సాక్షి, చైన్నె : ఓ ప్రైవేటు బ్యాంకు సిబ్బంది పొరబాటు, సాంకేతిక సమస్యతో ఓ కారు డ్రైవర్ 34 నిమిషాల పాటు వేల కోట్లకు అధిపతి అయ్యాడు. ఇందులో రూ.21 వేలను తన మిత్రుడి ఖాతాలోకి ఆ డ్రైవర్ బదిలీ కూడా చేశారు. చివరకు పొరబాటును గుర్తించిన బ్యాంకర్లు ఆ మొత్తాన్ని వెనక్కి లాగేసుకున్నారు. గురువారం ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దిండుగల్ జిల్లా పళణి సమీపంలోని నైకారన్ పట్టికి చెందిన రాజ్‌కుమార్(28) డిప్లొమో ఇంజినీర్. ప్రస్తుతం చైన్నెలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కోడంబాక్కంలో బస చేసి ఉన్న రాజ్‌కుమార్‌కు పళణిలోని ఓ ప్రైవేటు బ్యాంక్‌లో ఖాతా ఉంది.
ఇందులో కేవలం రూ. 105 బ్యాలెన్స్ పెట్టి ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో రెండు రోజుల క్రితం అతడి బ్యాంక్ ఖాతాలో 9 వేల కోట్లు జమ చేసినట్టుగా సెల్ నెంబర్‌కు వచ్చిన ఎస్‌ఎంఎస్‌తో షాక్‌కు గురయ్యాడు. ఇది ఫేక్ మెసేజ్‌గా ఉంటుందని భావించి, తన మిత్రుడి దృష్టికి తీసుకెళ్లాడు. తక్షణం ఈ ఎస్‌ఎంఎస్ నిజమో కాదో తేల్చుకుందామని తన మిత్రుడి ఖాతాలోకి తన ఖాతా నుంచి తొలుత రూ. 1000, ఆ తర్వాత రూ.20 వేలు బదిలీ చేశాడు. మిత్రుడి ఖాతాలోకి రూ. 21 వేలు బదిలీ కావడంతో రాజ్‌కుమార్ ఆనందానికి అవధులు లేవు. తాను కోటీశ్వరుడైనంత ఆనందంలో మునిగి పోయాడు.
ఆనందం ఆవిరి..
ఆనందంలో ఉన్న రాజ్‌కుమార్‌కు ఆ ఎస్‌ఎంఎస్ వచ్చిన 34వ నిమిషంలో ఖాతాలో ఉన్న నగదు మాయమైంది. తమ పొరబాటును గుర్తించిన బ్యాంకర్లు ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవడమే కాకుండా, రాజ్‌కుమార్ మరో ఖాతాకు బదిలీ చేసిన రూ. 21 వేల రాబట్టే ప్రయత్నం మొదలెట్టారు. పట్టభద్రుడైన రాజ్‌కుమార్ తనకు అన్ని వ్యవహారాలు తెలుసని పేర్కొంటూ ఎదురు తిరిగాడు. తన ప్రమేయం లేకుండా, తనకు సమాచారం ఇవ్వకుండా తన ఖాతా నుంచి ఎలా నగదు వెనక్కి తీసుకుంటారని ప్రశ్నించడం మొదలెట్టాడు.
పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో బ్యాంకర్ల కాళ్ల బేరానికి వచ్చి, అతడ్ని బుజ్జగించి చైన్నె టీనగర్‌లోని ప్రధాన కార్యాలయానికి రప్పించారు. తర్వాత అతడి మిత్రుడి ఖాతాలో జమ చేసిన రూ. 21 వేలను బ్యాంకర్లు వదులుకోవాల్సి వచ్చింది. అంతేకాకుండా రాజ్‌కుమార్‌కు సొంతంగా కారు కొనుకున్నేందుకు రుణం ఇస్తామన్న ఆఫర్‌ను అధికారులు ఉంచడం గమనార్హం. ఈ వ్యవహారం తాజాగా మీడియాలో రావడంతో రూ.9 వేల కోట్ల వ్యవహారంపై ఐటీ, ఈడీ వర్గాలు దృష్టి పెట్టేనా..? అన్నది చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment