సాక్షి, హైదరాబాద్: కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ పలు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తాను రవాణా మంత్రిగా చేసిన కృషి, ముఖ్యమంత్రిగా సింగపూర్ పర్యటనలో ఎదురైన అనుభవం, మాజీ డీజీపీ అప్పారావు కొన్నేళ్ల క్రితం కలిసినప్పటి అంశాలను ప్రస్తావించారు. ఆ విషయాలు కేసీఆర్ మాటల్లోనే..
ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చా
‘‘అప్పారావు ఆర్టీసీ ఎండీ, నేను రవాణా మంత్రి. మేం బాధ్యతలు తీసుకునే నాటికి ఆర్టీసీ రూ.13 కోట్ల నష్టాల్లో ఉంది. ఏం చేద్దాం అప్పారావుగారు అని అడిగితే.. మీరు సరేనంటే గట్టిగా పనిచేసి లాభాల్లోకి తీసుకొద్దాం అన్నారు. చాలెంజ్‌గా తీసుకుని పనిచేశాం. అప్పట్లో ఆంజనేయరెడ్డి గారిని కలవాలనుకున్నాను. నేను ఈ విషయం చెబితే ఆయనే వస్తానన్నారు.
మీరు మా కంటే సీనియర్, నేను మంత్రిని కాగానే కొమ్ములేవీ మొలవలేదు అంటూ నేనే స్వయంగా వెళ్లి మాట్లాడిన. అనేక సలహాలు తీసుకున్నా. ఆపై అప్పారావు గారితో కూర్చుని ఓ ప్రణాళిక సిద్ధం చేసుకుని పని ప్రారంభించాం. రూ.13 కోట్ల నష్టాల్లో ఉన్న ఆర్టీసీని రూ.14 కోట్ల లాభాల్లోకి తీసుకువచ్చాం. మా తర్వాత వచ్చిన కొందరు మళ్లీ ముంచేశారు. ఆర్టీసీ కష్టాల్లో ఉన్నప్పుడల్లా పోలీసు ఉన్నతాధికారులే ఆదుకున్నారు. వారి నాయకత్వమే ఇప్పటికీ ఆర్టీసీని నడిపిస్తోంది’’
సింగపూర్ పరిస్థితులపై మహిళా ఐఏఎస్‌తో..
‘‘సింగపూర్ పర్యటనకు వెళ్లినప్పుడు మహేందర్‌రెడ్డి సూచనల మేరకు అక్కడి పోలీసు విభాగం, పనితీరును పరిశీలించాం. అప్పట్లో నాతో సెక్రటరీ రాజశేఖర్‌రెడ్డి, మరో మహిళా ఐఏఎస్ వచ్చారు. అక్కడి ఓ బిజినెస్ మీట్‌లో కొందరు ‘‘వెన్ ఆర్ యూ గోయింగ్ టూ మేక్ హైదరాబాద్ అజ్ సింగపూర్ (మీరు హైదరాబాద్‌ను ఎప్పుడు సింగపూర్‌గా మారుస్తారు?)’ అని అడిగారు. ఇప్పుడే కదా ప్రారంభమయ్యాం.. కొంత సమయం పడుతుంది అని చెప్పా.
సింగపూర్‌లో మహిళలు అర్థరాత్రి ధైర్యంగా బయటికి వెళ్లి పనులు చేసుకోగలరని వాళ్లు గర్వంగా చెప్పారు. మేం టెస్ట్ చేశాం. రాజశేఖర్‌రెడ్డిని, మా వెంట వచ్చిన మహిళా ఐఏఎస్ అధికారిని క్షేత్రస్థాయిలో పర్యటనకు పంపాం. నిజంగానే ఆమెకు ఎక్కడా ఏ ఇబ్బందీ ఎదురుకాలేదు. అలాంటి రోజులు ఇక్కడ కూడా రావాలి. వస్తాయి.’’
సిటీపై మాజీ అధికారులకు మమకారం
మాజీ పోలీసు అధికారులకు రాష్ట్రంపై, పోలీసింగ్‌పై మంచి కన్సర్న్ ఉంది. ఓ ఏడాది గణేశ్ నిమజ్జనం రోజున మాజీ డీజీపీ అప్పారావు నా దగ్గరకు వచ్చారు. అప్పుడు మహేందర్‌రెడ్డి సిటీ పోలీసు కమిషనర్. అప్పారావు కూడా గతంలో సిటీ పోలీసు కమిషనర్‌గా పనిచేశారు. ఏదో విషయం మాట్లాడుతున్నాం. అ సమయంలో అప్పారావు నా ముందే ఫోన్ తీసి మహేందర్‌రెడ్డికి కాల్ చేశారు.
గణేశ్ ఊరేగింపు ఎక్కడి వరకు వచ్చింది? అక్కడ జాగ్రత్త, ఫలానా చోట మన వాళ్లు అలర్ట్‌గా ఉన్నారా? అని అడిగి సలహాలు ఇచ్చారు. ఇప్పటికీ మాజీ పోలీసు ఉన్నతాధికారుల సూచనలు, సలహాలు అవసరం.
Comments
Please login to add a commentAdd a comment