నైపుణ్యానికే భవిష్యత్తు: సీఎం రేవంత్‌రెడ్డి | CM Revanth Reddy On Skill Technical Expertise | Sakshi
Sakshi News home page

నైపుణ్యానికే భవిష్యత్తు: సీఎం రేవంత్‌రెడ్డి

Published Wed, Jun 19 2024 5:03 AM | Last Updated on Wed, Jun 19 2024 5:43 AM

CM Revanth Reddy On Skill Technical Expertise

సర్టిఫికెట్లు చూసి ఉద్యోగాలు ఇచ్చే రోజులు పోయాయి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాభివృద్ధికి రాష్ట్ర సర్కారు కార్యాచరణ 

రూ.2,324 కోట్లతో ఆధునిక శిక్షణా సంస్థలుగా ఐటీఐల అభివృద్ధి 

ఏటీసీల్లో రోబో టెక్నాలజీతో పాటు ఇతర సాంకేతిక ట్రేడ్‌లలో శిక్షణ 

ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కల్పనకే ప్రభుత్వ ప్రాధాన్యత 

తొలుత 4 ఐటీఐలు ఏటీసీలుగా ఆధునీకరణ 

మల్లేపల్లి ఐటీఐ క్యాంపస్‌లో నూతన భవనాలకు సీఎం శంకుస్థాపన

సాక్షి, హైదరాబాద్‌: సాంకేతిక నైపుణ్యం ఉన్న వారికే ఇకపై ఉద్యోగాలు దక్కుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సర్టిఫికెట్లు చూసి ఉద్యోగాలు ఇచ్చే రోజులు పోయాయన్నారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం విస్తృతమవుతోందని, సాంకేతిక నైపుణ్యం ఉన్న వారికే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక కార్యాచరణకు శ్రీకారం చుట్టిందని వెల్లడించారు. 

రాష్ట్రంలోని పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ)లను అడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ (ఏటీసీ)లుగా ఆధునీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం నాలుగు ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్‌ చేస్తూ నూతన భవన నిర్మాణాల కోసం ఐటీఐ మల్లేపల్లి క్యాంపస్‌లో సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. 

ప్రపంచంతో పోటీ పడేలా నైపుణ్యాభివృద్ధి
‘ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది. ప్రత్యేక రాష్ట్రం వచి్చన తర్వాత ప్రభుత్వ శాఖల్లో నియామకాలు జరుగుతాయని నిరుద్యోగులు ఆశించారు. కోచింగ్‌ సెంటర్లకు లక్షల రూపాయల ఫీజులు కట్టారు. కానీ నిరుద్యోగ యువత పదేళ్ల బంగారు కాలాన్ని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాశనం చేసింది. నియామకాల ప్రక్రియలో జరిగిన అవకతవకలు, లోపాలు, లీకేజీలతో నిరుద్యోగులు నట్టేట మునిగారు. అలాంటి పరిస్థితులను చక్కదిద్దేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. 

ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచంతో పోటీ పడే విధంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమానికి కారం చుట్టింది. గత ప్రభుత్వ పాలనలో ఐటీఐలు కూడా నిర్వీర్యమయ్యాయి. వాటిలో ప్రవేశాలు పొందే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదు. అడ్మిషన్ల కోసం పోటీ పడే విధంగా ఐటీఐలను అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న 65 ప్రభుత్వ ఐటీఐలను రూ.2,324 కోట్ల ఖర్చుతో ఆధునిక శిక్షణా సంస్థలుగా తీర్చిదిద్దుతున్నాం. 

ఒక్కో ఏటీసీని గరిష్టంగా రూ.50 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం. వీటిల్లో రోబో టెక్నాలజీతో పాటు ఇతర సాంకేతిక ట్రేడ్‌లను ప్రవేశపెట్టి విద్యార్థులకు శిక్షణ ఇస్తాం. ఇక్కడ శిక్షణ పొందిన వారికి ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగం పొందే సామర్థ్యం వచ్చేలా లేదా సొంతంగా యూనిట్‌ ఏర్పాటు చేసుకోగలిగేలా తయారు చేస్తాం..’అని ముఖ్యమంత్రి వివరించారు. 

ప్రతి నెలా సమీక్ష 
‘అడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్‌ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా పరిగణిస్తున్నాం. ఈ సెంటర్ల ద్వారా జరిగే కార్యక్రమాలను ప్రతి నెలా క్రమం తప్పకుండా సమీక్షిస్తా. ఇందుకోసం ఈ శాఖ నావద్దే ఉంటుంది. ఏటీసీలో శిక్షణ తీసుకునేవారికి భరోసా కల్పించేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నాం. అమెరికా సిలికాన్‌ వ్యాలీలోని భారతీయుల్లో నాలుగో వంతు తెలుగు వాళ్లున్నారు. ఐటీ రంగంలో తెలుగువాళ్లు ప్రపంచంతో పోటీ పడుతున్నారు. అదేవిధంగా ఫార్మా రంగంలోనూ మన పోటీకి సాటిలేదు. 

అప్పటి ప్రభుత్వాలు ఈ రెండు రంగాలపై దృష్టి పెట్టడంతోనే మన పురోగతి వేగంగా ముందుకెళ్లింది. ఇప్పుడు కూడా సాంకేతిక నైపుణ్యంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రతి ఏటీసీలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన కోర్సులను ప్రవేశపెట్టబోతున్నాం. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ఆదేశాలిచ్చాం. అతి త్వరలో రాష్ట్రంలోని అన్ని సెంటర్లు అందుబాటులోకి వస్తాయి..’అని రేవంత్‌రెడ్డి తెలిపారు.

స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు: మంత్రి శ్రీధర్‌బాబు 
పరిశ్రమలు, నైపుణ్య సంస్థల మధ్య అంతరాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఇందులో భాగంగా ఏటీసీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పారు. ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఏటీసీలు అభివృద్ధి చెందేలా కార్యాచరణ రూపొందించామన్నారు. 

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రయోగశాలను వీటిల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి ఏటీసీలో వీఆర్‌ (వర్చువల్‌ రియాలిటీ) టెక్నాలజీని ప్రవేశపెడుతున్నామన్నారు. ఈ ఏడాది జనవరిలో ఏటీసీ ప్రాజెక్టును ఖరారు చేశామని, మార్చి నెలలో టాటా టెక్నాలజీస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. ప్రత్యేకంగా స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు శ్రీధర్‌బాబు వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement