మరో ఆరు వైద్య కళాశాలలు | Sakshi
Sakshi News home page

మరో ఆరు వైద్య కళాశాలలు

Published Sat, May 25 2024 4:10 PM

-

కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

సాక్షి, చైన్నె: రాష్ట్రంలో మరో ఆరు వైద్యకళాశాలలు ఏర్పాటు కానున్నాయి. కేంద్ర వైద్య విద్యా కౌన్సిల్‌ ఇందుకు సంబంధించిన అనుమతులను శుక్రవారం జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో వైద్య కళాశాలల సంఖ్య 80కు చేరనుంది. దేశంలోనే తమిళనాడులో అత్యధికంగా వైద్య కళాశాలలు ఉన్నాయి. అందుకే చైన్నె వైద్య హబ్‌గా మారింది. రాష్ట్రంలో 38 జిల్లాలు ఉండగా, జిల్లాకు ఒకటి చొప్పున వైద్య కళాశాల ఏర్పాటుపై పాలకులు దృష్టి పెడుతున్నారు. ప్రస్తుతం 38 ప్రభుత్వ, 36 ప్రైవేటు వైద్య కళాశాలలు రాష్ట్రంలో ఉన్నాయి. 74గా ఉన్న ఈ సంఖ్య 80కు చేర్చే విధంగా మరో ఆరు కళాశాలలకు ప్రస్తుతం అనుమతులు దక్కాయి. ఈ ఆరు కళాశాలలు ప్రభుత్వానికి చెందినవే కావడం విశేషం. కొత్తగా ఆవిర్భవించిన మైలాడుతురై, తెన్‌కాశి, తిరుపత్తూరు జిల్లాలో తొలివిడతగా మూడు కళాశాలల పనులకు శ్రీకారం చుట్టనున్నారు. తర్వాత కొత్తగా ఆవిర్భవించిన మరో జిల్లా రాణిపేట కేంద్రంలో ఒకటి, ఈ జిల్లా పరిధిలోని అరక్కోణంలో మరొకటి, వెనుకబడిన జిల్లా పెరంబలూరులో మరకొటి ఏర్పాటు కానున్నాయి. ఈ ఆరు ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రులుగా ఒక్కొక్కటి 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణ పనులు చేపట్టనున్నారు. తొలి విడతగా నిర్మాణాలు పూర్తిచేసుకునే కళాశాలలో 2025లో వైద్య సీట్లభర్తీ దిశగా కసరత్తులు చేపట్టబోతున్నారు. మలి విడత నిర్మాణ పనులు జరిగే కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ 2026లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల కోడ్‌ ఎత్తివేత తర్వాత నిధుల ఆధారం మేరకు ఒకే సారిగా అన్ని కళాశాలల పనులు ఒకేసారి చేపట్టేందుకు సైతం సీఎం స్టాలిన్‌ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అని వైద్య విద్యా డైరెక్టరేట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. కాంచీపురంలోని ప్రభుత్వ కేన్సర్‌ ఆస్పత్రి విస్తరణకు సైతం కేంద్రం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించడం విశేషం.

Advertisement
 
Advertisement
 
Advertisement