
సాక్షి, హైదరాబాద్: ఈ నెలలో జరిగే అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలకు సంబంధించి అన్ని శాఖలు తమ శాఖకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తయారు చేయాలని ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. బిఆర్ కెఆర్ భవన్‌లో గురువారం ఆయన వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ శాసన మండలి, శాసన సభలో పెండింగ్‌లో ఉన్న ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపించాలన్నారు. వివిధ శాఖల అధికారులు, అసెంబ్లీ అధికారులతో సమన్వయం చేసుకొని పని చేయాలన్నారు. శాసన మండలిలో సీనియర్ అధికారులు ఉండేలా చూడాలని కార్యదర్శులను ఆయన ఆదేశించారు. సమావేశాల సందర్భంగా సభ్యులు లేవనెత్తే అంశాలకు సంబంధించిన నోట్స్‌ను అధికారులు సిద్ధం చేసుకుని ఉండాలని సీఎస్ సోమేష్‌కుమార్ సూచించారు.