బాధ్యులెవరు బాసూ!  | No Congress In Charge For 25 Constituencies In Telangana State | Sakshi
Sakshi News home page

బాధ్యులెవరు బాసూ! 

Mar 19 2022 2:32 AM | Updated on Mar 19 2022 8:23 AM

No Congress In Charge For 25 Constituencies In Telangana State - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావొచ్చని పదే పదే చెబుతున్న రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వం క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులను మాత్రం చక్కదిద్దుకోలేకపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీకి బాధ్యులు లేకు న్నా టీపీసీసీ అగ్ర నేతలు మిన్నకుండి పోవడం గాంధీభవన్‌ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.

మరో 10 చోట్ల అసలు ఇన్‌చార్జి ఎవరో తెలియని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికలకు 6 నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామనే ధీమా నుంచి ఇప్పుడు కనీసం నియోజకల బాధ్యులెవరో తేల్చుకోలేని పరిస్థితి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని రాజకీయ వర్గాలు అం చనా వేస్తున్నాయి. ఆయా నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించకపోతే రెండో స్థానం కోసం పోటీ పడటం తప్ప గత్యంతరం ఉండబోదని అంటున్నాయి.  

ఖమ్మంలో 8  సెగ్మెంట్లలో బాధ్యులెవరో! 
ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే పార్టీ చాలా బలంగా ఉందనుకుంటున్న ఖమ్మం జిల్లాల్లో 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు బాధ్యులెవరో తెలియని పరిస్థితి. మధిర, భద్రాచలంలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు తప్పిస్తే ఎక్కడా పార్టీకి బాధ్యులు లేకుండా పోయారు. ఖమ్మం, సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలను గతంలో టీడీపీకి కేటాయించారు. కొత్తగూడెం, పినపాక, ఇల్లెందు, పాలేరుల నుంచి గెలిచిన ఎమ్మెల్యే లు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోయారు. వైరాలో గత ఎన్నిక ల్లో పోటీ చేసిన అభ్యర్థి క్రియాహీనంగా ఉండటంతో వచ్చే ఎన్నికల్లో పార్టీ ఎలాగెలుస్తోందో ప్రశ్నార్థకంగా మారింది.  

ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్‌లలోనూ.. 
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నకిరేకల్‌ ఎమ్మెల్యే కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లగా అక్కడ ఇన్‌చార్జి లేడు. ఆలేరు నుంచి బూడిద భిక్షమయ్యగౌడ్‌ టీఆర్‌ఎస్‌లోకి వెళ్లాక పూర్తి స్థాయి ఇన్‌చార్జి లేని పరిస్థితి. బీర్ల అయిలయ్య క్రియాశీలంగానే పనిచేస్తున్నా ఆయనకు బాధ్యతలు ఇవ్వలేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని కొల్లాపూర్‌లో హర్షవర్ధన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరాక అభిలాశ్, జగదీశ్వర్‌రావు కాంగ్రెస్‌లోకి వచ్చినా వారిలో ఎవరికీ ఇన్‌చార్జి బాధ్యతలివ్వలేదు. మక్తల్‌లోనూ బాధ్యుడు లేని పరిస్థితుల్లో వాకిటి శ్రీహరి కొంత మేర పార్టీకి అండగా ఉంటున్నారు.  

రంగారెడ్డిలో ఇలా.. హైదరాబాద్‌లో అలా..  
వరంగల్‌ జిల్లాలోని భూపాలపల్లి, వర్ధన్నపేట, వరంగల్‌ తూర్పు, మహబూబాబాద్‌ సీట్లలో బాధ్యుల్లేరు. ఆదిలాబాద్‌ జిల్లా సిర్పూర్‌ నుంచి పాల్వాయి హరీశ్‌ బీజేపీలో చేరాక అక్కడ పార్టీకి ఓ నాథుడు లేని పరిస్థితి. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరులోనూ ఇదే పరిస్థితి. కరీంనగర్‌లో జిల్లా కేంద్రం నుంచి గత ఎన్నికల్లో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ పోటీ చేసినా ఇప్పుడు ఆయన కూడా అసెంబ్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించట్లేదు. సిరిసిల్లలో మహేందర్‌రెడ్డి క్రియాశీలంగా లేని పరిస్థితి. రంగారెడ్డి జిల్లా పరిధిలోనికి వచ్చే చేవెళ్ల, మహేశ్వరం, ఉప్పల్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లిలో కూడా బాధ్యుల్లేరు. హైదరాబాద్‌ పాత బస్తీని మినహాయించినా గోషామహల్, ముషీరాబాద్, సికింద్రాబాద్‌లో కూడా ఇదే పరిస్థితి.  

మేమంటే మేం ఇన్‌చార్జులమంటూ..! 
కొన్ని చోట్ల ఇద్దరు, ముగ్గురు నేతలు తామంటే తాము ఇన్‌చార్జులమని చెప్పుకుంటున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఇప్పుడు సభ్యత్వం డబ్బులు ఎవరు కట్టాలో కూడా సమస్యగా మారుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికలను కాంగ్రెస్‌ ఎలా ఎదుర్కొంటుందో మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement