంటూ ప్రచారం సాగుతోంది. మిర్యాలగూడ స్థానాన్ని సీపీఎంకు, మునుగోడు స్థానాన్ని సీపీఐకి ఇస్తున్నారన్న విషయంపై సోమవారం రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయా స్థానాలను ఆశిస్తున్న వారు తీవ్ర ఆందోళనలో పడ్డారు.
మిర్యాలగూడలో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న బత్తుల లక్ష్మారెడ్డి వర్గం, మునుగోడులో టికెట్ ఆశిస్తున్న చలమల్ల కృష్ణారెడ్డి వర్గం నిరాశలో పడింది. అయితే, మిర్యాలగూడ, మునుగోడు స్థానాలను ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందని కమ్యూనిస్టు పార్టీల నేతలు చెబుతుండగా.. ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వర్గాలు కొట్టి పారేస్తున్నాయి.
తేలాల్సి ఉన్న మూడు స్థానాలు..
ఉమ్మడి జిల్లాలో మూడు స్థానాల్లో ఎవరిని బరిలో నిలుపాలన్న విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా నిర్ణయానికి రానట్లుగా తెలిసింది. అందులో ముఖ్యంగా దేవరకొండ, తుంగతుర్తి స్థానాల్లో తీవ్ర పోటీ నెలకొనగా, సూర్యాపేటలో ఇద్దరి మధ్యే ప్రధానమైన పోటీ నెలకొంది. దేవరకొండలో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కోసం ఐదారుగురు ప్రయత్నిస్తున్నారు. అందులో మాజీ ఎమ్మెల్యే బాలునాయక్‌తోపాటు గతంలో టీడీపీ, పీఆర్‌పీలో పనిచేసిన వడ్త్యా రమేష్‌నాయక్, కిషన్‌నాయక్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఇందులో రమేష్‌నాయక్ మాజీ మంత్రి జానారెడ్డి ద్వారా తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. గతంలో పీఆర్‌పీలో పనిచేసినందున సినీ నటుడు చిరంజీవి ద్వారా కూడా రమేష్ నాయక్ ప్రయత్నాలు చేస్తుండటంతో టికెట్ ఎవరికి ఇవ్వాలన్న విషయాన్ని తేల్చలేదు. ఇక, తుంగతుర్తిలో అద్దంకి దయాకర్, పిడమర్తి రవి, నాగరిగారి ప్రీతమ్, భాషపంగు భాస్కర్, వడ్డేపల్లి రవి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మోత్కుపల్లి నర్సింహులు కూడా టికెట్ ఆశిస్తున్నారు.
అక్కడ పోటీ అధికంగా ఉండటంతో వెంటనే తేల్చని పరిస్థితి నెలకొంది. ఇక సూర్యాపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పటేల్ రమేష్‌రెడ్డి మధ్య సయోధ్య కుదిర్చే పనిలోనే అధిష్టానం ఉంది. దీంతో వారిలో ఎవరికి ఇవ్వాలన్న దానిపై ఓ నిర్ణయానికి రాలేదు. నాగార్జునసాగర్‌లో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తన కుమారుడు జైవీర్‌రెడ్డి అవకాశం ఇవ్వాలని పట్టుపడుతున్నారు. అవసరమైతే తాను ఎంపీ వెళతానని ప్రకటించారు. దీంతో అక్కడ జానారెడ్డి కూమారునికే టికెట్ ఇవ్వాలని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment