సాక్షి, హైదరాబాద్: సీనియర్లు.. జూనియర్లు.. ఎవరైనా సరే.. ప్రజాక్షేత్రంలో బలం, బలగం ఉన్నవారికే ఈసారి అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందా?ముందుగా చెప్పినా, చివరి క్షణంలో ప్రకటించినా ‘సర్వే’ సూత్రం ఆధారంగానే రేసుగుర్రాలను ఎంపిక చేయనుందా? కర్ణాటకలో అవలంబించిన ఫార్ములానే తెలంగాణలోనూ అమలు చేయాలని నిర్ణయించిందా?.. ఈ ప్రశ్నలకు గాంధీభవన్ వర్గాల నుంచి ఔననే సమాధానమే వస్తోంది.
రాష్ట్ర కాంగ్రెస్‌లో సీనియర్లు, ముఖ్య నాయకులుగా గుర్తింపు పొందిన వారంతా ఈసారి కూడా టికెట్ తమకే అన్న ధీమాలో ఉండగా.. మరోవైపు సర్వేలో ప్రతికూల ఫలితం వస్తే మాత్రం ‘టికెట్ కట్’ అయినట్టే అన్న వాదన కూడా వినిపిస్తోంది. కర్ణాటకలో ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే ఏకంగా 124 మంది అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేయడం.. తెలంగాణలోనూ అభ్యర్థులను ముందుగానే ప్రకటించాలన్న డిమాండ్ల నేపథ్యంలో.. ‘సర్వే’ అంశం చర్చనీయాంశంగా మారింది.
‘చాన్స్’పై చర్చ
ఈ ఏడాది నవంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగవచ్చనే అంచనాల నేపథ్యంలో.. ఇక్కడ అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారనే దానిపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఆరు నెలల ముందే అభ్యర్థులను అధికారికంగా క్షేత్రంలోకి పంపాలని భువనగిరి ఎంపీ, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందు నుంచీ కోరుతున్నారు. రాష్ట్ర ఇన్‌చార్జులు, ఏఐసీసీ పెద్దలను కలిసినప్పుడు కూడా దీనిపై విజ్ఞప్తి చేస్తున్నారు.
మరోవైపు ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా కర్ణాటకలో అభ్యర్థుల ప్రకటన తర్వాత చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర కాంగ్రెస్‌లో దాదాపు 50 శాతం సీట్లు ఖరారైనట్టేనని.. 60 మంది వరకు అభ్యర్థుల ప్రకటనకు ఇబ్బందులు లేవని ఆయన హాథ్‌సే హాథ్ జోడో యాత్రల సందర్భంగా పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు. ఈ లెక్కన ఎన్నికల ముందే ఒక జాబితా రావొచ్చని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఎవరికి ఖాయంగా టికెట్లు?
రాష్ట్ర కాంగ్రెస్‌లో పెద్ద తలలుగా గుర్తింపు పొందిన నేతలంతా తమకు టికెట్ ఖాయమనే ధీమాలో ఉన్నారు. అనూహ్య పరిణామాలు సంభవిస్తే తప్ప తమకు టికెట్ పక్కా అనే ధోరణిలో ముందుకెళుతున్నారు. పార్టీ తరఫున ఉన్న ముగ్గురు ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీతోపాటు మరికొందరికి టికెట్ ఖాయమనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఎంపీలు రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, పొదెం వీరయ్య, సీతక్క, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డితోపాటు మహేశ్వర్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, మధుయాష్కీ, గీతారెడ్డి, షబ్బీర్‌అలీ, ఈరవత్రి అనిల్, మహేశ్‌కుమార్‌గౌడ్, బల్మూరి వెంకట్, పొన్నాల లక్ష్మయ్య, దొంతి మాధవరెడ్డి, ఉత్తమ్ పద్మావతి, జానారెడ్డి, సంపత్‌కుమార్, వంశీచందర్‌రెడ్డి, నాగం జనార్దనరెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, మల్‌రెడ్డి రంగారెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్, టి.రామ్మోహన్‌రెడ్డి, బలరాం నాయక్, ఫిరోజ్‌ఖాన్, బాలూనాయక్, బీర్ల అయిలయ్య, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, విజయరమణారావు, రాజ్‌ఠాకూర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఆది శ్రీనివాస్, విజయారెడ్డి, నందికంటి శ్రీధర్, మెట్టు సాయికుమార్, శ్రీరంగం సత్యం తదితరులు టికెట్ చాన్స్ జాబితాలో ఉన్నారు.
సర్వేలో ప్రతికూల ఫలితమొస్తే..?
చాలా మందికి టికెట్ ఖాయమని భావిస్తున్నా, మరికొందరికి చాన్స్ ఎక్కువేనని అంచనా వేస్తున్నా పరిస్థితి ఎలా మారుతుందోనని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కచ్చితంగా టికెట్ వస్తుందన్నదా, లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమని... ఏఐసీసీ సర్వేల ఆధారంగానే టికెట్ ఇవ్వాలా, వద్దా అన్నది నిర్ణయమవుతుందని గాంధీభవన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కర్ణాటకలో తొలి జాబితా కింద ప్రకటించిన 124 మందికి కూడా ఏఐసీసీ సర్వే తర్వాతే టికెట్లు ఖరారు చేశారని.. దీనితో చాలా మంది పోటీచేసే స్థానాలు కూడా మారాయని చెప్తున్నాయి.
ఇప్పటికే కసరత్తు ముమ్మరం..
తెలంగాణలో నియోజకవర్గాలు, అభ్యర్థుల బలాబలాలపై వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందం ఇప్పటికే అంతర్గతంగా సర్వేలు చేస్తోంది. ఆ సర్వేలకు సంబంధించిన రెండు, మూడు నివేదికలను అధిష్టానానికి అందజేసింది. ఇలా సునీల్ టీం చేసే సర్వేలతోపాటు ఏఐసీసీ నేరుగా చేసే సర్వేలు త్వరలోనే తెలంగాణలో ప్రారంభమవుతాయని తెలిసింది. టీపీసీసీ నేతలకు కూడా సమాచారం లేకుండా జరిగే ఈ సర్వే వివరాలు నేరుగా అధిష్టానానికి అందుతాయని.. టికెట్ల కేటాయింపు సమయంలో వాటినే ప్రాధాన్యతగా తీసుకుంటారని అంటున్నారు.
సీనియర్లయినా, జూనియర్లు అయినా, టికెట్లు ఎప్పుడు ప్రకటించినా ‘సర్వే’ సూత్రం ఆధారంగానే జరుగుతుందని చెప్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో పునర్వైభవం పొందేందుకు.. ఈ ఏడాది జూన్ నెలలో భారీ బహిరంగసభను నిర్వహించాలని, సోనియా, రాహుల్, ప్రియాంకలలో ఒకరిని రప్పించి ఉత్తేజపూరిత వాతావరణంలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని టీపీసీసీ భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
‘సర్వే’తోనేచాన్స్!
Published Thu, Mar 30 2023 12:55 AM | Last Updated on Thu, Mar 30 2023 12:56 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment