సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకు గ్రేటర్ నగరంలోని ప్రధాన రహదారుల మార్గాల్లో నిర్మించిన స్లిప్, లింక్ రోడ్లతో కలిగిన ప్రయోజనాన్ని పరిగణనలోకి తీసుకున్న అధికారులు శివారు ప్రాంతాలపై దృష్టి సారించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నగరానికి చుట్టూ ఉన్న స్థానిక సంస్థల్లోని పది మున్సిపల్ కార్పొరేషన్లు/మున్సిపాలిటీల పరిధిలో సాఫీ ప్రయాణానికి అనువుగా 32 లింక్‌రోడ్లను ప్రతిపాదించారు. ముఖ్యంగా ఆయా ప్రాంతాల నుంచి ఔటర్‌రింగ్‌రోడ్ (ఓఆర్‌ఆర్) సర్వీసు రోడ్లకు రాకపోకలు సాగించేందుకు వీలుగా వీటిని నిర్మించేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు రీజినల్ రింగ్‌రోడ్, ఇంటింటికీ నీటి సరఫరా రెండో విడత పనులు జరగనుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో శివార్లలో పెరగనున్న ట్రాఫిక్ ఒత్తిడిని కూడా పరిగణనలోకి తీసుకొని వివిధ ప్రాంతాల్లో ప్రయాణ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ ప్రణాళిక రూపొందించారు.
మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఇటీవల శివారు ప్రాంతాలపై ఎక్కువ దృష్టి సారించడం.. గ్రేటర్ చుట్టూ ఉన్న ప్రాంతాలను కూడా గ్రేటర్‌లోవిగానే భావించి సదుపాయాలు కల్పిస్తామని పేర్కొనడం తెలిసిందే. ఆయన ఆదేశాలకనుగుణంగానే సంబంధిత అధికారులు ఈ ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రతిపాదిత లింక్‌రోడ్ల పొడవు దాదాపు 103 కిలోమీటర్ల కాగా, వీటి నిర్మాణానికి రూ.1200 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ నిధుల్ని ఎలా సమకూర్చుకోనున్నారో తెలియాల్సి ఉంది.
చదవండి: (హైదరాబాద్: ఊపిరి ఉక్కిరిబిక్కిరి!.. ఏడాదికి 98 రోజులు అంతే)
80–100 అడుగులకు విస్తరణ
లింక్ రోడ్లలో భాగంగా ఆయా మార్గాల్లో కొంత మేర రోడ్డు ఉండి ఎక్కడైనా లింక్ లోపిస్తే ఆ మేరకు కొత్తగా రోడ్డు నిర్మిస్తారు. రోడ్డు ఉన్నప్పటికీ, అధ్వా నంగా ఉంటే.. అభివృద్ధి చేసి బలపరుస్తారు. బాటిల్‌నెక్‌గా ఉన్న ప్రాంతాల్లో విస్తరిస్తారు. ప్రస్తుతం 20– 40 అడుగుల వెడల్పు మాత్రమే ఉన్న రోడ్లను నగరంలో మాదిరిగా 80– 100 అడుగుల వరకు విస్తరిస్తారు. ఎలాంటి ఆటంకాల్లేకుండా సాఫీ ప్రయాణమే లక్ష్యంగా వీటిని నిర్మించనున్నారు.
ఎక్కడెక్కడ.. ఎన్ని రోడ్లు..
ఏ స్థానిక సంస్థ పరిధిలో ఎన్ని లింక్ రోడ్లకు ప్రతిపాదనలు రూపొందించారో వివరాలిలా ఉన్నాయి.
బండ్లగూడ జాగీర్–6, కొత్తూరు–3,
బడంగ్‌పేట్–3, శంషాబాద్–4, ఘట్‌కేసర్–3, దమ్మాయిగూడ–3,
నాగారం–2, ఇబ్రహీంపట్నం–2,
మణికొండ–2, జవహర్‌నగర్ కార్పొరేషన్–4.
Comments
Please login to add a commentAdd a comment