సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న ఊహాగానాలు, ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెడుతూ బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. బండి సంజయ్ స్థానంలో.. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న గంగాపురం కిషన్‌రెడ్డిని రాష్ట్ర పార్టీ చీఫ్‌గా నియమించింది. ఇదే సమయంలో పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ఎన్నికల నిర్వహణ కమిటీ బాధ్యతలు అప్పగించింది.
పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ మంగళవారం మధ్యాహ్నం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన బండిని త్వరలోనే కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతుండగా, దీనిపై మరో రెండు, మూడురోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.
అనుభవం, అణుకువ ప్రామాణికంగా..
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడి మార్పు సహా పలు కమిటీల నియామకంపై బీజేపీ అధిష్టానం గడిచిన నెల రోజులుగా చర్చోపచర్చలు కొనసాగించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌లు ఈ అంశాలపై దృష్టి పెట్టారు. రాష్ట్ర నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధికార బీఆర్ఎస్ను ఢీ కొట్టాలంటే మార్పు చేర్పులు అవసరమని కొందరు పార్టీ నేతలు అధిష్టానానికి సూచించారు.
రాష్ట్ర నాయకత్వంపై తమ అసంతృప్తిని కొందరు అగ్రనేతల దృష్టికి తీసుకెళ్లారు. ఇదే సమయంలో నేతల మధ్య సమన్వయ లేమిని జాతీయ నాయకత్వం పరిగణనలోకి తీసుకుందని, సంజయ్‌ను తప్పించాలనే నిర్ణయానికి వచ్చిందని సమాచారం. కాగా ఈటల రాజేందర్, డీకే అరుణ సహా మరొకొందరి పేర్లు పరిశీలించిన బీజేపీ అధిష్టానం చివరికి పార్టీలో సుదీర్ఘ అనుభవం, అణుకువ, విధేయతలు ప్రామాణికంగా తీసుకుని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డిని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది.
యువ మోర్చా రాష్ట్ర, జాతీయ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించడం, మూడుసార్లు ఎమ్మెల్యే ఉండటం, గతంలోనూ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయడం, ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా ఉండటం, అన్నింటికన్నా ముఖ్యంగా తెలంగాణలో బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో కిషన్‌రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపింది. అయితే కిషన్‌రెడ్డిని కేంద్ర మంత్రిగా కొనసాగిస్తారా? లేక తొలగిస్తారా? అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. బీజేపీలో జోడు పదవుల వ్యవహారం లేనందున ఆయన్ను కేంద్ర కేబినెట్ నుంచి తొలగిస్తారని ప్రచారం జరుగుతున్నా దీన్ని ఎవరూ ధ్రువీకరించడం లేదు. దీనిపైనా రెండు, మూడురోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.
చదవండి: బండి సంజయ్ ను ఎందుకు తప్పించారు?
అన్నీ పరిగణనలోకి తీసుకుని ఈటలకు బాధ్యతలు
రాష్ట్ర అధ్యక్ష పదవికి తొలినుంచి బలమైన పోటీదారుగా ఉన్న ఈటల రాజేందర్‌ను అత్యంత కీలకమైన ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా బీజేపీ నియమించింది. రాష్ట్రంలో అధికంగా ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, అందులోనూ అత్యంత కీలకమైన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారవడం, సీఎం కేసీఆర్‌ను ఎదిరించి పార్టీలోంచి బయటకు వచ్చి పోరాడుతున్న నేతగా పేరుండటం, అన్ని పార్టీలు, వర్గాలు, తెలంగాణ ఉద్యమ సంఘాలతో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం ఈటల ఎంపికకు కలిసొచ్చిందని చెబుతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకునే ఎన్నికల ప్రచార బాధ్యతలు, వ్యూహాల ఖరారు, అభ్యర్థుల ఎంపిక అంశాలపై పట్టు ఉండే ఎన్నికల నిర్వహణ కమిటీ బాధ్యతలు ఆయనకు కట్టబెట్టినట్లు తెలుస్తోంది.
నడ్డాతో సంజయ్ భేటీ
రాష్ట్ర అధ్యక్షుడి మార్పు సహా పలు ఇతర అంశాలపై చర్చించేందుకు అధిష్టానం పెద్దల పిలుపు మేరకు ఢిల్లీకి వచ్చిన బండి సంజయ్ మంగళవారం మధ్యాహ్నం పార్టీ జాతీయ కార్యాలయంలో జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే అధ్యక్ష పదవికి సంజయ్ రాజీనామాను తీసుకున్నారు. కొత్త అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి ఎంపికకు గల కారణాలు, మున్ముందు పార్టీలో, కేంద్ర పదవుల్లో కల్పించే ప్రాధాన్యం, ఇతర అంశాలను సంజయ్‌కు నడ్డా వివరించారు.
కేంద్ర కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో చోటు కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తున్నా దీనిపై స్పష్టత రాలేదు. భేటీ అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడకుండానే అక్కడినుంచి వెళ్లిపోయారు. ఇక అదే సమయంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు సైతం నడ్డాతో భేటీ అయినట్లు తెలిసింది. ఎస్టీ సామాజికవర్గం నుంచి ఆయనకు కేబినెట్‌లో చోటు దక్కుతుందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్న సమయంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
కమల దళపతి కిషన్‌రెడ్డి
Published Wed, Jul 5 2023 1:00 AM | Last Updated on Wed, Jul 5 2023 7:35 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment