హార్బర్‌లలో తుపాన్‌ అలర్ట్‌ | Sakshi
Sakshi News home page

హార్బర్‌లలో తుపాన్‌ అలర్ట్‌

Published Sat, May 25 2024 4:10 PM

-

● పశ్చిమ కనుమల్లో వీడని వర్షాలు ● జలాశయాల్లోకి పెరిగిన నీటి రాక

సాక్షి, చైన్నె: బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది తుపాన్‌గా బల పడనుండడంతో రాష్ట్రంలోని తొమ్మిది హార్బర్‌లలో హెచ్చరిక సూచిక ఎగురవేశారు. ఈ ప్రభావంతో పశ్చిమ కనుమల వెంబడి తమిళ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.

మరో రెండు రోజుల్లో అగ్నినక్షత్రం ముగియనుంది. ఈ ఏడాది అగ్నినక్షత్రం వేళ భానుడి సెగ కన్నా, అకాల వర్షం ప్రభావం అధికంగా ఉండడంతో వాతావరణం అనేక జిల్లాల్లో చల్లబడింది. ప్రధానంగా రాష్ట్రంలోని పశ్చిమ పర్వత శ్రేణుల వెంబడి ఉన్న జిల్లాలు కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్‌కాశి, విరుదునగర్‌, తేని, దిండుగల్‌, కోయంబత్తూరు, తిరుప్పూర్‌, ఈరోడ్‌, నీలగిరి జిల్లాల్లో వాతావరణం పూర్తిగా మారింది. ఈ జిల్లాలోని వాగులు, వంకలు ఇప్పటికే పొంగిపొర్లుతున్నాయి. ఎండిపోయి ఉన్న జలాశయాలలో ప్రస్తుతం నీటి మట్టం అమాంతంగా పెరుగుతోంది. ఈ సమయంలో జూన్‌ ఒకటవ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనుండడంతో ఈ ప్రభావంతో పై జిల్లాల్లో మరింతగా వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఇక్కడి జలాశయాలు, చెరువులు, నీటి పరివాహక ప్రదేశాలపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. శుక్రవారం కూడా పై జిల్లాల్లో అనేక చోట్ల మోస్తరు, మరికొన్ని చోట్ల సాధారణంగా వర్షాలు పడుతుండడం విశేషం.

హార్బర్‌లలో అలర్ట్‌..

బుధవారం బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని చైన్నె నుంచి కన్యాకుమారి వరకు పదికి పైగా ఉన్న సముద్రతీర జిల్లాలో అలల తాకిడి పెరిగింది. సముద్రుడు తీవ్ర ఆక్రోశంతో ఉన్నట్టుగా కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. దీంతో జాలర్లు తమ పడవలను ఒడ్డును మరింత సురక్షితం చేసుకునే పనిలో పడ్డారు. జాలర్లు చేపల వేట నిమిత్తం సముద్రంలోకి వెళ్ల లేదు. వాయుగుండం తుపాన్‌గా మారి పశ్చిమబెంగాల్‌ వైపు ప్రయాణించనున్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. రీమాల్‌ అని ఈ తుపాన్‌కు నామకరణం చేశారు. దీని ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండనప్పటికీ నైరుతి రుతుపవనాల ప్రవేశ నేపథ్యంలో గాలుల ప్రభావంతో పశ్చిమ కనుమల వెంబడి ఉన్న జిల్లాలలో వర్షాలు కొనసాగనున్నాయి. ఈనెల 28 వరకు ఈ వర్షాలు కొనసాగుతాయి. తర్వాత నైరుతి రుతుపవనాల ప్రవేశంతో వర్షాల తీవ్రత అధికంగా ఉంటుందని అంచనా వేశారు. సముద్రంలో రీమాల్‌ తుపాన్‌ నేపథ్యంలో రాష్ట్రంలోని చైన్నె ఎన్నూరు, పుదుచ్చేరి, కారైక్కాల్‌, కడలూరు, నాగపట్నం, తూత్తుకుడి, రామనాథపురం, కన్యాకుమారి తీరాల్లోని హార్బర్‌లలో తుపాన్‌ హెచ్చరిక సూచిని ఎగుర వేశారు. కెరటాల జడితో పాటు సముద్ర తీరంలో 55 కిమీ వేగానికి పైగా గాలి ప్రభావం ఉండడంతో బీచ్‌ల వైపు వెళ్లే వారు జాగ్రత్తగా వ్యవహరించాలన్న హెచ్చరికలు జారీ అయ్యాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement