వెయ్యిమంది అమరుల స్మారకస్తూపం, రాంజీగోండు విగ్రహం
నిర్మల్: నిర్మల్ ప్రాంతం సాహసోపేతమైన వీరుల పోరాటానికి, వారి అసమాన త్యాగాలకు ఓ నిదర్శనం. జలియన్‌వాలాబాగ్ ఘటన కంటే ఏళ్ల ముందే.. అంతకంటే దారుణమైన ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. ఒకే మర్రి చెట్టుకు వెయ్యి మందిని ఉరి తీశారు. అంతకు ముందు ఓ అడవిబిడ్డ అందరినీ కూడగట్టి చేసిన వీరోచిత పోరు గుర్తు చేసుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. 17న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నిర్మల్‌కు రానున్న నేపథ్యంలో మరో సారి వెలుగులోకి వస్తున్న ఇక్కడి చరిత్ర నిన్న మొన్నటిది కాదు.. ఎప్పుడో 1857 నాటిది.
ఆంగ్లేయులకు చుక్కలు చూపించారు
దేశంలో అప్పుడు జరిగిన ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో నిర్మల్ గడ్డ కూడా భాగమైంది. ఆ సంగ్రామాన్ని అణచి వేసేందుకు ఆంగ్లేయులు భారీగా దళాలను దించారు. దీంతో పేరున్న నాయకులంతా చెల్లాచెదు రయ్యారు. ఉత్తర భారతంలో పోరును నడిపిన తాంతియాతోపే అనుచరులైన రొహిల్లాలు (రొహిల్ ఖండ్‌కు చెందినవారు) అదే సమయంలో నిర్మల్ ప్రాంతం వైపు వచ్చారు. అప్పటికే జనగాం (ఆసిఫాబాద్) ప్రాంతంలో పోరు సాగిస్తున్న స్థానిక గోండు యోధుడు రాంజీ నిర్మల్ తాలూకా మీదుగా అడవుల్లోకి చొచ్చుకు వస్తున్న ఆంగ్లేయులు, నిజాంలను అడ్డుకునేందుకు నిర్మల్ ప్రాంతానికి చేరుకున్నాడు. ఆయన గోండు వీరులకు రొహిల్లాల దండు తోడైంది. కొంతమంది దక్కనీలు, మరాఠావాసులు వీరితో చేతులు కలిపారు. రొహిల్లాల సర్దార్ హజీతో కలిసి రాంజీ ఉమ్మడి శత్రువులను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాడు.
ముప్పుతిప్పలు పెట్టి..
సరైన ఆయుధ సంపత్తి లేకున్నా నిర్మల్ ప్రాంత భౌగోళిక స్వరూపాన్ని రాంజీ గోండు తనకు అనుకూలంగా మలచుకున్నాడు. ఇక్కడి గుట్టలు, గొలుసుకట్టు చెరువులు, పచ్చని అడవులను ఆధారంగా చేసుకుని పోరు సాగించాడు. స్థానిక ఆంగ్లేయ కలెక్టర్ నేతృత్వంలోని సైనికులను మట్టి కరిపించాడు. రాంజీ, రొహిల్లాలు, మరికొందరు కలిసి పోరు ప్రారం భించారన్న సంగతి కలెక్టర్ ద్వారా హైదరాబాద్ రాజ్యంలో వారి రెసిడెంట్ అయిన డేవిడ్‌సన్‌కు, నాటి పాలకుడు ఆఫ్జల్ ఉద్‌దౌలాకు తెలుస్తుంది. అప్పటికే వీరిద్దరితోపాటు అప్పటి దివాన్ సాలర్‌జంగ్ దక్షిణ భారతదేశంలో ప్రథమ స్వాతంత్ర పోరును అణచివేసే పనిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో నిర్మల్ కేంద్రంగా పోరు ప్రారంభం కావడాన్ని తీవ్రంగా పరిగణించిన వారు బళ్లారిలోని 47వ నేషనల్ ఇన్‌ఫాంట్రీని నిర్మల్‌కు పంపి స్తారు. కల్నల్ రాబర్ట్ నేతృత్వంలోని ఈ దళం నిర్మల్ చేరుకుంటుంది. ఇక్కడి ప్రాంతంపై అంతగా పట్టులేకపోవడంతో రాంజీ సేన సాగించిన గెరిల్లా పోరులో రాబర్ట్ సైన్యం రెండుసార్లు దెబ్బతిం టుంది. ఈ కసితో రాంజీని దొంగదెబ్బ తీసేందుకు ప్రయత్నించి సఫలమవుతారు. ఆయనతో పాటు వెయ్యిమందిని బందీలుగా పట్టుకుంటారు.
చిత్రహింసలు పెట్టి.. బహిరంగంగా
రాంజీ సహా వెయ్యిమందిని చిత్రహింసలు పెడతారు. అందరినీ నిర్మల్ శివారులోని ఎల్లపెల్లి దారిలో గల మర్రిచెట్టు వద్దకు ఈడ్చుకెళ్తారు. నేలలో ఊడలు దిగిన ఆ మహా మర్రిచెట్టుకు అందరూ చూస్తుండగా రాంజీ సహా వెయ్యిమందిని ఉరితీస్తారు. 1860 ఏప్రిల్ 9న ఈ దారుణం జరిగినట్లు చెబుతారు. ఆ వీరులంతా ఉరికొయ్యలకు వెరువకుండా చిరునవ్వులతోనే తమ ప్రాణాలను దేశం కోసం త్యాగం చేశారు. ఇంతటి పోరాటాన్ని సాగించిన రాంజీ గోండు, వెయ్యిమంది వీరుల చరిత్ర ఇప్పటికీ బయటకు రాకపోవడం శోచనీయం.
వెలుగుచూడని పోరాటం
జనరల్ డయ్యర్ సైన్యం వెయ్యిమందికి పైగా కాల్చి చంపిన జలియన్‌వాలా బాగ్ ఘటన కంటే యాభయ్యేళ్ల ముందే ఇది జరిగింది. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. వెయ్యిమంది.. ఒకేసారి తమ ప్రాణాలను త్రుణప్రాయంగా త్యాగం చేశారు. తమను కన్న భూతల్లి కోసం ఆ గిరిబిడ్డలు వీరోచితంగా పోరాడారు. ఇక చరిత్రకెక్కని ధీరుడు.. రాంజీ గోండు. సామాన్య సైన్యంతో నెలల తరబడి బలమైన శత్రువులపై పోరు సాగించాడు. తర్వాతి కాలంలో జల్, జంగల్, జమీన్ అంటూ పోరాడిన కుమ్రంభీమ్‌కు ఈయనే స్ఫూర్తిగా నిలిచాడు. ఇంతటి పోరాటాన్ని సాగించిన రాంజీ, మిగతా వీరుల చరిత్ర కనీసం బయటకు రాలేదు. పాఠ్యపుస్తకాలకూ ఎక్కలేదు. వీరుల బలిదానంతో వెయ్యి ఉరుల మర్రిగా మారిన ఆ చెట్టు 1995లో గాలివానకు నేలకొరిగింది. తెలంగాణ ఉద్యమ సమయంలో పలు సంఘాల ఆధ్వర్యంలో 2007 నవంబర్ 14న వెయ్యి ఉరుల మర్రి సమీపంలో ఓ స్థూపాన్ని, 2008 నవంబర్ 14న నిర్మల్‌లోని చైన్‌గేట్ వద్ద రాంజీ గోండు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు.
అమిత్ షా రానుండటంతో..
నాలుగేళ్ల క్రితం మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో రాంజీ గోండు పేరిట గిరిజన మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పింది. మొదట నిర్మల్‌లో అని, ఆ తర్వాత హైదరాబాద్‌లో చేస్తామని చెప్పినా.. చివరకు ఎక్కడా పెట్టలేదు. ఇక నిర్మల్ నడిబొడ్డున ఉన్న రాంజీ విగ్రహం గోస మాటల్లో చెప్పలేం. చుట్టూ చెత్త, మందుసీసాలతో ఆయన ప్రాణత్యాగానికి ఏమాత్రం విలువలేని పరిస్థితి ఆవేదనకు గురిచేస్తుంది. తెలంగాణ విమోచన దినానికి ఏ మాత్రం సంబంధం లేకున్నా.. తర్వాతి కాలం పోరుకు స్ఫూర్తిగా నిలిచిన ఘటనగా దీనిని గుర్తిస్తున్నామని, ఇప్పటికైనా ఈ చరిత్రను వెలుగులోకి తెస్తామని బీజేపీ చెబుతోంది. తాజాగా అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించేందుకు అమిత్ షా నిర్మల్ రానుండటంతో దీనికి ప్రాధాన్యత చేకూరింది.
Comments
Please login to add a commentAdd a comment