
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధి లో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. జిల్లా పరిధిలోని ప్రాజెక్టులకు సంబంధించి ఆయన మంగళవారం నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్‌సీ మురళీధర్‌తో బీఆర్‌కే భవన్‌లో భేటీ అయ్యారు. కృష్ణా జలాల వివాదం, బ్రాహ్మణవెల్లెంల, ఎస్సె ల్బీసీ టన్నెల్ పనులపై చర్చించారు. బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయ్యాయని, రూ.100 కోట్లు కేటాయిస్తే పనులు పూర్తవుతాయని కోమటిరెడ్డి వివరించారు. కాంగ్రెస్ హయాంలో 70 శాతం పూర్తయిన శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. కాగా, సీఎం దృష్టికి తీసుకెళ్లి పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు కోమటిరెడ్డి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment