రైలు నుంచి పడి గర్భిణి మృతి | Sakshi
Sakshi News home page

రైలు నుంచి పడి గర్భిణి మృతి

Published Sat, May 4 2024 5:40 AM

-

కొరుక్కుపేట: చైన్నె నుంచి సీమంతం కోసం తమ స్వగ్రామానికి వవెళుతున్న ఓ గర్భిణి విరుదాచలం సమీపంలో రైలు నుంచి పడి మృతి చెందింది. ఈ సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తెన్‌కాశీ జిల్లా కరంకోవిల్‌ సమీపంలోని మేలనీలితనల్లూర్‌ తూర్పు వీధికి చెందిన సురేష్‌ కుమార్‌ (25) చైన్నెలోని ఓ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతనికి చైన్నె పెరియార్‌ నగర్‌ త్రిశూలానికి చెందిన బిఎస్సీ పట్టభద్రురాలు కస్తూరి (22)తో 9 నెలల క్రితం వివాహమైంది. కస్తూరి ప్రస్తుతం 7 నెలల గర్భిణి. ఈ నేపథ్యంలో కస్తూరి కుటుంబ సభ్యులు సీమంతం చేయాలని నిర్ణయించారు. దీనికితోడు గ్రామంలో ఆలయ వేడుకలు జరుగుతున్నాయని, ఆదివారం సీమంతానికి ఏర్పాట్లు చేశారు. 

గురువారం సురేష్‌ కుమార్‌ తన భార్య, బంధువులు కొల్లాం ఎక్స్‌ప్రెస్‌ రైలులో స్వగ్రామానికి వెళ్లేందుకు టికెట్లు బుక్‌ చేశారు. అందరూ ఆ రైలులో ఎస్‌–9 కోచ్‌లో ప్రయాణిస్తున్నారు. ఈ రైలు రాత్రి 8 గంటలకు ఉలుందూరుపేట వద్దకు వెళ్లే సరికి కస్తూరికి వాంతులు అయ్యాయి. వెంటనే బంధువుల సాయంతో పెట్టెలో చేతులు కడుక్కోవడానికి వచ్చాడు. దానికి దగ్గరగా ప్రవేశ ద్వారం ఉంది. కస్తూరి వాంతులు చేసుకుంటూ అక్కడే నిలబడి ఉంది. ఆ సమయంలో రైలు వేగంగా వెళుతుండడంతో కదలిక రావడంతో కిందపడిపోయింది. ఇది చూసి షాక్‌కు గురైన మహిళ బంధువులు కేకలు వేశారు. వెంటనే బాక్స్‌లోని ప్రమాద గొలుసును లాగి రైలును ఆపేందుకు ప్రయత్నించారు. కానీ గొలుసు పని చేయలేదు. 

తరువాత అత్యవసర లివర్‌ని లాగారు. అప్పటికి రైలు దాదాపు 7 కిలోమీటర్లు దూరం వెళ్లి ఆగింది. కుటుంబ సభ్యులందరూ దిగి ఽఆ ప్రాంతానికి నడిచి వెళ్లారు. కానీ రాత్రి సమయం కావడంతో కస్తూరి జాడ తెలియలేదు. అనంతరం రైలులో విరుదాచలం రైల్వేస్టేషన్‌కు వచ్చి, రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు కస్తూరి కోసం గాలిస్తున్నారు. దాదాపు 2 గంటల తర్వాత కస్తూరి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై దక్షిణ రైల్వే సరైన విచారణకు ఆదేశించింది. కస్తూరికి వివాహమై 9 నెలలు కావస్తుండడంతో ఆర్డీఓ. విచారణకు సిఫారసు చేశారు.

Advertisement
Advertisement