
సాక్షి, హైదరాబాద్ : బోనాల పండుగ ఘనంగా జరిగిందని, విదేశీయులు సైతం ఈ సంబరాలకు హాజరయ్యారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందంటూ కొందరు కామెంట్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సోమవారం జరిగిన రంగం కార్యక్రమం అనంతరం తలసాని మీడియాతో మాట్లాడారు. జోగిని శ్యామల కాస్త ఇబ్బంది పడ్డారని విన్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. లక్షల మంది వచ్చినప్పుడు జరిగిన అసౌకర్యాన్ని ఆమె అర్థం చేసుకోవాలంటూ శ్యామలకు మంత్రి తలసాని సూచించారు.
‘చిన్న చిన్న అసౌకర్యాలు జరిగాయి. స్థలం తక్కువగా ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైన మాట వాస్తవమే. వీఐపీల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. స్వచ్ఛంద సంస్థలు బాగా సహకరించాయి. అయితే జోగిని శ్యామలకు ఆలయ పరిస్థితులు పూర్తిగా తెలుసు. ప్రభుత్వంపై ఆమె కామెంట్ చేయడం సరికాదు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు పండి పిల్లాపాపలతో సుఖసంతోషాలతో ఉండాలని’ మంత్రి తలసాని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment