సరదాగా మొదలై... వ్యసనంగా మారి! | Drugs Usage Start Having Fun And Become Addictive | Sakshi
Sakshi News home page

సరదాగా మొదలై... వ్యసనంగా మారి!

Published Mon, Apr 4 2022 5:11 AM | Last Updated on Mon, Apr 4 2022 9:17 AM

Drugs Usage Start Having Fun And Become Addictive - Sakshi

‘చాంద్రాయణగుట్టకు చెందిన ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థి ఇటీవల మత్తుమందుకు అలవాటు పడ్డాడు. విషయం తెలిసి తల్లిదండ్రులు పాకెట్‌ మనీ కట్‌ చేశారు. డ్రగ్స్‌ కొనడానికి డబ్బుల్లేకపోవడం, తల్లిదండ్రులను అడిగినా ఇవ్వకపోవడంతో ఏకంగా తండ్రినే హత్య చేసేందుకు సిద్ధపడ్డాడు’ 

‘గచ్చిబౌలికి చెందిన ఓ యువతి డ్రగ్స్‌ కొనుగోలు కోసం దొంగతనానికి పాల్పడింది. ముందు ఇంట్లో తల్లిదండ్రుల పర్సులను మాయం చేసేది. అవి సరిపోకపోవడంతో బంధువుల ఇళ్లల్లో బంగారు ఆభరణాలను కొట్టేసి చివరకు పోలీసులకు చిక్కింది’

‘మలక్‌పేటకు చెందిన ఓ యువకుడు డ్రగ్స్‌కు ఇంట్లో డబ్బులు ఇవ్వడం లేదని చెప్పి తల్లిదండ్రులు కొనిచ్చిన టూ వీలర్‌ను అమ్మడమే కాదు.. వీధుల్లో పార్క్‌ చేసిన వాహనాలనూ కొట్టేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు’ 

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. మాదక ద్రవ్యాల కోసం యువత చిన్నచిన్న చోరీల నుంచి హత్యలు చేయడానికి, ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనుకాడటం లేదు. ఇటీవలికాలంలో నగరంలో పెరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా బంజారాహిల్స్‌ రాడిసన్‌బ్లూ హోటల్‌లో దొరికిన 150 మందిలో 80 శాతం మంది 35ఏళ్లలోపు వారే. మధ్య తరగతి యువతీ, యువకులు ఎక్కువగా గంజాయి తీసుకుంటున్నారు.

ఆర్థికంగా ఉండి, పబ్బులకు వెళ్లేవాళ్లు కొకైన్, హెరాయిన్, ఓపీయం, ఎల్‌ఎస్‌డీ వంటి ద్రావణాలను తీసుకుంటున్నారు. ఆవేశంతోనో, ఆనందం కోసమో మొదలవుతున్న ఈ అలవాటు క్రమంగా వ్యసనంగా మారుతోంది. ఆ తర్వాత వారి భవిష్యత్‌నే కబళిస్తోంది. వారి జీవితాలను పాడుచేసుకోవడమే కాదు... మత్తులో వాహనాలు నడిపి ఇతరుల మరణానికీ కారణమవుతున్నారు. చాలా ఘటనల్లో పిల్లలు డ్రగ్స్‌కు అలవాటు పడడానికి స్నేహితులు, తల్లిదండ్రులే కారణమవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. చిన్నచిన్న జాగ్రత్తలతో పిల్లలను కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. 

లక్షణాలివే.. 
మాదక ద్రవ్యాలు తీసుకున్న వారి ప్రవర్తనలో విపరీతమైన మార్పులుంటాయి. చిన్న విషయాలకు చిరాకు, కోపం తెచ్చుకుంటారు. వేళకు తినరు. ఒక్కోసారి అతిగా తింటారు. వ్యక్తిగత శుభ్రత ఉండదు. చదువు, పనితీరులో వెనకబడుతుంటారు. ఆసక్తి తగ్గుతుంది. ఏకాగ్రతను కోల్పోతారు. పరధ్యానంలో ఉంటారు. విపరీతమైన దూకుడు ప్రదర్శిస్తారు. నలుగురిలో కలిసేందుకు ఇష్టపడరు. తల్లిదండ్రుల కళ్లల్లోకి సూటిగా చూడలేక పోతారు. ఇలాంటి లక్షణాలుంటే డ్రగ్స్‌ తీసుకుంటున్నారని అనుమానించొచ్చు. 

పర్యవేక్షణ అవసరం..  
పిల్లలు ఎక్కడికి, ఎవరితో వెళ్తున్నారు? తిరిగి ఇంటికెప్పుడొస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఏం తింటున్నారు? ఏం తాగుతున్నారు? ఎలాంటివారితో స్నేహం చేస్తున్నారు? వంటి అంశాలు తెలుసుకోవాలి. లేదంటే పిల్లలు చేయిదాటిపోవడమే కాదు అసాంఘీక శక్తులుగా మారే ప్రమాదం ఉంది.

ఊహాలోక అనుభూతికోసం.. 
గంజాయి, కొకైన్, హెరాయిన్, మారిజువానా, మార్పిన్, చేరస్‌ వంటివన్నీ ఈ కోవలోకే వస్తాయి. డ్రగ్స్‌ తీసుకున్న వారు ఊహా లోకంలో విహరిస్తుంటారు. దీన్నే యూపోరియా అంటాం. ఒకసారి ఈ భావన పొందిన వ్యక్తి మళ్లీ, మళ్లీ అలాంటి అనుభూతినే పొందాలని భావిస్తుంటాడు. ఉన్నత వర్గాల్లో ఈ సంస్కృతి విపరీతంగా పెరిగింది. డ్రగ్స్‌ వాడకంతో మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇవి దొరక్కపోతే అసాంఘీక కార్యకలాపాలకు, నేరాలకు పాల్పడుతారు. పిల్లలు డ్రగ్స్‌ బారిన పడితే.. కౌన్సిలింగ్‌ ఇచ్చి కాపాడుకోవచ్చు.  
–డా.కళ్యాణ్‌ చక్రవర్తి, మానసిక వైద్యనిపుణుడు 

ఆరోగ్యంపై దీర్ఘకాల ప్రభావం 
వ్యసనంగా మారిన డ్రగ్స్‌ యువత ఆరోగ్యంపై దీర్ఘకాల ప్రభావం చూపుతున్నాయి. నిరంతరం ముక్కు నుంచి నీరు కారడం, లోపల మంట, గొంతులో పుండ్లు, బొంగురు పోవడం, చర్మంపై దద్దుర్లు, కీలకమైన సిరలు దెబ్బ తినడం, మొదడు పోటు, నిద్రలేమి/అతినిద్ర వంటి సమస్యలు తలెత్తడం, రాపిడికి గురై పళ్లు పాడైపో వడం, గుండెపోటు, వాల్వ్‌లకు ఇన్‌ఫెక్షన్లు, రక్తకఫం, పిల్లికూతలు, ఆయాసం, ఉబ్బసం, నిమోనియా వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.   
–డాక్టర్‌ వై.జయరామిరెడ్డి, వైజేఆర్‌ డీఅడిక్షన్‌ సెంటర్‌  

డ్రగ్స్‌తో బ్రెయిన్‌ స్ట్రోక్‌
లక్డీకాపూల్‌ (హైదరాబాద్‌): ఆల్కహాల్‌తోపాటు డ్రగ్స్‌ తీసుకోవడం వల్ల బ్రెయిన్‌ స్ట్రోక్‌ కేసులు పెరుగుతున్నాయని నిమ్స్‌ న్యూరో సర్జన్‌ విభాగం అధిపతి డాక్టర్‌ ఎర్రంనేని వంశీకృష్ణ తెలిపారు. డ్రగ్స్‌తో రక్తనాళాలు వ్యాకోచించి, మెదడులో రక్తస్రావం అవుతుందని.. ఇది ప్రాణాలకు ప్రమాదకరమని స్పష్టం చేశారు. డ్రగ్స్‌ వినియోగం వల్ల మానసిక ఒత్తిడి, భావోద్వేగ సమస్యలు పెరిగి.. తమ పనులను సక్రమంగా చేసుకోలేని స్థితికి చేరుకుంటారని చెప్పారు. కొన్ని సందర్భాల్లో డ్రగ్స్‌ బాధితులు గుండెపోటుతో చనిపోతున్నారన్నారు.

ఆల్కహాల్‌తో డ్రగ్స్‌ కలిపి తీసుకునేవారి సంఖ్య పెరిగిందని.. వారిలో చాలా మంది విద్యావంతులు కావడం, 29 నుంచి 35 ఏళ్ల మధ్య వయసువారే అధికంగా ఉండటం ఆందోళనకరమని చెప్పారు. కొకైన్, గంజాయిలను ఆల్కహాల్‌తో కలిపి తీసుకున్న యువకుడు ఇటీవల మెదడులో రక్తస్రావంతో చనిపోయాడని.. ఓ ఐటీ ఉద్యోగిని గంజాయికి అలవాటుపడి రెండుసార్లు బ్రెయిన్‌ స్టోక్‌కు గురైందని వివరించారు. డ్రగ్స్‌ వల్ల చేజేతులా జీవితాలను కోల్పోయే ప్రమాదముందని.. యువత ఆల్కహాల్, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement