
సాక్షి, హైదరాబాద్/చాంద్రాయణగుట్ట: చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్‌కు కొనసాగింపుగా నిర్మించిన ఎక్స్‌టెన్షన్ ఫ్లైఓవర్ ప్రారంభం వాయిదా పడింది. మంగళవారం ఉదయం మంత్రి కేటీఆర్ ఫ్లోవర్‌ను ప్రారంభించాల్సి ఉండగా.. ఓపెనింగ్‌ను ఈనెల 27కు వాయిదా వేశారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు, లిక్కర్ స్కామ్‌కు సంబంధించి బీజేపీ కార్యకర్తల ఆందోళన, పాతబస్తీలో ఉద్రిక్తత నేపథ్యంలో కేటీఆర్ పర్యటనను అధికారులు రద్దు చేసినట్లు తెలుస్తోంది.
ట్రాఫిక్ చిక్కులకు పరిష్కారం
పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట జంక్షన్ వద్ద ఎదురవుతున్న ట్రాఫిక్ చిక్కులకు పరిష్కారం లభించనుంది. చాంద్రాయణగుట్ట జంక్షన్ నుంచి వివిధ మార్గాలవైపు వెళ్లేవారికి ఎంతో సదుపాయం కలగనుంది. జంక్షన్ వద్ద వేచిఉండే సమయం తగ్గడంతోపాటు ఇంధన వ్యయం, కాలుష్యం తగ్గనున్నాయి.
ఫ్లైఓవర్ కింద పచ్చదనంతో ఆహ్లాదకరంగా మారింది. ఫిల్లర్ల నడుమ చక్కటి గార్డెనింగ్‌ను ఏర్పాటు చేశారు. పాత, కొత్త ఫ్లై ఓవర్‌ల అనుసంధానం కారణంగా పాత ఫ్లై ఓవర్‌ను సైతం మూసేయ్యడంతో ఇన్నాళ్ల పాటు ఇబ్బందులకు గురైన వాహహనదారులకు ఇక ఊరట లభించనుంది. ఇప్పటి వరకు చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ దిగగానే సంతోష్‌నగర్ వైపు రోడ్డు ఇరుకుగా (ఒకవైపు దర్గా, మరోవైపు దేవాలయం, దర్గా) ఉండి వాహనాల వేగం తగ్గి ఒక్కసారిగా ట్రాఫిక్ స్తంభించేది.
దీనికి తోడు కందికల్ గేట్ నుంచి చాంద్రాయణగుట్ట పాత పోలీస్‌స్టేషన్ రహదారి సిగ్నల్ కూడా ఇక్కడే ఉండడంతో సమస్య మరింత జటిలమైంది. ఈ సమస్య పరిష్కారానికి చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రతిపాదనతో ఎక్స్‌టెన్షన్ ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. దీంతో మొత్తం ఫ్లై ఓవర్ 980 మీటర్లకు చేరుకుంది.
చదవండి: Breaking: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు 14 రోజుల రిమాండ్
ఫ్లై ఓవర్ ఎక్స్‌టెన్షన్ పొడవు: 674 మీటర్లు
వెడల్పు: 16.61 మీటర్లు
లేన్లు: 4, ప్రయాణం: రెండు వైపులా
పాతబస్తీ అభివృద్ధికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్
పాతబస్తీ అభివృద్ధి కోసం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఫ్లైవర్ల నిర్మాణాలు చేపట్టారు. 2005– 2007మధ్య కాలంలో మలక్‌పేట, చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్లను నిర్మించారు. వీటితో పాటు ఉప్పుగూడ, కందికల్ రైల్వేగేట్ల వద్ద నెలకొంటున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు రెండు ఫ్లైఓవర్ల నిర్మాణానికి 2007 నవంబర్‌లో శంకుస్థాపన చేశారు. ఇందులో ఒకటి ఆర్‌ఓబీ, మరొకటి ఆర్‌యూబీ. ఇవే కాకుండా పాతబస్తీలో ప్రస్తుతం బహదూర్‌పురా, ఫిసల్‌బండ ప్రాంతాల్లోనూ రెండు ఫ్లై ఓవర్‌లు ఇటీవలే వాహనదారులకు అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు ఫలక్‌నుమా, డబిర్‌పురాలలో రైల్వే వంతెనలు కూడా ఉన్నాయి.
వాహనదారుల కష్టాలు తప్పాయి..
చాంద్రాయణగుట్టలో వాహనదారుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఫ్లై ఓవర్ నిర్మాణ విషయమై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయించారు. చాంద్రాయణగుట్టలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించనుంది.
– ఫహద్ బిన్ అబ్దాద్, ఉప్పుగూడ కార్పొరేటర్
ట్రాఫిక్ సమస్య దూరం..
టీఆర్‌ఎస్ సర్కార్ నగరంలో ట్రాఫిక్ సమస్యను దూరం చేసేలా వంతెనలను నిర్మిస్తుండడం సంతోషకరం. ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుండటంతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాదు. ముఖ్యంగా కందికల్ గేట్ నుంచి వచ్చే వాహనదారుల ఇబ్బందులు తొలగుతాయి.
– శ్రీనివాస్ గౌడ్, కందికల్ గేట్
ఎస్సార్‌డీపీ ఫలాలు..
నగరంలో ట్రాఫిక్ చిక్కుల పరిష్కారానికి చేపట్టిన 41 ఎస్సార్డీపీ పనుల్లో చాంద్రాయణగుట్ట ఎక్స్‌టెన్షన్ ఫ్లైవర్‌తో 30 పనులు పూర్తయ్యాయి. మిగతా 11 పనులు పురోగతిలో ఉన్నాయి. వీటిల్లో నాగోల్ ఫ్లై ఓవర్ మరో రెండునెలల్లో అందుబాటులోకి రానుంది. శిల్పా లేఔట్, కొండాపూర్ ఫ్లై ఓవర్లు సైతం ఈ సంవత్సరంలో పూర్తిచేయాలనే లక్ష్యంతో అధికారులున్నారు. ఆరాంఘర్ నుంచి ఎల్‌బీనగర్ మీదుగా ఉప్పల్ వరకు ఇప్పటి వరకు ఏడు ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు చేపట్టినట్లు జీహెచ్‌ఎంసీ పేర్కొంది. ఆరాంఘర్ నుంచి మీర్ ఆలం ట్యాంక్ వరకు అతి పొడవైన ఫ్లైవర్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.