గ్రేటర్ పరిధిలో అమలుకు ట్రాఫిక్ పోలీసుల నిర్ణయం
అతి వేగంగా డ్రైవింగ్ చేసినా క్యాన్సిలే..
రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గించడమే లక్ష్యం
ఇప్పటివరకు డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లోనే చర్యలు..
సాక్షి, హైదరాబాద్: ఒకరు కాదు ఇద్దరు కాదు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏటా వందల సంఖ్యలో రాంగ్ సైడ్ డ్రైవింగ్, అతివేగం కారణంగా మృత్యువాత పడుతున్నారు. ఆయా ప్రమాదాలలో వాహనదారులే కాదు పాదచారులు, తోటి ప్రయాణికులు సైతం మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) రద్దయ్యేలా చేస్తున్నారు.
మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపరిచేటప్పుడు.. అభియోగపత్రాల్లో మందుబాబుల వ్యవహార శైలి, మద్యం మత్తులో చేసిన ప్రమాదాల వివరాలను నమోదు చేస్తున్నారు. న్యాయస్థానాలు వారికి రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకూ జరిమానాలు విధించడంతో పాటు కొందరికి 3 నెలల నుంచి 6 నెలల వరకు లైసెన్స్‌లు రద్దు చేస్తున్నాయి.
తాజాగా అపసవ్య దిశలో (రాంగ్ సైడ్) వాహనాలు నడపడం, అతివేగం కారణంగా సంభవిస్తున్న రోడ్డు ప్రమాదాలు, మరణాలను తగ్గించడం లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారి డ్రైవింగ్ లైసెన్స్‌లు కూడా రద్దయ్యేలా అభియోగ పత్రాలు దాఖలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రవాణా శాఖకు ప్రతిపాదనలు పంపించినట్లు, త్వరలోనే గ్రేటర్‌లో అమల్లోకి రానున్నట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.
హైవేలపై ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు: జాతీయ రహదారులపై పాదచారులు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. దీంతో హైవేలపై ప్రజలు రోడ్డు దాటేందుకు వీలుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
అలాగే రాచకొండ కమిషనరేట్ పరిధిలో 103 బ్లాక్‌స్పాట్లు (ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రదేశాలు) ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. వీటి మరమ్మతులు, నిర్వహణపై జీహెచ్‌ఎంసీ, ఆర్‌అండ్‌బీ, ఇతరత్రా విభాగాలతో జరిగిన సమావేశంలో చర్చించారు. రోడ్డు మధ్యలో డివైడర్ల ఎత్తును పెంచడంతో పాటు వీధి దీపాలను ఏర్పాటు చేసేలా చూడాలని నిర్ణయించారు. మరోవైపు ప్రమాదాలకు ప్రధాన కారణాలను కూడా పోలీసులు గుర్తించారు.
ప్రమాదాలకు ప్రధాన కారణాలు
» జాతీయ రహదారులపై డ్రైవర్లు 15–18 గంటల పాటు ఏకధాటిగా డ్రైవింగ్ చేయడం.
» హైవేలపై లైనింగ్ నిబంధన పాటించకపోవడం. ఇతర వాహనాలను ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించడం.
» రాత్రివేళ సరైన నిద్రలేకపోవడం, మద్యం తాగి వాహనాలు నడపడం.
» హైవేలపై కేటాయించిన స్థలంలో కాకుండా రోడ్డు మధ్యలో వాహనాలను నిలపడం.
» పాదచారులు జాతీయ రహదారులపై లైట్లు లేని ప్రాంతంలో రోడ్లను దాటుతుండటం.
భవిష్యత్తు అంధకారమే..
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి వాహనాలు నడపడంతో పాటు ఇతరుల మరణానికి కారణం అయితే చేజేతులా భవిష్యత్తును అంధకారం చేసుకున్నట్లే. మోటార్ వాహన చట్టం (ఎంవీ) కేసులలో పోలీసులు న్యాయస్థానాల్లో సమర్పిస్తున్న అభియోగపత్రాల ఆధారంగానే ఉల్లంఘనల విషయంలో చర్యలు ఉంటాయి.
కొన్ని సందర్భాల్లో జైలుకు వెళ్లాల్సి వస్తే ఉన్న ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఉద్యోగ అవకాశాల సమయంలో విద్యార్థులు, యువకులను ఈ కేసులు ఇబ్బంది పెడతాయి. – వి.శ్రీనివాసులు, డీసీపీ, ట్రాఫిక్, రాచకొండ
Comments
Please login to add a commentAdd a comment