
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగా వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి పూజల అనంతరం ఉదయం 3.30 గంటలకు ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి పట్టు వస్త్రాలతోపాటు బోనం సమర్పించారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
కాగా ఆదివారం తెల్లవారుజాము నుంచే మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉదయం 9.30 గంటలకు ఎమ్మెల్సీ కవిత మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించనున్నారు.
ఇక ఆషాఢమాస జాతరలో భాగంగా ఆదివారం బోనాలు, సోమవారం రంగం కార్యక్రమం జరగనున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీహెచ్‌ఎంసీ, విద్యుత్, జలమండలి, ఆర్‌అండ్‌బీ తదితర శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మహంకాళి దేవాలయాన్ని విద్యుద్దీపాలు, పూలు, పండ్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
ఆషాడ బోనాల సందర్భంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి కుటుంబసభ్యులతో కలిసి బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. #LashkarBonalu #SecunderabadBonalu #Bonalu pic.twitter.com/zf1zbzl0WY
— Talasani Srinivas Yadav (@YadavTalasani) July 9, 2023