సన్నాలపై తర్జనభర్జన.. | CM KCR Discussed Key Issues In Cabinet Meeting | Sakshi
Sakshi News home page

సన్నాలపై తర్జనభర్జన..

Published Sat, Nov 14 2020 2:50 AM | Last Updated on Sat, Nov 14 2020 9:27 AM

CM KCR Discussed Key Issues In Cabinet Meeting - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో సన్న రకం వరి ధాన్యంపై క్వింటాల్‌కు రూ. 150 చొప్పున బోనస్‌ చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల అది సాధ్యమయ్యేలా లేదని రాష్ట్ర మంత్రివర్గం ఓ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. శుక్రవారం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన భేటీలో పలు కీలకాంశాలపై చర్చించిన కేబినెట్‌ అందులో భాగంగా సన్నాలకు బోనస్‌ చెల్లింపు సాధ్యాసాధ్యా లను పరిశీలించింది.

అయితే కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కుదుర్చుకున్న ఎంవో యూలో ఉన్న నిబంధనలు బోనస్‌ చెల్లింపునకు అడ్డంకిగా ఉన్నాయని కేబినెట్‌ అభిప్రాయపడింది. కనీస మద్దతు ధరకన్నా రాష్ట్రాలు ఒక్క రూపాయి అదనంగా చెల్లించినా రాష్ట్రాలు సేకరించిన ధాన్యాన్ని సెంట్రల్‌ పూల్‌ కింద స్వీకరించబోమని కేంద్రం ఎంవోయూలో పొందుపరిచిన నిబం ధనలు ప్రతికూలంగా మారాయని ఈ భేటీలో పాల్గొన్న మంత్రులు పేర్కొన్నట్లు తెలియవచ్చింది.

ఆర్డినెన్స్‌తో సాదాబైనామాల పరిష్కారం...
సాదాబైనామాల క్రమబద్ధీకరణకు వీలు కల్పించేలా కొత్త రెవెన్యూ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్‌ తీసుకురావాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. అదేవిధంగా ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు జరపడం, మెరూన్‌ రంగు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయడానికి వీలు కల్పిస్తూ ఆర్డినెన్స్‌ ద్వారా కొత్త చట్టం తేవాలని నిర్ణయించింది. రాబోయే గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గం ఈ నిర్ణయాలు తీసుకుంది. రద్దైన పాత రెవెన్యూ చట్టం నిబంధనల మేరకు సాదాబైనామాలకు క్రమబద్ధీకరించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై మంతివర్గం చర్చించింది. సాదాబైనామాలకు ఎలాంటి న్యాయ వివాదాలు లేకుండా క్రమబద్ధీకరించేందుకు కొత్త రెవెన్యూ చట్టంలో పాత ఆర్‌ఓఆర్‌ చట్టంలోని నిబంధనలను చేర్చాలని నిర్ణయం తీసుకుంది. 

ఈ మేరకు కొత్త చట్టం కింద సాదా బైనామాలను వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద పరిష్కరించేందుకు ఆర్డినెన్స్‌ తేవాలనే ప్రతిపాదనను కేబినెట్‌ చర్చించి ఆమోదించింది. కేబినెట్‌ ప్రతిపాదించిన ఈ ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ ఆమోదానికి పంపుతూ మంత్రివర్గం తీర్మానం చేసింది. అసెంబ్లీ ఆరో విడత సమావేశాలు ప్రొరోగ్‌ అయితేనే ఆర్డినెన్స్‌ ఆమోదం పొందే అవకాశం ఉండటంతో వెంటనే ప్రొరోగ్‌ ఉత్తర్వులు వెలువడ్డాయి. కొత్త రెవెన్యూ చట్టం కింద సాదా బైనామాల క్రమబద్దీకరణకు సంబంధించిన ఆర్డినెన్స్‌ ఒకటి రెండు రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

ప్రభుత్వ స్థలాల్లో పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ...
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో పేదలకు సంబంధించిన నల్లా, విద్యుత్, ఆస్తి పన్ను బకాయిల మాఫీ అంశాన్ని కూడా కేబినెట్‌ చర్చించింది. ప్రభుత్వ స్థలాల్లో పేదలు నిర్మించుకున్న ఇళ్లను ఉచితంగా క్రమబద్ధీకరించాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కేబినెట్‌ సమావేశానికి సంబంధించిన వివరాలేవీ వెల్లడించవద్దని మంత్రులు, అధికారులకు సీఎం కేసీఆర్‌ స్పష్టంగా ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది. క్యాబినెట్‌ నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా ప్రకటించలేదు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement