హైదరాబాద్ శివార్లలోని మంచిరేవులలో ‘యంగ్ ఇండియా పోలీస్ స్కూల్’ ఏర్పాటు
పోలీసు పిల్లలకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం: సీఎం రేవంత్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పోలీసు సిబ్బంది పిల్లలకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘యంగ్ ఇండియా పోలీస్ స్కూల్’ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో మంత్రి శ్రీధర్‌బాబుతో కలసి ఈ ‘పోలీస్ స్కూల్’కు శంకుస్థాపన చేశారు. పోలీసు వ్యవస్థలో కొత్త అధ్యాయానికి దీనితో తెరతీసినట్టు సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక ‘‘యూనిఫాం సర్వీసులవారి కుటుంబ సభ్యుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. అందులో భాగంగానే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు శంకుస్థాపన చేశాం.
ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో గత ప్రభుత్వం పోలీసులను వారి పార్టీ శ్రేయస్సు కోసం ఉపయోగిస్తే.. మా ప్రభుత్వం మాత్రం పోలీసు కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం పనిచేస్తోంది..’’ అని ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశామని.. కులమతాలకు అతీతంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
గత ప్రభుత్వం పదేళ్లలో పోలీసులకు ఏమీ చేయలేదని విమర్శించారు. కాగా.. పోలీసు కుటుంబ సభ్యులకు స్కూల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని.. ఇవి కేంద్రీయ విద్యాలయాలకు దీటుగా విద్యను అందిస్తాయని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పారు. కేంద్రీయ విద్యాలయాల్లో మాదిరిగా.. పోలీస్ స్కూళ్లలోనూ ఇతర విద్యార్థులకు 15 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు.
యూనిఫాం సర్వీసుల సిబ్బంది అందరికీ..
పోలీస్ శాఖలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందితోపాటు ఇతర యూనిఫాం సర్వీసులైన అగ్నిమాపక, ఎక్సైజ్, ఎస్పీఎఫ్, జైళ్లశాఖ సిబ్బంది పిల్లలకు విద్య అందించేందుకు ‘యంగ్ ఇండియా పోలీస్ స్కూల్’ను ఏర్పాటు చేస్తూ.. హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment