సాక్షి, హైదరాబాద్: బాలానగర్ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. నగరంలో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభంతో స్థానికులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. రూ.387 కోట్లతో 1.13 కి.మీ. పొడవుతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఫ్లైఓవర్ రిబ్బన్ కటింగ్ ఎవరు చేశారో తెలుసా.. మంత్రి కేటీఆర్ ఓ కూలీ చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేయించారు.
ఆమెనే వనపర్తి జిల్లాకు చెందిన శివమ్మ. గత రేండేళ్ల నుంచి ఈ ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల్లో ఆమె పాలు పంచుకుంది. శివమ్మ చేతుల మీదుగా ఫ్లై ఓవర్‌ను ప్రారంభించుకోవడంతో కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది శివమ్మ. కాగా. 6 లైన్లు, 24 మీ. వెడల్పు, 26 పిల్లర్లతో ఫ్లైఓవర్‌ను నిర్మించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. త్వరలో రహదారుల విస్తరణ చేపడతామన్నారు. ప్యాట్నీ నుంచి సుచిత్ర వరకు స్కైవే నిర్మిస్తామని తెలిపారు. ఫతేనగర్ ఫ్లైఓవర్‌ను విస్తరిస్తామని కేటీఆర్ వెల్లడించారు. ప్రారంభోత్సవ క్యార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment