
తమిళనాడు: కళాశాల విద్యార్థితో యువతి పరారైంది. దీంతో విద్యార్థి తండ్రి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణగిరి జిల్లా రాయకోట సమీపం మొల్లంపట్టి గ్రామానికి చెందిన గోవిందన్(55)కు భార్య సాలమ్మాళ్ (48), కుమారుడు తమిళ్‌సెల్వన్ (21), కుమార్తె మంజుల ఉన్నారు. తమిళసెల్వన్ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్నాడు. ఇతను అదే ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల ప్లస్–1 విద్యార్థిని ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు రెండు కుటుంబాలు వ్యతిరేకం తెలుపుతారని తెలిసి తమిళ్ సెల్వన్, అమ్మాయి కొన్ని రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు.
దీంతో బాలిక తల్లిదండ్రులు డెంకణికోట్టైలోని ఆల్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలిక బంధువులు గత 5వ తేదీన తమిళసెల్వన్ ఇంటికి వెళ్లి అతని తండ్రి గోవిందన్, తల్లి సాలమ్మల్‌పై దాడి చేసి చంపేస్తామని బెదిరించారు. ఇంటిని కూడా ధ్వంసం చేశారు. దీంతో భయాందోళనకు గురైన గోవిందన్, అతని భార్య సాలమ్మల్ గత 7వ తేదీన ఇంట్లో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయారు.
స్థానికులు వారిని కృష్ణగిరి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గోవిందన్ ఆదివారం ఉదయం మృతి చెందాడు. అనంతరం బాలిక బంధువులు ముత్తు, కుమార్, పెరుమాళ్ సహా నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారైన అమ్మాయి, తమిళసెల్వన్ కోసం కూడా పోలీసులు వెతుకుతున్నారు.
ప్రియుడితో పరార్
ఇంటి పట్టా, నగలు తీసుకుని వివాహిత ప్రియుడితో కలిసి పరారైంది. తంజావూరు సమీపంలోని వాయలూరు సారపల్లం గ్రామానికి చెందిన రాజసెల్వం (45)కు భార్య సుకన్య (33), ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ స్థితిలో శనివారం రాజసెల్వం తంజావూరు ఎస్పీ ఆశిష్ రావతికి ఫిర్యాదు చేశాడు. అందులో తమ వీధికి చెందిన ఓ యువకుడు తన భార్య సుకన్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిపాడు.
తాను వారిని చాలాసార్లు మందలించానని, వారు సంబంధాన్ని వదలలేదని వెల్లడించాడు. ఈ స్థితిలో 4వ తేదీన ఆ యువకుడు తన భార్యను, తన చివరి బిడ్డను తీసుకుని వెళ్లిపోయాడని తెలిపాడు. నగలు, ఇంటి పట్టాను తీసుకుని వెళ్లాడు. యువకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.