శనివారం ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి షెకావత్‌ను శాలువాతో సత్కరిస్తున్న సీఎం కేసీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో అత్యంత వెనుకబడిన ఉమ్మడి పాలమూరు జిల్లాకు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వెనకబడిన ప్రాంతాలకు ‘పాలమూరు–రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకం జీవధార అని.. ఆ ప్రాజెక్టును కొనసాగనివ్వాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. కరువు తీర్చే ఈ ప్రాజెక్టు పనులను ఆపి.. ఈ ప్రాంత ప్రజల ఆశలపై నీళ్లు చల్లొద్దని విన్నవించారు. సీఎం కేసీఆర్ శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలు ఎస్.రాజేందర్‌రెడ్డి (నారాయణపేట), సి.లక్ష్మారెడ్డి (జడ్చర్ల), ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి (దేవరకద్ర)లతో కలిసి కేంద్రమంత్రితో ఆయన అధికారిక నివాసంలో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాలపాటు సాగిన ఈ సమావేశంలో ప్రధానంగా పాలమూరు ఎత్తిపోతల పథకంపైనే చర్చించినట్టు తెలిసింది. వాస్తవానికి సీఎం కేసీఆర్ ఈ నెల 6వ తేదీనే కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి చర్చించారు. 20 రోజుల వ్యవధిలోనే రెండోసారి భేటీ కావడం గమనార్హం.
కరువు పీడిత ప్రాంతానికి నీళ్లిచ్చేందుకు..
కృష్ణా, గోదావరి నదీ బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేం ద్రం గెజిట్ నోటిఫికేషన్ అక్టోబర్ 14 నుంచి అమల్లోకి రానుంది. పాలమూరు ఎత్తిపోతల పథకం అనుమతి పొందని ప్రాజెక్టుల జాబితాలో ఉండటంతో పనులు నిలిపేయాల్సి రానుంది. ఏపీ కూడా ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే.. పాలమూరు పనులు కొనసాగించేందుకు అనుమతివ్వాలని సీఎం, ఎమ్మెల్యేలు కేంద్రమంత్రిని కోరారు. ‘‘పాలమూరు పూర్తిగా కరువు పీడిత ప్రాంతం. తాగు, సాగునీటి కొరతతో అల్లా డుతున్న ప్రాంతం. మాకు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అత్యంత అవసరమైన ప్రాజెక్టు. అది పూర్తయితే మా ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. ఈ ప్రాజెక్టును కొనసాగించేందుకు అనుమతులు ఇవ్వండి.
పర్యావరణ అనుమతుల ప్రక్రియలో భాగంగా ఇటీవల ప్రజాభిప్రాయ సేకరణను కూడా పూర్తిచేశాం. ప్రస్తుతం మాకు అనుమతి ఉన్న 299 టీఎంసీల వాటాలో నుంచే నీటిని వాడుకుంటాం. అంతకుమించి వాడుకోం. ట్రిబ్యునల్ తుది అవార్డుకు కట్టుబడి ఉంటాం. ట్రిబ్యునల్ కేటాయిం పులకు లోబడి నీటిని వాడుకుంటాం. దీనికి సంబంధించి ఏదైనా అండర్ టేకింగ్ ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున అందజేస్తాం..’’ అని కేంద్ర మంత్రికి వివరించారు.
గెజిట్ అమలు, ఇతర అంశాలపైనా..
ఈ నెల 6న కలిసినప్పుడు చేసిన విన్నపాలను సీఎం కేసీఆర్ మరోసారి కేంద్ర మంత్రికి వివరించారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నోటిఫై చేస్తూ ఇచ్చిన గెజిట్ అమలును కొంతకాలం వాయిదా వేయాలని కోరారు. కృష్ణా జలాల పునః పంపిణీకి వీలుగా అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల పరిష్కార చట్టంలోని సెక్షన్ 3ని అనుసరించి కొత్త ట్రిబ్యునల్ వేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణా పరీవాహక ప్రాంతానికి మళ్లిస్తున్నందున.. కృష్ణాలో తెలంగాణకు అదనంగా 45 టీఎంసీల నీటి వాటా వస్తుందని, దీనిని ఈ ఏడాదే కేటాయించాలని కోరారు.
డీపీఆర్‌లను ఓకే చేయండి:
గోదావరి నదిపై చేపట్టిన ఆరు ప్రాజెక్టుల డీపీఆర్‌లు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర మంత్రికి సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. సీతారామ, తుపాకులగూడెం, చనాకా–కొరట, ముక్తేశ్వరం, చౌటుపల్లి హన్మంతరెడ్డి లిఫ్టు తదితర ఆరు ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఇప్పటికే సమర్పించామని వివరించారు. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఇప్పటికే ఆమోదించిన నీటి కేటాయింపుల మేరకే ఈ ప్రాజెక్టులను చేపట్టామని, త్వరితగతిన డీపీఆర్‌లను ఆమోదించాలని కోరారు.
కేసీఆర్‌తో టీఆర్‌ఎస్ ఎంపీల భేటీ
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ను.. టీఆర్‌ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర్‌రావు, కేఆర్ సురేశ్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, బి.వెంకటేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
జల్‌జీవన్ మిషన్‌పై చర్చించాం: షెకావత్
తెలంగాణ సీఎం కేసీఆర్ తనను మర్యాదపూర్వకంగా కలిశారని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ శనివారం ట్వీట్ చేశారు. అన్ని రాష్ట్రాల్లో జల్‌జీవన్ మిషన్ ప్రభావవంతంగా అమలు కావాలని ఆకాంక్షిస్తున్నామని.. తెలంగాణకు సంబంధించి పలు అంశాలతోపాటు ఈ మిషన్‌పైనా చర్చించామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment