డిసెంబర్‌కల్లా ‘పాలమూరు’   | Complete Palamuru RR Lift By Year End: KCR | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌కల్లా ‘పాలమూరు’  

Published Mon, Mar 22 2021 4:51 AM | Last Updated on Mon, Mar 22 2021 5:28 AM

Complete Palamuru RR Lift By Year End: KCR - Sakshi

ఆదివారం ప్రగతి భవన్‌లో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇరిగేషన్‌ శాఖ అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల స్ఫూర్తితో పనులు కొనసాగాలని స్పష్టం చేశారు. కృష్టా బేసిన్‌లోని ఇతర పెండింగ్‌ ప్రాజెక్టుల నిర్మాణాల పనులను సంపూర్ణంగా పూర్తి చేయాలన్నారు.  పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణ పనుల పురోగతి, పనుల వేగవంతంపై సీఎం కేసీఆర్‌ ఆదివారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పాలమూరు జిల్లా మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, అబ్రహం, అంజయ్య యాదవ్, కృష్ణమోహన్‌రెడ్డి, నరేందర్‌ రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, హర్షవర్దన్‌రెడ్డి, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇరిగేషన్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌ కుమార్, ఈఎన్సీ మురళీధర్‌రావు, సలహాదారు పెంటారెడ్డి,  పాలమూరు సీఈ రమేశ్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘తెలంగాణ ఉద్యమంలో మహబూబ్‌ నగర్‌ నీటి గోసను, నల్లగొండ ఫ్లోరైడ్‌ కష్టాలను ప్రస్తావించకుండా నా ప్రసంగం సాగలేదు. నాటి పాలకులు తెలంగాణ ప్రాజెక్టులను కావాలనే పెండింగ్‌లో పెట్టారు.  తెలంగాణ వచ్చాక పెండింగ్‌ ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నం. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేయాలని ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు కొందరు దుర్మార్గంగా కోర్టుల్లో  కేసులేసి స్టేల ద్వారా అడ్డుపడుతున్నరు. అయినా మనం పట్టుదలతో పనులు చేసుకుంటూ వస్తున్నం. జూరాల సహా ఇప్పటికే మనం కల్వకుర్తి నెట్టెంపాడు భీమా వంటి ప్రాజెక్టులను పూర్తి చేసుకొని దక్షిణ పాలమూరుకు చెందిన 11 లక్షల ఎకరాలను పచ్చగా చేసుకున్నం. ఇంకా వాటిల్లో కొసరు పనులు  మిగిలినయి. వాటిని అతిత్వరలో ఎలా పూర్తి చేసుకుందామనే ఆలోచన చేయాలె. కాళేశ్వరం స్ఫూర్తితో పనులు సాగాలె. ఏది ఏమయనా సరే.. పాలమూరు ఎత్తిపోతల పనులు ఈ ఏడాది డిసెంబర్‌ కల్లా ఎట్టి పరిస్థితిల్లోనూ పూర్తి చేసుకోవాలి’ అని సీఎం అన్నారు.

ప్రతి చుక్కను ఒడిసి పట్టాలి..
గోదావరి ప్రవాహానికి కృష్టా ప్రవాహానికి తేడా వుంటుందని, సముద్రుని వైపు ప్రవహించే కొద్దీ గోదావరి ప్రవాహం పెరుగుతూ పోతుంటే.. కృష్టా ప్రవాహం తగ్గుతూ వస్తుందని సీఎం కేసీఆర్‌ విశ్లేషించారు. రానురాను వర్షాలు తగ్గిపోవడం, దానికి తోడు కృష్టా నదిపై కర్ణాటక, మహారాష్ట్రలు నిర్మించిన ప్రాజెక్టులు, దిగువ రాష్ట్రం అక్రమంగా ఏర్పాటు చేసిన తూముల వల్ల నదిలో నీటి లభ్యత ప్రమాదంలో పడిపోయిందన్నారు. ఈ  నేపథ్యంలో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన నీటి వాటాను చుక్కనీరు పోకుండా ఒడిసి పట్టుకోవాల్సిందేనని, అందుకు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల సహా కృష్టాపై అన్ని పెండింగ్‌ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసుకోవాల్సిందేనని జలవనరుల శాఖ అధికారులకు సీఎం స్పష్టం చేశారు.

పాలమూరుతో జూరాలకు లింక్‌..
కృష్టా జలాలను మలుపుకొని పాలమూరును పూర్తిస్తాయిలో పంట పొలాలతో పచ్చగా మార్చుకుందామని సీఎం కేసీఆర్‌ సూచించారు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టు ఎంత త్వరగా పూర్తయితే వ్యవసాయ రంగానికి అంత మంచిదని, ఈ పథకాన్ని జూరాలకు లింక్‌ చేసుకోవచ్చని వివరించారు. పాలమూరు ఎత్తిపోతల నిర్మాణం కోసం చేపట్టబోయే భూసేకరణ, పునరావాసం, విద్యుత్‌ సబ్‌స్టేషన్ల నిర్మాణం, కాలువల తవ్వకం, పంపుల ఏర్పాటు తదితర నీటి సరఫరా పనులకు సంబంధించి అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం చర్చించారు. భూసేకరణ, పునరావాసం కోసం ఎంత డబ్బు అవసరం? ఇంకా భూసేకరణ సహా పెండింగ్‌లో ఉన్న పనుల వివరాలేమిటి? మొత్తం రిజర్వాయర్లు ఎన్ని? నీటి నిల్వ పెంచుకోవడానికి వాటిని ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉందా? వాటిల్లో పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం ఎంత? వంటి విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు.

కాళేశ్వరం స్ఫూర్తితో పనులు జరగాలి..
నార్లాపూర్, ఏదుల, వట్టెం వద్ద ఏర్పాటు చేయాల్సిన పంపులను త్వరలో బిగించాలలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. నార్లాపూర్‌ నుంచి ఏదుల వరకు టన్నెల్‌ పనుల పూర్తికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందని ఇంజనీర్లను ఆరా తీశారు. జూన్‌ నెలాఖరుకల్లా పనులు పూర్తి కావాలన్నారు. వట్టెం నుంచి కరివేన వరకు కాలువ పనులతోపాటు కాలువ లైనింగ్‌ కోసం జరుగుతున్న పనుల పురోగతిని సీఎం అడిగి తెలుసుకున్నారు. కావాల్సినన్ని నిధులను ప్రభుత్వం అందిస్తున్నా.. పనుల జాప్యంపట్ల అధికారులను ప్రశ్నించిన సీఎం... ఇకపై పనులను వేగంగా చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వారం వారం సమీక్షలు జరుపుతూ క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల పురోగతిని సమీక్షించాలని ఉన్నతాధికారులు స్మతా సబర్వాల్, రజత్‌ కుమార్, మురళీధర్‌రావులను సీఎం ఆదేశించారు. కాళేశ్వరం పనులు ఎంత వేగంగా జరిగాయో అదే స్ఫూర్తితో పాలమూరు ఎత్తిపోతల నిర్మాణం పనులు జరగాలన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement