
సైదాబాద్: ఓ బాలుడు ఆత్మహత్య చేసుకుంటాన్నానని మెసేజ్ పెట్టి ఫోన్ స్విచ్ఛాఫ్ చేయగా సమాచారం అందుకున్న సైదాబాద్ పోలీసులు సాంకేతికత ఆధారంగా బాలుడిని కనుగొని ప్రాణాలు కాపాడారు. ఇన్‌స్పెక్టర్ సుబ్బిరామిరెడ్డి వివరాల ప్రకారం.. ఐఎస్‌సదన్ డివిజన్ సింగరేణి కాలనీ రోడ్ నెంబర్–7లో నివసించే రమావత్ పృథ్వీరాజ్ (17) బుధవారం రాత్రి తన ఫోన్ నుంచి స్నేహితుడికి తాను ఆత్మహత్య చేసుకుంటున్నాని మెసేజ్ పెట్టి స్విచ్ఛాఫ్ చేశాడు.
అతని ద్వారా విషయం తెలుసుకున్న బాలుడి అన్న రమావత్ చరణ్‌రాజ్ పోలీసులకు సమాచారమివ్వగా డీసీపీ కార్యాలయంలో సీడీఆర్‌గా విధులు నిర్వహించే మురళి సహాయంతో పృథ్వీరాజ్ ఫోన్ నెంబర్ ఆధారంగా అతను డబీర్‌పురా రైల్వేస్టేషన్ వద్ద ఉన్నట్లు గుర్తించి హుటాహుటిన అక్కడికి వెళ్లారు. అప్పటికే అక్కడి ఫ్లాట్‌ఫాంపై పృథ్వీరాజ్ నిద్రమాత్రలు వేసుకొని పడి ఉండటం వారు గుర్తించారు. హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించటంతో ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడు. కుటుంబ సమస్యల కారణంగానే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. తక్షణమే స్పందించి బాలుడి ప్రాణాలు కాపాడిన సైదాబాద్ పోలీసులను పలువురు అభినందించారు.