సీజన్ ముందు కాకుండా మధ్యలో లేదా చివరిలో ‘రైతు భరోసా’ కింద ఆర్థిక సాయం
రాష్ట్ర ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయం.. మార్గదర్శకాలపై వ్యవసాయ శాఖ కసరత్తు
రైతులు ఎన్ని ఎకరాల్లో పంటలు వేశారనే వివరాల సేకరణ
శాటిలైట్ రిమోట్ సెన్సింగ్, ఇతర మార్గాల ద్వారా పక్కాగా లెక్క తేల్చే యోచన
ఇందుకు అనుగుణంగానే ‘రైతు భరోసా’సాయం విడుదల
ఇది కూడా ఐదెకరాలలోపు రైతులకే అందించే యోచన
ప్రస్తుతం రెండు సీజన్లకు కలిపి 3.04 కోట్లకుపైగా ఎకరాలకు పెట్టుబడి సాయం
ఇందులో పంటలు సాగయ్యేది 2.09 కోట్ల ఎకరాల్లోనే అంటున్న వ్యవసాయశాఖ
మిగతా 98 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం అందనట్టే!
యాసంగిలో సగానికిపైగా విస్తీర్ణానికి పథకం వర్తించనట్టే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం రూపుమారుతోంది. రైతులు పంట వేసినట్టు నిర్ధారణ అయిన భూములకే ‘రైతు భరోసా’ కింద ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. పంటలు సాగైన భూములపై పక్కాగా లెక్క తీశాకే సాయం విడుదల చేయాలని భావిస్తోంది. అది కూడా పంటల సాగుకు ముందుగాకుండా.. సీజన్ మధ్యలో లేదా చివరిలో సాయం సొమ్మును విడుదల చేయాలని కూడా యోచిస్తున్నట్టు సమాచారం.
సీజన్‌కు ముందే ఎందరు రైతులు ఎంతమేర భూముల్లో పంటలు వేశారో తెలియదని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. అందుకే సీజన్ మధ్యలో సర్వే చేసి ఎన్ని ఎకరాల్లో సాగుచేశారో నిర్ధారించి, సాయం అందించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మేరకు ‘రైతు భరోసా’మార్గదర్శకాలపై కసరత్తు జరుగుతున్నట్టు ఒక ఉన్నతాధికారి తెలిపారు.
రైతుల నుంచి వ్యతిరేకత వస్తే ఎలా?
రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకునేందుకు, దుక్కుల సమయంలో అయ్యే ఖర్చుల కోసం సీజన్ కన్నా ముందే పెట్టుబడి సాయం అందించేలా గత ప్రభుత్వం 2018లో ‘రైతు బంధు’పథకాన్ని తెచ్చింది. పంటలు సాగు చేసినా, చేయకున్నా.. సాగుభూముల కింద నమోదై ఉన్న అన్ని భూములకు ‘రైతుబంధు’ సాయం అందించింది. అలాంటిది ఇప్పుడు పంటల సాగు మొదలయ్యాక, చివరిలో ఆర్థిక సాయం ఇస్తే రైతులకు ఇబ్బంది అవుతుందని అధికారులు తర్జనభర్జన పడుతున్న ట్టు సమాచారం.
ఈ క్రమంలో సీజన్‌కు ముందే ఆర్థిక సాయం చేసి, ఒకవేళ ఎవరైనా రైతులు సాగుచేయనట్టు తేలితే.. వారికి తదుపరి సీజన్‌లో ఆర్థిక సాయానికి కోత పెట్టే ప్రతిపాదనలు కూడా వచ్చినట్టు తెలిసింది. కానీ దీనిపై రైతుల నుంచి వ్యతిరే కత రావొచ్చన్న సందేహాలు నెలకొన్నాయి. దీనితో మార్గదర్శకాల రూపకల్పన కత్తిమీద సాములా మారినట్టు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.
యాసంగిలో సగానికిపైగా తగ్గనున్న సాయం!
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏటా ఎకరానికి రూ.15 వేల చొప్పున ‘రైతు భరోసా’ఇస్తామని ప్రకటించింది. ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన తర్వాత.. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా ‘రైతుబంధు’ను పునఃసమీక్షిస్తామని ప్రకటించింది. వచ్చే వానాకాలం సీజన్ నుంచి కొత్త మార్గదర్శకాల ప్రకారం రైతు భరోసా పథకం అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పంటలు సాగుచేసే భూములకే రైతుభరోసా ఇస్తే పెట్టుబడి సాయం వ్యయం భారీగా తగ్గుతుందని అంచనా. ఉదాహరణకు గత వానాకాలం సీజన్‌లో 1.52 కోట్ల ఎకరాలకు రైతుబంధు సాయం అందగా.. అప్పుడు సాగైన భూమి 1.26 కోట్ల ఎకరాలే.
ఇకపై ఇలా పంటలు వేయని 26 లక్షల ఎకరాలకు రైతుభరోసా సొమ్ము అందదు. ఇక ప్రస్తుత యాసంగిలో ఇప్పటివరకు 66.30 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేశారు. కొత్త సర్కారు నిర్ణయం మేరకు.. వీటికి మాత్రమే ఆర్థిక సాయం అందుతుంది. మిగతా 85.70 లక్షల ఎకరాలకు సంబంధించి రైతులకు సొమ్ము అందే పరిస్థితి ఉండదు. రెండు సీజన్లకు కలిపి గతంలో సుమారు 3.04 కోట్ల ఎకరాలకు రైతుబంధు సాయం అందగా.. ఇప్పుడు దాదాపుగా 2.09 కోట్ల ఎకరాలకే పరిమితం కానుందని అంచనా వేస్తున్నారు. అంటే 98లక్షల ఎకరాలకు రైతుభరోసా అందదని పేర్కొంటున్నారు.
పరిమితం చేసేందుకే మొగ్గు
బీఆర్‌ఎస్ సర్కారు రైతుబంధు పథకం మొదలుపెట్టిన నాటి నుంచి గత వానాకాలం సీజన్ వరకు మొత్తంగా రైతులకు రూ.72,815 కోట్లు అందజేసింది. ఇందులో గత వానాకాలంలో 1.52 కోట్ల ఎకరాలకు సంబంధించి 68.99 లక్షల మంది రైతులకు రూ.7,625 కోట్లు అందజేసింది. యాసంగి సీజన్ కొనసాగుతున్న సమయంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు.. ఈ సీజన్‌కు సంబంధించి గతంలో మాదిరే రైతులకు ఆర్థిక సాయం ఇస్తామని ప్రకటించింది. అంటే 1.52 కోట్ల ఎకరాలకు సంబంధించి రూ.7,625 కోట్లు విడుదల చేయాలి.
అయితే ఇప్పటివరకు నాలుగైదు ఎకరాల మేర భూమి ఉన్న రైతులకే ఆర్థిక సాయం అందిందని వ్యవసాయశాఖ వర్గాలు చెప్తున్నాయి. గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఐదెకరాల వరకే రైతుబంధు ఇస్తున్నట్టు చెప్పారు. అంటే యాసంగికి సంబంధించి కూడా ఐదెకరాల వరకు ఉన్న భూములకే ఆర్థిక సాయం పరిమితం కానుంది. రాష్ట్రంలో ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షల మందికాగా.. వారి చేతిలో కోటి ఎకరాల భూమి ఉంది. అంటే రైతుబంధు అందుకుంటున్న రైతుల్లో ఐదెకరాలోపు రైతులే 90.36 శాతం ఉన్నారని వ్యవసాయ వర్గాలు చెప్తున్నాయి.
పక్కాగా సాగు లెక్కలు తీసి..
శాటిలైట్ రిమోట్ సెన్సింగ్, ఇతర పద్ధతుల ద్వారా పక్కాగా సాగు లెక్క తేల్చా లని అధికారులు నిర్ణయించారు. ఇందులోనూ ఐదెకరాల్లోపు భూములున్న రైతు లకే ఆర్థిక సాయం అందనుంది. ఆదాయ పన్ను చెల్లించే ఉద్యోగులు, ఇతర వర్గాలవారికి రైతుభరోసా నిలిపివేయనున్నారు. ఐదెకరాల వరకే సాయం ఇవ్వాలన్న ఆలోచనా అమలు చేస్తే.. నిధుల వ్యయం మరింతగా తగ్గుతుంది. ఇప్పటివరకు 1.52 కోట్ల ఎకరాలకు ఆర్థిక సాయం ఇచ్చినట్టుగా.. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఎకరాకు రూ.15 వేల చొప్పున అమలు చేయాలంటే ఏడాదికి రూ.22,800 కోట్లు కావాలి. అయితే సాగుచేయని భూమిని తొలగించడం, ఐదెకరాలకు పరిమితం చేయడం, ఆదాయ పన్ను చెల్లించేవారు, ధనికులు, ప్రజాప్రతినిధులు, సినీ నటులు, వ్యాపారవేత్తలకు రద్దు చేయడం వంటివి అమలు చేస్తే.. దాదాపు రూ.10వేల కోట్ల వరకు మిగులుతాయని అధికార వర్గాలు చెప్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment