తీహార్‌ జైలుకే.. | - | Sakshi
Sakshi News home page

తీహార్‌ జైలుకే..

Published Fri, Jan 31 2025 2:26 AM | Last Updated on Fri, Jan 31 2025 2:26 AM

తీహార్‌ జైలుకే..

తీహార్‌ జైలుకే..

పాలారును కలుషితం చేస్తే

సాక్షి, చైన్నె: పాలారు నదిని కలుషితం చేసే వాళ్లు తీహార్‌ జైలుకు వెళ్తారని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హెచ్చరించారు. ఈ కలుషితం కారణంగా నష్టపోయిన బాధితులకు పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. సమగ్ర నివేదికకు నాలుగు నెలల గడువు కేటాయించారు. వివరాలు.. కర్ణాటక రాష్ట్రం నందిదుర్గం కొండల నుంచి పాలారు నది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. కర్ణాటకలో పాలారు నదిపై పేత్తమంగళ, విష్ణుసాగర్‌, రామ్‌సాగర్‌ అనే ఆనకట్టలు, కొన్ని చెక్‌డ్యాంలు ఉన్నాయి. కర్ణాటకలోని ఈ ఆనకట్టలను దాటుకుని నేరుగా ఆంధ్రప్రదేశ్‌కు ఈ నది చేరుకుంటుంది. అంధ్రప్రదేశ్‌లో కేవలం 33 కిలోమీటర్లు దూరం మాత్రమే ప్రవహించి అక్కడి పంటలను సస్యశ్యామలం చేసి వాణియంబాడి మీదుగా తమిళనాడు సరిహద్దుకు చేరుకుంటుంది. ఇలా.. తమిళనాడుకు చేరుకునే పాలారు వయలూరుకు సమీపంలో బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఈ నదిలో బోర్లను ఏర్పాటు చేసి పైప్‌ లైన్ల ద్వారా చైన్నె శివారులకు సరఫరా చేయడం జరుగుతోంది. అయితే ఈ నది కలుషితం అవుతోంది. ఇందుకు కారణం వేలూరు, రాణిపేట, తదితర జిల్లాలో పరిధిలో ఉన్న అనేక పాదరక్షలు, తోలు ఉత్పత్తి పరిశ్రమలు, సంస్థలే కారణం అన్నది ఇప్పటికే నిర్ధారణ అయింది. ఈనదీ జలాలను రైతులు ఉపయోగించ లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఈ వ్యవహారంపై గతంలో వేలూరు పర్యావరణ పరిరక్షణ కమిటీ కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసి విచారణ కు చర్యలు తీసుకుంది. కలూషితంకు కారణంగా ఉన్న పరిశ్రమలపై కొరడా ఝుళిపించే విధంగా చర్యలు, నష్ట పరిహారం, సుద్దీకరణ కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలపై దృష్టి పెట్టింది. అదే సమయంలో ఈ వ్యవహారం అప్పీల్‌ పిటిషన్‌గా సుప్రీంకోర్టుకు చేరింది.

పాలారు నది

సుప్రీంకోర్టు హెచ్చరిక

బాధితులకు నష్ట పరిహారం చెల్లింపునకు ఆదేశాలు

సమగ్ర నివేదికకకు 4 నెలల గడువు

సుప్రీంకోర్టు సీరియస్‌..

ఈ పిటిషన్‌ న్యాయమూర్తులు మహాదేవన్‌, పార్దివాలా బెంచ్‌లో విచారణలో ఉంది. గురువారం వాదనల అనంతరం న్యాయమూర్తులు స్పందిస్తూ తోలు, ఇతర పరిశ్రమల కారణంగా పాలారు కలుషితం అవుతోందని, ఈ కారణంగా పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుండటాన్ని చూస్తూ ఉండలేమన్నారు. ప్రజలు, రైతులు నష్ట పోతున్నారని గుర్తు చేస్తూ.. ఈ కలుషితం కట్టడి లక్ష్యంగా మార్గదర్శకాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రిటైర్డ్‌ న్యాయమూర్తితో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ ఉత్తర్వులు వెలువడిన రోజు నుంచి ఆరు వారాలలో బాధితులకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించారు. ఈ మొత్తాన్ని పాలారు తీరంలో కలుషితం చేస్తున్న సంస్థలు, పరిశ్రమల నుంచి వసూళ్లు చేసుకోవచ్చు అని సూచించారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, కలుషితం చేస్తున్న పరిశ్రమల లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను నాలుగు నెలలో దాఖలు చేయాలని పేర్కొన్నారు. అదే సమయంలో న్యాయమూర్తి పార్దివాలా స్పందిస్తూ, ఈ ఉత్తర్వులకు కట్టుబడకుండా పాలారును కలుషితం చేసే వాళ్లు తీహార్‌ జైలుకు వెళ్తారని హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement