సాక్షి, హైదరాబాద్: పార్టీ ఇచ్చిన పనిని అందరూ చేయాల్సిందేనని, ఇందులో ఎవరికీ మినహాయింపు ఉండదని ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు స్పష్టం చేశారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శులుగా నియమితులైన నేతలు తమ తమ నియోజకవర్గాల్లో పార్టీ పనులు చేసుకుంటూనే తమకు కేటాయించిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇచ్చిన బాధ్యతలను నెరవేర్చాల్సిందేనని వెల్లడించారు.
మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శులతో భేటీ అయిన బోసురాజు.. రాష్ట్రంలో జరుగుతున్న హాథ్ సే హాథ్ జోడో అభియాన్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ హాథ్ సే హాథ్ జోడోయాత్ర తమ నియోజకవర్గాల్లో కూడా నిర్వహిస్తున్నందున తమ కు కేటాయించిన నియోజకవర్గాలకు వెళ్లడం కష్టంగా ఉందనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
దీంతో పార్టీ ప్రధాన కార్యదర్శులుగా ఎంపికైన నేతలు పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలు చక్కబెట్టాల్సిందేనని, తమ నియోజకవర్గాలతో పాటు బాధ్యతలిచ్చిన 2, 3 నియోజకవర్గాల్లో కూడా హాథ్ సే హాథ్ జోడో యాత్రలపై అక్కడకు వెళ్లి నివేదికలు తయారు చేయాలని స్పష్టంచేశారు. ఈనెల 6 లోపు తమకు కేటాయించిన స్థానాల్లో వెళ్లి రిపోర్టు చేయాలని, అక్కడ హాథ్ సే హాథ్ జోడో యాత్రలు జరుగుతున్న తీరుపై పార్టీకి సమా చారం ఇవ్వాలని ఆదేశించారు.
సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, ముఖ్య నేతలు సంభాని చంద్రశేఖర్, గడ్డం వినోద్, చెరుకు సుధాకర్, సంగిశెట్టి జగదీశ్వరరావులతో పాటు టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు వజ్రేశ్‌యాదవ్, విజయారెడ్డి, చరణ్‌కౌశిక్ యాదవ్, చల్లా నర్సింహారెడ్డి, భూపతిరెడ్డి నర్సారెడ్డి, బాలలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment