ఎమ్మెల్యే మర్రి కళాశాల భవనం కూల్చివేత | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే మర్రి కళాశాల భవనం కూల్చివేత

Published Fri, Mar 8 2024 3:55 AM

Demolition of MLA Marri Rajasekhar Reddy College building - Sakshi

ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లను ఆక్రమించారంటూ వారం క్రితం అధికారుల నోటీసులు

ఐదు అంతస్తుల్లో రెండంతస్తులు తొలగింపు

దుండిగల్‌: మేడ్చల్‌ జిల్లా దుండిగల్‌లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌(ఐఏఆర్‌ఈ) కళాశాల భవనాన్ని కూల్చివేశారు. చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లను ఆక్రమించి నిర్మాణాలను చేపట్టారంటూ ఇటీవల నోటీసులు ఇచ్చిన ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు గురువారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు నడుమ కళాశాల వద్దకు చేరుకున్నారు.

జేసీబీలతో ఐదు అంతస్తుల శాశ్వత భవనాన్ని కూల్చివేయడం మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న కళాశాల విద్యార్థులు వందల సంఖ్యలో అక్కడికి చేరుకుని కూల్చివేతలను అడ్డుకున్నారు. ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పనులను అడ్డగించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అధికారులు తాత్కాలికంగా పనులను నిలిపివేయడంతో పాటు పోలీసులు విద్యార్థులను సముదాయించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. తరువాత మరో సారి కూల్చివేతలు కొనసాగించగా కళాశాల యాజమాన్యం కోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో కూల్చివేతలను నిలిపివేశారు.

కళాశాలకు చేరుకున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు
ఐఏఆర్‌ఈ కళాశాలలో కూల్చివేతలు జరుగుతున్న విషయం తెలుసుకున్న వెంటనే కళాశాల చైర్మన్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. తమకు కనీసం సమయం ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్‌ నియోజకవర్గాల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, మాధవరం కృష్ణారావు, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు  కళాశాలకు వచ్చి రాజశేఖర్‌రెడ్డికి మద్దతుగా నిలిచారు.

20 రోజుల్లోపే చర్యలు.. 
దుండిగల్‌లోని చిన్న దామెర చెరువును ఫిబ్రవరి 20వ తేదీన మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ గౌతమ్‌ స్వయంగా పరిశీలించారు. సుమారు 8.24 ఎకరాలు కబ్జాకు గురైనట్లు ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారు లు అప్పట్లోనే ఆయనకు నివేదిక ఇచ్చారు. అదే నెల 22వ తేదీన ఎఫ్‌టీఎల్‌ సరిహద్దులను ఏర్పాటు చేసి షెడ్డులు, ఇతర నిర్మాణాలను తొలగించారు. తాజాగా ఐదు అంతస్తుల శాశ్వత భవనంలో రెండు అంతస్తుల మేర కొంత భాగాన్ని కూల్చారు.

కేసు సుప్రీంకోర్టులో ఉన్నా...ఆగలేదు: మర్రి రాజశేఖర్‌రెడ్డి
25 సంవత్సరాల నుంచి కళాశాలను నడిపిస్తున్నాం. అప్పటి నుంచి ఏ ఒక్క అధికారి కూడా నోటీసు ఇవ్వలేదు. గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడే అనుమతులు తీసుకున్నాం. హెచ్‌ఎండీఏ పరిధిలోకి వచ్చిన తరువాత రెగ్యులరైజేషన్‌ చేసుకోవాలని సూచించడంతో 2015లోనే రెగ్యులరైజ్‌ కోసం రూ.90 లక్షలు చెల్లించాం.

కేసు సుప్రీం కోర్టులో నడుస్తుంది. ఇది మా పట్టా భూమి. మేము కొనుగోలు చేశాం. చిన్న చిన్న డీవియేషన్లు ఉంటే రెగ్యులరైజ్‌ చేసుకుంటాం. వారం క్రితం నోటీసు ఇచ్చారు.. కోర్టు ద్వారా సమాధానం ఇస్తామని చెప్పినా కనీసం సమయం కూడా ఇవ్వలేదు. 

Advertisement
 
Advertisement
 
Advertisement