సాక్షి, హైదరాబాద్: చింతన్ శిబిర్ కాంగ్రెస్ పార్టీకి కొత్త చింతలు తెచ్చి పెట్టేలా ఉంది. మేధోమథనం పేరుతో ఈనెల 1, 2 తేదీల్లో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశమై చేసిన రాజకీయ తీర్మానాలపై ఆ పారీ్టలోనే అంతర్మథనం జరుగుతోంది. నేతల మధ్య పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆరు నెలల ముందే ప్రకటించాలంటూ చేసిన తీర్మానం ఏ మేరకు సాధ్యమనే ప్రశ్న తలెత్తుతోంది. గత అనుభవాలు, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే ఈ తీర్మానం అమలుకు నోచుకునే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆరు నెలల ముందు అభ్యర్థిని ప్రకటిస్తే.. ఆ అభ్యర్థి పార్టీ కేడర్‌ను, నియోజకవర్గంలోని ప్రజలను ఆరునెలల పాటు ఎలా భరించగలడని ప్రశి్నస్తున్నారు. ప్రతి చిన్న విషయంలోనూ కేడర్‌ను కాపాడుకోవడం ఆ అభ్యరి్థకి కత్తిమీద సామేనని పార్టీ సీనియర్ నేతలే అంటున్నారు. అభ్యర్థిని, పార్టీ కేడర్‌ను కాపాడుకోవడం రాష్ట్ర నాయకత్వానికి కూడా సవాల్‌గా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ముందస్తు ఎన్నికలోస్తే....
ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని టీపీసీసీ ముఖ్య నేతలే పలుమార్లు నొక్కి వక్కాణిస్తున్న నేపథ్యంలో ఎప్పుడు అభ్యర్థులను ప్రకటిస్తారనే చర్చ జరుగుతోంది. ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళితే కర్ణాటకతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అవకాశముంటుంది. అంటే వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. మార్చికి ఆరు నెలల ముందు అంటే ఈ ఏడాది సెపె్టంబర్ కల్లా అభ్యర్థులను ప్రకటించాలి. ఇందుకు కేవలం మరో మూడు నెలలు మాత్రమే సమయం ఉంటుంది. ఇంత స్వల్ప సమయంలో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేసి ప్రకటించడం ఎలా సాధ్యమనే చర్చ రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది.
ఏఐసీసీతో అయ్యే పనేనా?
కాంగ్రెస్ పారీ్టలో అభ్యర్థుల ప్రకటన రాష్ట్ర స్థాయిలో జరగదు. వివిధ రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలతో ఏర్పాటయ్యే ఏఐసీసీ కమిటీ రాష్ట్రంలో పార్టీ అభ్యరి్థత్వం కోసం వచ్చే దరఖాస్తులను పరిశీలించి వారి అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. రాష్ట్ర స్థాయిలో ఉండే ఎన్నికల కమిటీ ఒక్కో స్థానానికి రెండు లేదా మూడు పేర్లు సిఫారసు చేసి ఏఐసీసీకి పంపాల్సి ఉంటుంది. అలా వెళ్లిన పేర్లలో ఒక పేరును ఖరారు చేసి ఏఐసీసీ అధికారికంగా అభ్యరి్థత్వాలను ప్రకటిస్తుంది.
కాగా గతంలో ఎప్పుడూ ఏ రాష్ట్రంలోనూ ఏఐసీసీ ఆరునెలల ముందే అభ్యర్థులను ప్రకటించిన సందర్భం లేదని, ఏఐసీసీ నిర్వహించాల్సిన ఈ సుదీర్ఘ ప్రక్రియ తప్పనిసరి అయిన నేపథ్యంలో ఆరు నెలల ముందు అభ్యర్థుల ప్రకటన ఎలా సాధ్యమనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రాష్ట్రంలోని ముఖ్య కాంగ్రెస్ నేతలు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలు, నేతల మధ్య పోటీ లేనివి 40కి పైగానే ఉన్నాయని, ఆయా స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు క్లియరెన్స్ ఇస్తూ ఏఐసీసీ నుంచి మౌఖిక ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందని, దీన్నే ఆరునెలల ముందే అభ్యర్థుల ప్రకటనగా చెప్పొచ్చంటూ టీపీసీసీ ముఖ్య నేతలు చర్చించుకోవడం గమనార్హం.
కాపీ కొడితే.. ఖతమే
మూడు నెలల ముందే పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసి, ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చింతన్ శిబిర్‌లో చేసిన మరో తీర్మానం కూడా కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. గత ఎన్నికల అనుభవాల దృష్ట్యా ఈ తీర్మానం అమలు చేయకపోవడమే మంచిదనే అభిప్రాయాన్ని పలువురు పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. 2018 ముందస్తు ఎన్నికల సందర్భంలో సామాజిక పింఛన్లు, నిరుద్యోగ భృతిని కాంగ్రెస్ పార్టీ ముందుగానే ప్రకటించింది. గతంలో ఉన్న దానికంటే పెంచి నెలకు రూ.2,000, రూ.3,000 చొప్పున ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది.
అయితే టీఆర్‌ఎస్ పార్టీ మరో రూ.16 పెంచి తాము అధికారంలోకి వస్తే ఆ మేరకు ఇస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ ఇస్తామన్న దాని కంటే కేవలం రూ.16 ఎక్కువ ఇస్తామని ప్రకటించడం ద్వారా టీఆర్‌ఎస్ ఆ ఎన్నికల్లో లబ్ధి పొందింది. రైతు రుణ మాఫీ విషయంలో తప్ప మిగిలిన చాలా అంశాల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను మించే విధంగా టీఆర్‌ఎస్ ఆ ఎన్నికలలో హామీలు ఇవ్వగలిగింది. ‘ఎన్నికలకు మూడు నెలల ముందే మేనిఫెస్టో ప్రకటించి ఉపయోగం ఏముంటుంది. పైగా ఇతర పారీ్టలు కోడిగుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నాలు చేస్తాయి. అందువల్ల మేనిఫెస్టోలోని కీలకాంశాలను సమయానుకూలంగా ప్రకటించడమే మంచిది.’అని పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.
‘50 ఏళ్ల లోపు’పైనా చర్చ
50 ఏళ్లలోపు వారికి పారీ్టలోనూ, ఎన్నికల్లోనూ ప్రాధాన్యమివ్వాలనే అంశం కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమవుతోంది. రాష్ట్ర కాంగ్రెస్‌లో.. ఆ మాటకొస్తే రాష్ట్రంలోని ఏ రాజకీయ పార్టీలోనూ 50 ఏళ్ల కన్నా తక్కువ వయసుండి ఎన్నికల్లో పోటీ చేసే సత్తా ఉన్న నేతలు వేళ్ల మీద లెక్కపెట్టగలిగేంత మంది కూడా ఉండరని, పైగా కాంగ్రెస్ పారీ్టలోని సీనియర్లు, అనుభవజ్ఞులను కాదని ఈ ప్రతిపాదన అమలు ఎలా సాధ్యమనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment