రామానుజులు కట్టిన వెయ్యేళ్ల ఆనకట్ట.. మరోసారి తెరపైకి  | Dam In Karntaka Built Thousand Years Ago Was Constructed by Ramanujacharya | Sakshi
Sakshi News home page

Ramanujacharya: రామానుజులు కట్టిన వెయ్యేళ్ల ఆనకట్ట.. మరోసారి తెరపైకి 

Published Sat, Feb 5 2022 9:28 PM | Last Updated on Sat, Feb 5 2022 9:29 PM

Dam In Karntaka Built Thousand Years Ago Was Constructed by Ramanujacharya - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిరంతరం భగవన్నామ స్మరణలో ఉండే గురువులు.. చుట్టూ ఉన్న ప్రాణికోటి మేలు కోసం ఆలోచించాలన్నదే శ్రీరామానుజుల తత్వం. ఈ తపనతోనే ఆయన దాదాపు వెయ్యేళ్ల కింద ఓ జలాశయ నిర్మాణానికి పూనుకున్నారు. తాను కొంతకాలం నివసించిన ప్రాంతంలో నీటి కరువు లేకుండా చేశారు. అదే కర్ణాటకలోని తొండనూరులో ఉన్న తిరుమల సముద్రం. ఇప్పటికీ వేల ఎకరాలకు నీళ్లిస్తున్న ఈ సరస్సు.. రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

రైతుల బాధ చూసి..
అప్పట్లో రామానుజాచార్యులు తమిళనాడులోని శ్రీరంగాన్ని వదిలి కర్ణాటక ప్రాంతానికి వచ్చారు. మేల్కోటికి వెళ్తూ ప్రస్తుత మాండ్యా జిల్లాలోని తొండనూరులో కొంతకాలం ఉన్నారు. ఆ సమయంలో హొయసల రాజ్యానికి రెండో రాజధానిగా తొండనూరు ఉందని చరిత్ర చెబుతోంది. ఆ రాజ్య ప్రతినిధి తొండనూరు నంబి రామానుజులను స్వాగతించారు. అయితే అక్కడ తరచూ కరువుతో రైతులు ఇబ్బందిపడు తుండటాన్ని చూసిన రామానుజులు.. తానే ఇంజనీరుగా అవతారమెత్తి.. వర్షాధార పెద్ద చెరువుకు చివరలో ఉన్న రెండు గుట్టలను జోడిస్తూ ఆనకట్ట కట్టించారు. దాంతో చిన్న చెరువు.. 2200 ఎకరాల భారీ సరస్సుగా మారింది. దానికి  తిరుమల సముద్రంగా పేరుపెట్టారు. దేశంలో ప్రాచీన ఆనకట్ట ఇదేనని చరిత్ర పరిశోధకులు చెప్తున్నారు.

వెయ్యేళ్ల కిందటి ఈ జలాశయం ఒక్కసారి కూడా ఎండలేదని స్థానికులు అంటున్నారు. తమ సమస్య తీర్చడంతో స్థానికులు 35 అడుగుల ఎత్తుతో రామానుజాచార్య విగ్రహాన్ని ప్రతిష్టించుకున్నారు. సరస్సు నుంచి నీళ్లు ఓ చిన్న జల పాతంలా దిగువకు ప్రవహిస్తాయి. దాన్ని రామానుజ గంగగా పిలుస్తుంటారు. నీటి అడుగున గులకరాళ్లు స్పష్టంగా కనిపించేంత తేటగా నీళ్లుండటంతో.. టిప్పు సుల్తాన్‌ ఈ సరస్సుకు మోతీ తలాబ్‌ అని పేరు పెట్టాడు. తర్వాత ఆయనే దాని ఆనకట్టను కొంత ధ్వంసం చేయించారని.. తర్వాత బ్రిటిష్‌ పాలకులు మరమ్మతు చేయించారని చెబుతారు.

జైనం నుంచి వైష్ణవంలోకి..
తొండనూరు ప్రాంతాన్ని పాలిస్తున్న హొయసల రాజు బిత్తి దేవ మొదట్లో జైనమతాన్ని ఆచరించేవారు. ఆయన కుమార్తెకు ఏదో వింత మానసిక సమస్య తలెత్తి, పరిష్కారం దొరక్క మనోవేదనకు గురయ్యారు. చివరకు రామానుజులను ఆశ్రయించటంతో.. రాజు కుమార్తెకు తిరుమల సముద్రంలో స్నానం చేయించి విష్ణు ఆరాధన చేయించారు. కొంతకాలానికి ఆమె సమస్య తగ్గటంతో బిత్తి దేవరాజు రామానుజులను అనుసరిస్తూ వైష్ణవ సంప్రదాయాన్ని స్వీకరించారు. తన పేరును విష్ణువర్ధనుడిగా మార్చుకుని.. ఆ ప్రాంతంలో అద్భుత నిర్మాణ శైలితో నంబి నారాయణ దేవాలయాన్ని నిర్మించారు. రామానుజులు నిర్మించిన పంచ నారాయణ దేవాలయాల్లో ఇదీ ఒకటిగా, పర్యాటక క్షేత్రంగా వెలుగొందుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement