టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసు: ఖాకీ అంటే మోజు.. సెల్యూట్‌ అంటే క్రేజు!  | Aim to become DSP or Jail Superintendent says Praveen Kumar | Sakshi
Sakshi News home page

TSPSC Paper Leak Case: ఖాకీ అంటే మోజు.. సెల్యూట్‌ అంటే క్రేజు! 

Published Thu, Apr 13 2023 3:58 AM | Last Updated on Thu, Apr 13 2023 4:27 PM

Aim to become DSP or Jail Superintendent says Praveen Kumar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజ్‌ స్కామ్‌లో సూత్రధారిగా ఉన్న కమిషన్‌ కార్యదర్శి మాజీ వ్యక్తిగత సహాయకుడు పులిదిండి ప్రవీణ్‌ కుమార్‌కు పోలీసు డిపార్ట్‌మెంట్‌ అంటే ఎంతో మోజు.. యూనిఫామ్‌లో వస్తున్న వారిని చూసి ఎదుటి వాళ్లు చేసే సెల్యూట్‌ అంటే మహా క్రేజ్‌. అయితే ‘ఖాకీ’ఉద్యోగం సంపాదించడానికి కష్టపడకుండా ఇతగాడు అడ్డదారులు తొక్కాడు.  

తండ్రి ఖాకీ ఉద్యోగం రాకపోవడంతో.. 
ప్రవీణ్‌ తండ్రి ఏపీ రాజమండ్రికి చెందిన పి.హరిశ్చంద్రారావు డీజీపీ కార్యాలయం ప్రెస్‌కు అదనపు ఎస్పీగా పని చేస్తూ అనారోగ్యంతో మరణించారు. కారుణ్య నియామకం కింద తనకు ఆ ఉద్యోగమే వస్తుందని భావించాడు. నిబంధనలు, అతడి అర్హత పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం ఇచ్చింది.

అయితే ఎలాగైనా డీఎస్పీ లేదా జైళ్ల శాఖలో సూపరింటెండెంట్‌ అయి యూనిఫామ్‌ వేసుకోవాలని భావించిన ప్రవీణ్‌ కుమార్‌ గ్రూప్‌–1 పరీక్షకు దరఖాస్తు చేసుకున్నాడు. రాజశేఖర్‌రెడ్డి సహాయంతో కస్టోడియన్‌ శంకర లక్ష్మి కంప్యూటర్‌ను యాక్సస్‌ చేసి గ్రూప్‌–1 పేపర్‌ తస్కరించాడు. అయితే ప్రవీణ్‌ కుమార్‌ తన ఓఎంఆర్‌ షీట్‌ను డబుల్‌ బబ్లింగ్‌ చేయడంతో తిరస్కరించిన కమిషన్‌ వాల్యూషన్‌ చేయలేదు. 

కనీసం సొమ్మైనా చేసుకుందామని... 
డబుల్‌ బబ్లింగ్‌తో ‘ఖాకీ పోస్టుకు’అవకాశం కోల్పోయిన ప్రవీణ్‌కు పేపర్లు అమ్మి సొమ్ము చేసుకోవాలని దుర్భుద్ది పుట్టింది. ఈ నేపథ్యంలోనే మరో ఐదు పరీక్షలకు సంబంధించిన 14 పరీక్ష పత్రాలను రాజశేఖర్‌ సాయంతో చేజిక్కించుకున్నాడు. వీటిలో ఏఈ ప్రశ్నపత్రంలో పాటు డీఏఓ పేపర్‌ను ఐదుగురికి రూ.50 లక్షలుకు విక్రయించి రూ.29.45 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు.

మిగిలిన పేపర్లు విక్రయించే ప్రయత్నాల్లో ఉండగానే విషయం వెలుగులోకి రావడంతో కటకటాల్లోకి చేరాడు. తన మాదిరిగానే డబుల్‌ బబ్లింగ్‌ చేసిన వాళ్లు దాదాపు 8వేలమంది ఉన్నట్టు ప్రవీణ్‌ గుర్తించాడు. వీరిలో కొందరిని సంప్రదించి సహాయం చేస్తానని నమ్మబలికి వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేసి టచ్‌లో ఉన్నాడు. సిట్‌ దర్యాప్తులో ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement