అరగంట.. గంట.. మహాఅయితే రెండు గంటలు నడిస్తే హమ్మయ్య అంటాం. చాలామంది వయసును దృష్టిలో ఉంచుకొని వాకింగ్ చేస్తుంటారు. కాస్త వయసు పైబడినవారు ‘స్టాప్ ఎన్ స్టార్ట్’ పద్ధతిలో మధ్య మధ్యలో కాస్త సేదతీరుతూ నడక కొనసాగిస్తుంటారు. తార్నాకకు చెందిన సీఐఎస్‌ఎఫ్ రిటైర్డ్ సీఐ రవికుమార్ మాత్రం నిత్యం 20 నుంచి 30 వేల అడుగులు అలవోకగా నడుస్తారు. పలుమార్లు ఏకంగా లక్ష అడుగులు నడిచి రికార్డు సృష్టించాడు. కొన్ని రోజుల క్రితం ఏకంగా 24 గంటల పాటు నడిచి 1,14,633 అడుగులతో 79.6 కిలోమీటర్లు నడిచిన ఆయన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ బుధవారం అభినందించారు.
⇔ తార్నాకలో ఉంటున్న రవికుమార్ రిటైర్డ్ సీఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్. పంజాబ్‌లో పనిచేసిన కాలంలో ఒళ్లు చేసింది. సీఆర్‌పీఎఫ్‌లో పనిచేస్తూ ఇదేం శరీరం అంటూ ఒక మిలటరీ అధికారి ప్రశ్నించడంతో వాకింగ్‌కు శ్రీకారం చుట్టారు.
⇔ 26 ఏళ్లుగా వాకింగ్ చేస్తున్న ఆయనకు ఉస్మానియా యూనివర్సిటీ మైదానాలు, ప్రకృతి మరింత స్ఫూర్తినిచ్చాయి.
⇔ ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుశాంత్ జైస్వాల్, మహారాష్ట్రకు చెందిన సూర్యవంశీ లక్ష అడుగులు నడిచిన తొలి రెండు రికార్డులు సొంతం చేసుకున్నారు. వీరిని ఆదర్శంగా తీసుకుని మూడో వ్యక్తిగా రవికుమార్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. కాగా మొదటి ఇద్దరి వయసు 28 ఏళ్లు కాగా రవికుమార్ వయసు 58.
⇔ తార్నాక నుంచి పెద్దమ్మగుడి, కీసరగుట్ట, యాదగిరిగుట్ట.. ఇలా సికింద్రాబాద్ నుంచి దాదాపు అన్ని మార్గాల్లో ఆయన ఉదయపు నడక సాగిస్తుండటం విశేషం.
⇔ నగర యువతలో ఊబకాయం పెరిగిపోతున్న నేపథ్యంలో వారిలో చైతన్యం తీసుకువచ్చేందుకు ఉదయం పూట నడక జీవిత కాలం కొనసాగిస్తానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment