సాక్షి, హైదరాబాద్: విద్యావిధానంలో ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య భిన్నమైన ధోరణుల నేపథ్యంలో ఆ రెండు ప్రాంతాల మానవ వనరుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందుకు పాఠ్య ప్రణాళికలు అవసరమని ఉన్నత విద్యా మండలి, యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ భావిస్తున్నాయి. ఈ మేరకు జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో భిన్న కోర్సులను రూపొందించేందుకు కసరత్తు చేపట్టాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని యూనివర్శిటీలతో కలిసి మానవ వనరుల అభివృద్ధికి కార్యాచరణను తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.
ఇక్కడ టెక్‌లు, సాఫ్ట్‌వేర్‌లు.. అక్కడ సివిల్స్ టార్గెట్ వయా డిగ్రీలు
దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిల్లో విద్యార్థులు ఒకే విధమైన కోర్సుల్లో చేరుతున్నారు. ముఖ్యంగా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్), ఎంబీఏ, ఎంసీఏను ఎంచుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యార్థులు ఎక్కువగా సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. ఆ తర్వాత వాళ్ళు పోటీ పరీక్షల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంగానే సివిల్స్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ కేంద్రాలు ఉత్తరాదిలోనే ఎక్కువగా ఉంటున్నాయని తేలింది.
సగానికి పైగా ఇంజనీరింగ్ సీట్లు దక్షిణాదికే
దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు బీటెక్ తర్వాత తక్షణ ఉపాధి అవకాశాలు కోరుకుంటున్నారు. సాఫ్ట్‌వేర్ లేదా ఇతర సాంకేతిక ఉపాధి అవకాశాలను ఎంచుకుంటున్నారు. ఈ కారణంగా దేశవ్యాప్తంగా ఉండే ఇంజనీరింగ్ సీట్లలో 54 శాతం దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా 12,47,667 బీటెక్ సీట్లు అందుబాటులో ఉంటే, వీటిల్లో 6,74,697 సీట్లు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఎంసీఏలో 70,065 సీట్లు ఉంటే, 30,812 (44 శాతం) దక్షిణాదిలో ఉన్నాయి. ఎంబీఏ, పీజీడీఎం వంటి మేనేజ్‌మెంట్ కోర్సులకు సంబంధించి దేశవ్యాప్తంగా 3,39,405 సీట్లు ఉంటే, దక్షిణాదిన 1,57,632 సీట్లున్నాయి. బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ సీట్లు దక్షిణాదిలోనే పెరగడానికి ఇదే కారణమని ఏఐసీటీఈ భావిస్తోంది. 2015–16లో దక్షిణాది రాష్ట్రాల్లో 48.77 బీటెక్ సీట్లు ఉంటే, ఆరేళ్లలో అవి 5.3 శాతం మాత్రమే పెరిగాయని మండలి గుర్తించింది.
స్కిల్.. పాలన నైపుణ్యంపై దృష్టి
అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న పాలనాపరమైన మార్పులు, ప్రైవేటు రంగంలో వస్తున్న సరికొత్త డిమాండ్‌కు అనుగుణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పాఠ్యాంశాలు రూపొందించాలని ఏఐసీటీఈ, యూజీసీ భావిస్తోంది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ విద్యలో నైపుణ్యం పెంచడంపై దృష్టి పెట్టాలని గుర్తించింది. పారిశ్రామిక భాగస్వామ్యంతో ఇంజనీరింగ్ విద్యను ముందుకు తీసుకెళ్ళే ఆలోచనలపై ఫోకస్ చేయాలని భావిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై త్వరలో విధివి«దానాలు వెల్లడించే వీలుందని అధికార వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment