నిర్మలా సీతారామన్‌కు వినతిపత్రం అందజేస్తున్న హరీశ్‌రావు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను మంత్రి హరీశ్‌రావు కోరారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం నిర్మలా సీతారామన్‌తో మంత్రి హరీశ్‌రావు ప్రత్యే కంగా భేటీ అయ్యారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవ స్థీకరణ చట్టం 2014 లోని సెక్షన్ 94(2) ప్రకారం ఈ మేరకు నిధులు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నామని వివరించారు.
2015–16, 2016–17, 2017–18, 2018–19, 2020–21 సంవత్సరాలకుగానూ ఏడాదికి రూ.450 కోట్లు మేర నిధులు ఇవ్వడం జరిగింది. 2014–15, 2019–20, 2021–22, 2022–23 ఆర్థిక సంవత్సరాలకు గాను తెలంగాణకు నిధులు మంజూరు చేయలేదన్న అంశాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలలో తెలంగాణలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు గాను ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం నిధులు మంజూరు చేయాలని కోరారు.
జీఎస్టీ సమస్యల పరిష్కారానికి అధికారులను నియమించాలి
తెలంగాణకు రావాల్సిన ఐజీఎస్టీ నిధులు, ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంత్రి హరీశ్‌రావు జీఎస్టీ కౌన్సిల్‌ను కోరారు. ఈ విషయమై అధికారుల బృందాన్ని ఏర్పాటు చేయాలంటూ చాలా కాలంగా జీఎస్టీ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందన్నారు. మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత జరిగిన 50 వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో హారీశ్‌రావు పాల్గొన్నారు.
తెలంగాణకు రావాల్సిన ఐజీఎస్టీ నిధుల అంశాన్ని ప్రస్తావిస్తూ, మహారాష్ట్రకు చెందిన ఒక టాక్స్ పేయర్ రూ.82 కోట్లు తెలంగాణకు చెల్లించాల్సి ఉన్నదని... ఇదే విషయాన్ని ఆ టాక్స్ పేయర్ కూడా అంగీకరించారని వివరించారు. అయితే తనకు రీఫండ్ రాగానే చెల్లిస్తామని సదరు టాక్స్ పేయర్ హామీ ఇచ్చినప్పటికీ తనకు రీఫండ్ ఇంకా పెండింగ్‌లోనే ఉండిపోయిందన్న అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లారు.
గతంలో జరిగిన 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలోనే ఈ అంశాన్ని లేవనెత్తామని... ఆఫీసర్లతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు హామీ లభించినా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదన్నారు. కాగా ఈ ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక మంత్రి సానుకూలంగా స్పందించారు. 47వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగులో చర్చించుకున్నట్లుగా ఆఫీసర్లతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment