
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు కాస్త ఆలస్యంగా ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ అంచనావేస్తోంది. గత రెండు సీజన్లతో పోలిస్తే ప్రస్తుతం పది నుంచి పదిహేను రోజులు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా విశ్లేషిస్తోంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈనెల రెండో వారంలో రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి.
ఈనెల మొదటి వారంలో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు క్రమంగా ముందుకు సాగుతూ తెలంగాణకు చేరుకునేందుకు వారం రోజుల నుంచి పది రోజుల సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ సైతం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. గత రెండు సీజన్లలో రుతుపవనాల రాకను పరిశీలిస్తే.. 2021 వర్షాకాలంలో నైరుతి రుతుపవనాలు మే నెలాఖరులో కేరళను తాకగా.. జూన్ మూడో తేదీ నుంచి ఆరో తేదీ మధ్య రాష్ట్రాన్ని తాకాయి. అదేవిధంగా గతేడాది మే 30వ తేదీన కేరళను తాకిన రుతుపవనాలు రాష్ట్రానికి జూన్ 8వ తేదీకి చేరుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి ఐదు రోజులు ఆలస్యంగా రానున్నట్లు వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు.
సాధారణ వర్షపాతం..
జూన్ ఒకటవ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ మధ్య కాలాన్ని నైరుతి సీజన్(వానాకాలం)గా భావిస్తారు. ఈ క్రమంలో నాలుగు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా సగటున 75.19 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు తయారు చేసింది. అయితే గత రెండేళ్లుగా రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కంటే 50 శాతం అధిక వర్షాలు కురిశాయి. 2021లో రాష్ట్రంలో 111.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, 2022 సీజన్‌లో 109.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే అధిక వర్షాలు నమోదు కావడంతో రాష్ట్రంలో చెరువులు, కుంటలు నీటితో నిండుకుండలుగా మారాయి.
రెండు రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: పశి్చమ విదర్భ నుంచి మరాఠ్వాడ, ఉత్తర కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన ఉపరితలద్రోణి స్థిరంగా కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడా చెదురుమదురుగా, కొన్ని చోట్ల మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదు కావచ్చని వివరించింది. కాగా, వివిధ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల సెల్సియస్ నుంచి 42 డిగ్రీల సెల్సియస్ మధ్యన నమోదు కావొచ్చని, గ్రేటర్ హైదరాబాద్ పరిసర జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్ నుంచి 41 డిగ్రీల మధ్యన నమోదు కావచ్చని తెలిపింది. బుధవారం రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా కీతవారిగూడెంలో 44.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.
ఇది కూడా చదవండి: మిక్స్‌డ్ వెదర్‌తో మహా డేంజర్!
Comments
Please login to add a commentAdd a comment