సాక్షి, సిటీబ్యూరో: అతడో బైక్‌ను చోరీ చేశాడు... దానిపై నగ్నంగా రెండు కమిషనరేట్ల పరిధిలో సంచరించాడు... పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో వాహనం వదిలి పారిపోయాడు. ఆ ‘నగ్న చోరుడి’ కోసం ఇప్పుడు హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. చిక్కితే ఓ చోరీ కేసు ఇప్పటికే సిద్ధంగా ఉండగా, మెంటల్ హెల్త్ యాక్ట్ ప్రకారం మరో కేసు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నారు. వివరాల్లోకి వెళితే..ఓ గుర్తుతెలియని యువకుడు గత వారం లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాన్ని చోరీ చేశాడు. దీనిపై స్థానిక పీఎస్‌లో కేసు నమోదైంది. ఆ చోరుడు మూడు రోజుల క్రితం పట్టపగలు ఆ వాహనాన్ని తీసుకుని నగ్నంగా షికారుకు బయలుదేరాడు.
తొలుత హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని బోయిన్‌పల్లి పరిధిలోకి వచ్చే కంటోన్మెంట్ ఏరియాలో హల్‌చల్ చేశాడు. ఆపై బొల్లారంలోని మిలటరీ ప్రాంతంలో సంచరించాడు. అక్కడి నుంచి బేగంపేట వచ్చిన ఈ ‘న్యూడ్ రైడర్’ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పక్కన నాలాపై ఉన్న వంతెన మీదుగా బల్కంపేటకు, అట్నుంచి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వచ్చే సనత్‌నగర్ ప్రాంతానికి చేరుకున్నాడు. ఈ ఠాణా పరిధిలోనే ఎక్కువసేపు సంచరించాడు. దీనిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన గస్తీ బృందాలు సనత్‌నగర్ ఎస్‌ఆర్టీ ప్రాంతంలోని నెహ్రు పార్క్ వద్ద ఆ నగ్న యువకుడిని గుర్తించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు, స్థానికులు అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సదరు యువకుడు వాహనాన్ని అక్కడే పడేసి వారిపై రాళ్ల దాడికి దిగాడు. అదను చూసుకుని పార్క్ లోపలికి వెళ్లిన అతను అక్కడి నుంచి తప్పించుకున్నాడు. సతన్‌నగర్ పోలీసులు ఆ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అది రిజిస్టరై ఉన్న చిరునామా, ఫోన్ నంబర్ ఆధారంగా అతడిని గుర్తించాలని ప్రయత్నించారు. అయితే ఆ వాహనం చోరీపై లంగర్‌హౌస్ ఠాణాలో కేసు నమోదై ఉన్నట్లు తేలింది. దీంతో సనత్‌నగర్ పోలీసులు వాహనాన్ని బుధవారం ఆ పోలీస్ స్టేషన్ అధికారులకు అప్పగించారు. సదరు యువకుడి కోసం చోరీ కేసు ఉండటంతో లంగర్‌హౌస్ అధికారులు, న్యూసెన్స్ చేసినందుకుగాను మెంటల్ హెల్త్ యాక్ట్ కింద కేసు పెట్టాలని సనత్‌నగర్ పోలీసులు గాలిస్తున్నారు.
మూడు కమిషనరేట్ల పరిధిలోనూ ఈ గాలింపు కొనసాగుతోంది. ప్రధానంగా లంగర్‌హౌస్ సహా వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్‌ను పరిశీలిస్తున్నారు. ఆ యువకుడు నగ్నంగా బైక్ నడుపుతుండగా మిలటరీ ఏరియాలో వెనుక నుంచి వెళ్తూ కొందరు వాహన చోదకులు వీడియో తీశారు. ఆ ప్రయత్నంలో అతడిని పిలుస్తున్నా పలకకుండా, తల కూడా తిప్పకుండా వేగంగా వెళ్లిపోయాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. అతగాడు మతిస్థిమితం లేక ఇలా చేశాడా? స్నేహితులు లేదా పరిచయస్తులతో పందాలు కాసి అలా ప్రవర్తించాడా? అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment