మోదీ నాకు మిత్రుడే.. బిగ్‌ బాంబ్‌ పేల్చిన కేసీఆర్‌ | CM KCR Fire On PM Modi And Niti Aayog | Sakshi
Sakshi News home page

నడి వీధుల్లో కత్తులు పట్టుకుని తిరుగుతున్నారు.. కేసీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు

Published Sun, Aug 7 2022 1:30 AM | Last Updated on Sun, Aug 7 2022 2:28 PM

CM KCR Fire On PM Modi And Niti Aayog - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ప్రధాని మోదీ నేతృత్వంలో ఆదివారం ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. నీతి ఆయోగ్‌ నిరర్థక సంస్థగా మారిపోయిందని.. దాని సిఫార్సులకు విలువ, గౌరవం లేకుండా పోయిందని మండిపడ్డారు.

ఎన్డీయే ప్రభుత్వ హయాంలో దేశం పరిస్థితి దారుణంగా తయారైందని ఆరోపించారు. నీతి ఆయోగ్‌తో సహకార సమాఖ్య స్ఫూర్తిని తెస్తామన్నారని, కానీ అదొక జోక్‌గా మిగిలిపోయిందని విమర్శించారు. నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరించడం బాధాకరమే అయినా.. ప్రజాస్వామ్య దేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలపడానికి ఇది ఉత్తమ మార్గమని భావిస్తున్నట్టు చెప్పారు. తన నిరసనను ప్రధాని మోదీకి స్వయంగా బహిరంగ లేఖ ద్వారా తెలియజేస్తున్నట్టు ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ శనివారం ప్రగతిభవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, నీతి ఆయోగ్‌ వైఫల్యాలపై మండిపడ్డారు. 

కేసీఆర్‌ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ఎన్నడూ లేనంత అధ్వానంగా మారింది ‘‘కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామంటే.. పెరిగిన డీజిల్, విత్తనాలు, ఎరువుల ధరలతో వారి పెట్టుబడి ఖర్చు రెట్టింపైంది. దేశంలో మంచి నీళ్లూ సరిగా దొరకని పరిస్థితి. పని చేసుకుందామంటే ఉద్యోగం దొరకదు. ప్రభుత్వ రంగ సంస్థలను మూసేస్తూ.. ఉద్యోగులను రోడ్డు మీద పడేస్తున్నారు. చివరికి ఉపాధి హామీ కూలీలు కూడా జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా చేస్తున్నారు. 28శాతం జీఎస్టీతో బీడీ కారి్మకుల నోట్లో మట్టికొట్టే పరిస్థితి. నిత్యావసరాల ధరలు, ద్రవ్యోల్బణం అడ్డూఅదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. జీడీపీ పతనమైంది. చరిత్రలో ఎన్నడూ లేనంత అధ్వానంగా రూపాయి పాతాళానికి పడిపోతూ ఉంది. ఇక నీతి ఆయోగ్‌ ఏం సాధించినట్టు? 

అంతా జోక్‌గా మారింది 
2014లో ఎన్డీయే అధికారంలోకి వచ్చాక దేశాన్ని సమూలంగా మార్చేస్తామంటూ.. ప్రణాళికా సంఘానికి ప్రత్యామ్నాయంగా నీతి ఆయోగ్‌ను సృష్టించారు. సహకార సమాఖ్య స్ఫూర్తి తెస్తామన్నారు. సీఎంలకు సభ్యత్వంఇస్తున్నాం. దీన్ని టీమ్‌ ఇండియా అంటాం అని ప్రధాన మంత్రి చెప్పారు. దేశానికి మంచి రోజులు వచ్చాయని అనుకున్నాను. చాలా ఆశించా. దురదృష్టవశాత్తు ఏమీ జరగలేదు. ఎనిమిదేళ్ల తర్వాత చూసుకుంటే.. ప్రధాని మోదీ, బీజేపీ వాగ్దానాలు, నీతి ఆయోగ్‌ సృష్టి, వీటన్నింటి ఆచరణ పెద్ద జోక్‌లా మిగిలిపోయింది. దేశం అన్ని రంగాల్లో దెబ్బతింటోందని, అంతర్జాతీయ విపణిలో దేశం పరువు పోతోందని ఆర్థికవేత్తలు మొత్తుకుంటున్నారు. 

ఆదర్శమన్నా.. చేసింది సున్నా.. 
మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయని.. మిషన్‌ కాకతీయకు రూ.5వేల కోట్లు, మిషన్‌ భగీరథకు రూ.19వేల కోట్లు కలిపి రూ.24 వేల కోట్లను తెలంగాణకు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ కేంద్రానికి సిఫార్సు చేసింది. ఐదున్నరేళ్లు గడిచినా 24 పైసలు కూడా ఇవ్వలేదు. నీతి ఆయోగ్‌ సిఫార్సులు బుట్టదాఖలైతే దానికి విలువ ఏమిటి? లోతుగా అధ్యయనం చేయడానికి నీతి ఆయోగ్‌ను ఉప సంఘాలు వేయాలని కోరితే ఆ ప్రయత్నం జరగలేదు. ఓ బృందం వేస్తే సమావేశానికి వెళ్లి విలువైన సలహాలు ఇచ్చా. విశాలమైన దేశంలో భిన్నమైన భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి. పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రాలు ప్రత్యేక పథకాలు చేపట్టేందుకు కేంద్ర నిధులను నేరుగా రాష్ట్రాలకే ఇవ్వాలని కోరాను. ప్రతిపాదన బాగుంది, ఆచరిస్తామని ప్రధాని అన్నారు. కానీ చేసింది సున్నా. 

నడి వీధుల్లో కత్తులు పట్టుకుని తిరుగుతున్నారు..
వాళ్లు చెప్పిందే చేయాలి. లేకుంటే మీ కథేంటో చూస్తామనే పరిస్థితి వచి్చంది. సహకార సమాఖ్య స్ఫూర్తి పోయింది. నియంతృత్వం వచ్చింది. చివరికి పరిస్థితి ఎక్కడిదాకా వచి్చందంటే.. సీఎంలే బుల్డోజర్లు పెట్టి ఇళ్లనుకూలగొడతాం అంటున్నారు. కొందరు కూలగొడుతున్నారు కూడా. రాష్ట్రాల్లో మంత్రులుగా ఉండే వాళ్లు ఎన్‌కౌంటర్లు చేయడానికి వెనుకాడం అని మాట్లాడే పరిస్థితి. గత హనుమాన్‌ జయంతినాడు భగవంతుడి పేరుతో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఉత్సవాల్లో కత్తులు, కటార్లు, గదలు పట్టుకుని తిరిగేటటువంటి పరిస్థితి. ఢిల్లీ నగర వీధుల్లో పట్టపగలు కత్తులు పట్టుకుని స్వైర విహారం చేస్తున్నారు. అంతులేకుండా విద్వేషం, ద్వేషం, అసహనం పెంచుతున్నారు. ఇదేనా కేంద్ర ప్రభుత్వం ఈ దేశానికి ఇచ్చే సందేశం? 

ఇది దోపిడీ స్ఫూర్తి.. 
నీతి ఆయోగ్‌ ఎజెండా రూపకల్పనలో సమాఖ్య స్ఫూర్తి ఏమైంది? కాకి ఎత్తుకుపోయిందా? ఎజెండా రూపకల్పన ఎక్కడ, ఎవరు చేస్తారో తెలియదు. ఈసారి ప్రధాన సమస్యలైన ధరలు, ద్రవ్యోల్బణంపై ఏం చేద్దామనే ముచ్చటే లేదు. కొన్నిరకాల పన్నుల్లో రాష్ట్రాలకు వాటా అనేది రాజ్యాంగ బద్ధమైన హక్కు. నీతి ఆయోగ్‌ సృజన, ప్రధాని మోదీ మేధో సంపత్తితో రాష్ట్రాల వాటాను ఎగ్గొట్టడానికి పన్నులకు సెస్సులుగా పేరుపెట్టి.. ఇప్పటివరకు రూ.13– 14 లక్షల కోట్ల మేర రాష్ట్రాల వాటాలను ఎగ్గొట్టారు. ఇదే నా సహకార సమాఖ్య స్ఫూర్తి? ఇది దోపిడీ స్పూర్తి. టీమ్‌ ఇండియా చేసే పని ఇదేనా? నీతి ఆయోగ్‌ మీటింగ్‌లో దీనిపై చర్చకు ఆస్కారం ఉంటుందా? సీఎం స్థాయి వ్యక్తి కూడా ఇన్ని నిమిషాలే మాట్లాడాలని టైమ్‌ పెట్టి.. ఎవరైనా రెండు నిమిషాలు ఎక్కువ మాట్లాడితే బెల్లు కొడుతుంటారు. నవ్వుతుంటారు. నీతి ఆయోగ్‌లో నాలుగు నిమిషాలు మాట్లాడి నాలుగు గంటలు పల్లీలు తింటూ ఉండాలా?.

మోదీ నాకు మిత్రుడే అయినా.. 
ప్రధాని మోదీ నాకు మిత్రుడే అయినా దేశ ప్రయోజనాల కోసం ప్రజల తరఫున గొంతెత్తుతా. మోదీ ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రాణం ఉన్నంత వరకు బాధ్యత కలిగిన పౌరుడిగా పోరాడుతాం. కలిసొచ్చే వారితో భవిష్యత్తులో బలీయమైన ఉద్యమాలు చేస్తాం. 

రాష్ట్రానికి శూన్య హస్తమే.. 
కేంద్ర నిర్ణయాలు రాష్ట్రాల ప్రగతిని దెబ్బతీస్తున్నాయి. మీ భగీరథ బాగుంది, అది బాగుంది ఇది బాగుంది అనడమే తప్ప ఇచ్చిందేమీ లేదు. అంతా శుష్క ప్రియాలు శూన్య హస్తాలు. గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం రూ.1.90 లక్షల కోట్లు ఖర్చు చేస్తే అందులో కేంద్రం నుంచి వచ్చినవి కేవలం రూ.5 వేల కోట్లు. అయినా ఇక్కడి ఆ పార్టీ (బీజేపీ) నేతలు దుర్మార్గ ప్రచారం చేస్తారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల విషయంలోనూ కేంద్ర వైఖరి బయట పడుతోంది. తెలంగాణకు రావాల్సిన రూ.6 వేలకోట్లలో నయాపైసా ఇవ్వలేదు. పైగా రూ.3,200 కోట్ల జీఎస్టీ, ఐజీఎస్టీ బకాయిలు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. ఇవన్నీ నీతి ఆయోగ్‌ భేటీలో ప్రస్తావిస్తే కంఠ శోష మిగులుతోంది. 

ఇది హిరణ్య కశ్యపుడి లాగానే.. 
దేశంలో ఏకస్వామ్య పార్టీ పాలన ఉంటుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా బహిరంగంగా చెప్తున్నారు. అది దేశ భవిష్యత్తుకు మంచిదికాదు. హిరణ్య కశ్యపుడు కూడా తనకు దేవుడు మొక్కాలంటే ఫలితం ఏమైందో తెలుసు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ, రాజ్యాంగ సంస్థలను నాశనం చేసి జేబు సంస్థల్లా వాడుకుంటే.. రేపు అవే మిమ్మల్ని కబళిస్తాయి. క్రియకు ప్రతిక్రియ తప్పనిసరిగా ఉంటుంది. బెంగాల్, తమిళనాడు, తెలంగాణ.. ఇలా ఎక్కడికక్కడ ఏక్‌నాథ్‌ షిండేలను సృష్టిస్తామని స్థానిక బీజేపీ నేతలు అహంకార పూరిత ప్రకటనలు చేస్తున్నారు. నీతి ఆయోగ్‌ భేటీని బహిష్కరిస్తే ప్రధాని తన బుద్ధి మార్చుకుని దేశానికి మంచి చేస్తారని, కేంద్రం పనితీరులో పరివర్తన వస్తుందని భావిస్తున్నా. 

ఎన్‌పీఏల వెనుక లక్షల కోట్ల కుంభకోణం 
వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్‌ వంటివి ఉచిత పథకాలా? అవి మంచివి కాదంటారా? మరి నిరర్థక ఆస్తులకు (ఎన్‌పీఏ) ఎందుకు ఉద్దీపన ప్యాకేజీలు ఇస్తున్నారు? 2004–05లో రూ.58వేల కోట్లుగా ఉన్న ఎన్‌పీఏల విలువ.. 2014 నాటికి రూ.2.63 లక్షల కోట్లకు చేరితే, ఎన్డీయే పాలనలో ఇప్పుడు పదింతలు పెరిగి రూ.20.07 లక్షల కోట్లకు చేరాయి. ఎన్‌పీఏలు పెరగడం వెనుక ఉన్న లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలపై కేంద్రం సమాధానం ఇవ్వాలి. 

చైనా నుంచి దిగుమతులే మేకిన్‌ ఇండియానా? 
మాంజా, దీపావళి దీపాంతలు, టపాసులు, నెయిల్‌ కట్టర్లు, మొబైల్‌ ఫోన్లు, పీపీఈ కిట్లు, జాతీయ పతాకాలను చైనా నుంచి దిగుమతి చేసుకోవడమే మేకిన్‌ ఇండియానా? పెట్టుబడిదారులు లక్షల కోట్లు ఉపసంహరించుకుని దేశం దాటి వెళ్తున్నారు. గతంలో బ్రెయిన్‌ డ్రెయిన్‌.. ఇప్పుడు క్యాపిటల్‌ డ్రెయిన్‌.. విదేశీ మారక నిల్వలు హరించుకుపోతున్నాయి. అప్పుడు 2జీ స్పెక్ట్రమ్‌ కుంభకోణమంటూ గగ్గోలు పెట్టి.. ఇప్పుడు 5జీ స్పెక్ర్టమ్‌లో రూ.5 లక్షల కోట్లు వస్తాయని అంచనా వేసుకుంటే.. రూ.1.50 లక్షల కోట్లు రావడాన్ని ఎలా సమరి్థంచుకుంటారు? ఎయిర్‌పోర్టులు, రైల్వేలు, వ్యవసాయ మార్కెట్లను ప్రైవేటు పరం చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితాలు ఇస్తున్నాయంటూ.. కార్పోరేట్లకు మాత్రం లక్షల కోట్ల రూపాయలు పంచుతున్నారు. 

అప్పుల్లో కోతలు దుర్మార్గం 
మోదీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల అప్పులను సాకుగా చూపుతూ రూ.53 వేల కోట్లుగా ఉన్న తెలంగాణ అప్పుల పరిమితిలో రూ.25వేల కోట్ల మేర కోత విధించింది. బలమైన రాష్ట్రాలతోనే బలమైన కేంద్రం సాధ్యమనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని.. అల్పాదాయ వర్గాలపై విధించిన జీఎస్టీని తగ్గించాలి. ఎఫఆర్‌బీఎం ఆంక్షలను తొలగించాలి. 

57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు..
– స్వాతంత్య్ర వజ్రోత్సవాల కానుకలు ప్రకటించిన కేసీఆర్‌ 

రాజ్యాంగం భారతదేశాన్ని సంక్షేమ రాజ్యంగా పేర్కొందని.. నిరుపేదలు, విధి వంచితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని కేసీఆర్‌ చెప్పారు. ఈ నేపథ్యంలో స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల కానుకగా 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వనున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఆగస్టు 15 నుంచి కొత్తగా 10లక్షల మందికి ప్రతినెలా రూ.2,016 చొప్పున పెన్షన్‌ ఇస్తామని తెలిపారు. దీనిపై గతంలోనే హామీ ఇచ్చినా ఆర్థిక మాంద్యం, కరోనా, కేంద్రసాయం లేకపోవడంతో జాప్యం జరిగిందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని కేటగిరీలు కలిపి 36 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని, కొత్తగా ఇచ్చేవి కలిపి లబ్ధిదారుల సంఖ్య 46 లక్షలకు చేరుతుందని చెప్పారు. పాత, కొత్త అనే తేడా లేకుండా అందరికీ బార్‌ కోడ్‌తో కూడిన కొత్త కార్డులు జారీ చేస్తామన్నారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో 15 రోజుల పాటు పంపిణీ చేస్తారని తెలిపారు. 

– రాష్ట్రంలో 10వేల మందికిపైగా డయాలసిస్‌ రోగులకు కూడా ఆసరా పెన్షన్లు ఇవ్వనున్నట్టు కేసీఆర్‌ తెలిపారు. 
– స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు పూర్తవడానికి సూచికగా సత్ప్రవర్తన గల 75 మంది జీవిత ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించామన్నారు. 
– అనాథ పిల్లలను స్టేట్‌ చిల్డ్రన్‌గా గుర్తించడంతోపాటు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కూడా కల్పిస్తామన్నారు. అనాథ శరణాలయాలకు నిధులు పెంచుతామన్నారు.   

ఇది కూడా చదవండి: మానవతామూర్తి సీఎం కేసీఆర్‌: హరీశ్‌రావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement