కాంగ్రెస్‌ను నమ్మితే.. శంకరగిరి మాన్యాలే | don not trust congress ktr jadcherla tour | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ను నమ్మితే.. శంకరగిరి మాన్యాలే

Published Fri, Jun 9 2023 3:01 AM | Last Updated on Fri, Jun 9 2023 3:46 PM

don not trust congress ktr jadcherla tour - Sakshi

జడ్చర్ల: కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని 55 ఏళ్లు పాలించినా ఏనాడూ ప్రజా సమస్యలు పట్టించుకోలేదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు. ఎన్నికలు వస్తున్నందున మాకొక అవకాశమివ్వండి అంటూ కాంగ్రెస్‌ సన్నాసులు నక్క వినయాలు ప్రదర్శించి మీ ముందుకు వస్తున్నారని చెప్పారు. వారిని పొరపాటున నమ్మితే మిమ్మల్ని శంకరగిరి మాన్యాలు పట్టిస్తారని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిందేమిటో.. అలాగే తాము చెడగొట్టింది ఏమిటో చెప్పాలని నిలదీశారు. జడ్చర్లలో రూ.33.03 కోట్లతో నిర్మించిన 560 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో కేటీఆర్‌ మాట్లాడారు.

రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, దళితబంధు వంటి పథకాలు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవని ప్రశ్నించారు. నాటి కాంగ్రెస్‌ పాలనలో రెండు దఫాలుగా ఇచ్చే ఆరు గంటల కరెంట్‌తో రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. ఎవరైనా చస్తే మేం అంత్యక్రియలకు పోతున్నాం బావి దగ్గర స్నానాలకు ఒక అరగంట పాటు కరెంట్‌ ఇవ్వండని విద్యుత్‌ సిబ్బందిని బతిమిలాడిన రోజులను ఎలా మరిచిపోతామన్నారు. నేడు 24 గంటలూ కరెంట్‌ ఇస్తున్న ఘనత తమదేనని స్పష్టంచేశారు. ‘నాడు తాగునీటికి గోస ఉండే.. 14 రోజులకోసారి తాగునీళ్లు వచ్చేది. తెలంగాణ రాక ముందు ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి వెళ్లాలంటే తాగునీటి సమస్యలపై బిందెలు అడ్డుపెట్టి కుండలు మర్లేసి తంతరనే భయం ఉండేది. ఇప్పుడా పరిస్థితి ఎక్కడైనా ఉందా’అని అన్నారు.  
 
అభివృద్ధిపై చర్చకు సిద్ధం 
రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని అంటున్నారని.. లెక్కలతో రండి బట్టలూడదీస్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ‘జడ్చర్లలో మా లక్ష్మన్న, మహబూబ్‌నగర్‌లో శ్రీనన్నలు అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్‌ నాయకులు దమ్ముంటే చర్చకు రావాలి. కోర్టు కేసులతో కాంగ్రెస్‌ సన్నాసులు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రయతి్నస్తున్నా.. వాయువేగంతో 90 శాతం పనులు పూర్తిచేశాం. ఆగస్టులో కర్వెన రిజర్వాయర్‌ను కృష్ణా జలాలతో నింపుతాం. ఉదండాపూర్‌నూ త్వరగా పూర్తిచేసి జడ్చర్ల నియోజకవర్గంలోని 1.44 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం’అని చెప్పారు. ‘ఒకాయన 800 కి.మీ. తిరిగిన అంటూ బోర్డులు పట్టుకుని తిరుగుతుండ్రు. నాడు మీరు అభివృద్ధి చేసి ఉంటే.. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి ఉంటే.. ఇప్పుడు సన్నాసి యాత్రలు ఉండేవా’అని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కోరిక మేరకు జడ్చర్ల మున్సిపాలిటీని గ్రేడ్‌–1గా మారుస్తామని, పట్టణ అభివృద్ధికి రూ.30 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ సాయిచంద్‌ తదితరులు పాల్గొన్నారు. 
 
ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు  
జెడ్పీ సెంటర్‌/భూత్పూర్‌/అడ్డాకుల: మహబూబ్‌నగర్‌ జిల్లాలోని భూత్పూర్‌ మున్సిపాలిటీ, మూసాపేట, జిల్లా కేంద్రంతోపాటు జడ్చర్లలో మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా భూత్పూర్‌ మున్సిపాలిటీలో మినీ ట్యాంక్‌బండ్‌పై ఓపెన్‌జిమ్‌ను ప్రారంభించారు. అనంతరం మూసాపేట మండలం వేముల సమీపంలోని ఎస్‌జీడీ ఫార్మా వద్ద రూ.500 కోట్లతో కొత్తగా ఎస్‌జీడీ ఫార్మా కార్నింగ్‌ టెక్నాలజీ ఫ్లాంట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌కు చేరుకున్న కేటీఆర్‌ మెట్టుగడ్డలోని మహిళా ఐటీఐ కాలేజీ ఆవరణలో సెయింట్‌ ఫౌండేషన్, శాంతానారాయణగౌడ్‌ చారిటబుల్‌ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్మించనున్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం జడ్చర్లలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించారు. కాగా, జడ్చర్లలోని నేతాజీ చౌరస్తాలో కొందరు బీజేపీ కార్యకర్తలు కేటీఆర్‌ కాన్వాయికి అడ్డుగా రావడంతో కాసేపు నిలిపివేశారు. వెంటనే స్పందించిన పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement