సాక్షి, హైదరాబాద్/ పంజగుట్ట: ఆర్టీసీ కార్మికులు కదంతొక్కారు. గవర్నర్‌కు వ్యతిరేకంగా శనివారం ఉదయం భారీ ప్రదర్శన చేపట్టారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లుపైన ఆమోదం తెలపాలని, గవర్నర్ సంతకం చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది ‘చలో రాజ్‌భవన్’పేరిట భారీ ర్యాలీ నిర్వహించడంతో ఉద్రిక్తత నెలకొంది.
తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేతృత్వంలో చేపట్టిన ఈ భారీ ప్రదర్శనకు నగరంలోని అన్ని డిపోలకు చెందిన కార్మికులు తరలివచ్చారు. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సిటీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఫలితంగా విద్యార్ధులు, ఉద్యోగులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు కార్మికుల భారీ ప్రదర్శనతో ఖైరతాబాద్ చౌరస్తా, రాజ్‌భవన్ తదితర మార్గాల్లో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది.
నాలుగైదు గంటల పాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఆర్టీసీ కార్మికులు రోడ్డుపైనే బైఠాయించడంతో ఖైరతాబాద్ నుంచి రాజ్‌భవన్ వచ్చే మార్గాన్ని పోలీసులు మూసివేశారు. దాంతో నాలుగు వైపులా విపరీతంగా ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ స్తంభించిపోవడంతో వాహనదారులు గంటలతరబడి రోడ్లపైనే పడిగాపులు కాయాల్సివచ్చింది.
గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు
రాజ్‌భవన్ వైపు వెళ్లకుండా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు దాటుకొని ఆందోళనకారులు ముందుకు వెళ్లారు. గవర్నర్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘గవర్నర్ డౌన్ డౌన్’అంటూ నినదించారు. ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రదర్శనగా వెళ్లిన కార్మికులంతా రాజ్‌భవన్ ఎదుట బైఠాయించారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి అధ్యక్షతన ఐదుగురు ప్రతినిధుల బృందం రాజ్‌భవన్‌లోకి వెళ్లి గవర్నర్‌తో వీడియో కాల్ మాట్లాడిన తర్వాత నిరసనను విరమించారు.
గవర్నర్ సానుకూలంగా స్పందించారు
ఆ తర్వాత «థామస్ రెడ్డి మాట్లాడుతూ గవర్నర్ ఎంతో సానుకూలంగా స్పందించారని చెప్పారు. కార్మికుల ప్రయోజనాల పరిరక్షణ తనకు ఎంతో ముఖ్యమని గవర్నర్ చెప్పారని పేర్కొన్నారు. బిల్లులో కొన్ని సందేహాలు నివృత్తి కాగానే బిల్లుకు ఆమోదం తెలుపుతామన్నారని వివరించారు.
తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు కమలాకర్, ఉపాధ్యక్షులు జీపీఆర్ రెడ్డి, కోశాధికారి రాఘవరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.ఆర్.రెడ్డి, మహిళా నాయకురాలు నిర్మలా రెడ్డి, బీఆర్‌టీయూ అధ్యక్షులు రాంబాబు యాదవ్, ప్రధాన కార్యదర్శి పి.నారాయణ నిరసనకు నాయకత్వం వహించారు. కాగా, గవర్నర్‌తో సమావేశం అయిపోయాక అక్కడకు వచ్చిన ఆర్టీసీ జేఏసీ నాయకులను పోలీసులు రాజ్‌భవన్‌లోనికి అనుమతించకుండా వారిని తీసుకొని ఖైరతాబాద్‌లో వదిలేశారు.
Comments
Please login to add a commentAdd a comment