తైవాన్ అమ్మాయి.. కరైకుడి అబ్బాయి..
●తమిళ సంప్రదాయంలో వివాహం
అన్నానగర్: కారైకుడికి చెందిన ఓ యువకుడు తైవాన్ యువతిని ప్రేమించి తమిళ సంస్కృతి ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. వివరాలు.. శివగంగై జిల్లా కారైకుడి సమీపంలోని పాధరకుడికి చెందిన ఆరుముగం రెండో కుమారుడు సతీష్ కుమార్. ఇతను గత 6 సంవత్సరాలుగా తైవాన్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆ సమయంలో తైవాన్‌కు చెందిన హో హాసిన్ హీతో ప్రేమలో పడ్డాడు. ఇదిలా ఉండగా సతీష్ కుమార్ ఉద్యోగం మారడంతో ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సతీష్ కుమార్, హో హాసిన్ హీ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇద్దరూ తమ తల్లిదండ్రులకు చెప్పారు. ఇరు కుటుంబీకులు అంగీకరించారు. దీంతో హో హాసిన్ హీ తల్లిదండ్రులు తమిళ సంస్కృతి ప్రకారం వివాహాన్ని నిర్వహించడానికి అంగీకరించారు. దీని ప్రకారం అతని తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు అందరూ తైవాన్ నుంచి కరైకుడి వచ్చారు. ఆదివారం కారైకుడిలోని ఓ కల్యాణమండపంలో సతీష్ కుమార్, హో హాసిన్ హీ దంపతులు వేద మంత్రోచ్ఛారణలతో తమిళ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment