దశలవారీగా మౌలిక వసతులు.. | Education Minister Sabitha Indra Reddy Said School Problem Solve On 3 Phases | Sakshi
Sakshi News home page

దశలవారీగా మౌలిక వసతులు..

Published Fri, Jun 18 2021 9:05 AM | Last Updated on Fri, Jun 18 2021 9:05 AM

Education Minister Sabitha Indra Reddy Said School Problem Solve On 3 Phases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సర్కారు బడి సరికొత్త హంగులతో ముస్తాబు కానుంది. కార్పొరేట్‌ విద్యా సంస్థలకు దీటుగా అన్నిరకాల మౌలిక వసతులతో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యకు అతి త్వరలో చెక్‌ పడనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ వార్షిక బడ్జెట్‌లో రూ.4వేల కోట్లు కేటాయించింది. వీటి వినియోగానికి వ్యూహాత్మక ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించిన నేపథ్యంలో విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం గురువారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో సమావేశమైంది.

ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, పాఠశాల విద్య కమిషనర్‌ దేవసేన తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం పాఠశాలల్లో ఉన్న మౌలికవసతుల తీరుపై చర్చించిన అనంతరం ప్రాధాన్య క్రమంలో సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 26,040 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో మౌలికవసతుల ఆవశ్యకతపై ఇప్పటికే పాఠశాల విద్యా శాఖ నిర్ణీత ఫార్మాట్‌లో సమాచారం సేకరించింది. ఈ సమాచారాన్ని విశ్లేషించి ప్రాధాన్య క్రమంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో మూడు దశల్లో వసతులు కల్పించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రివర్గ ఉపసంఘం పాఠశాల విద్యా శాఖను ఆదేశించింది. ఈ ప్రతిపాదనలను సీఎం కేసీఆర్‌కు సమర్పించాలని మంత్రులు నిర్ణయానికి వచ్చారు. సీఎం ఆదేశాల ప్రకారం పనులు ప్రారంభించనున్నారు. 

నమూనాగా ఢిల్లీ, ఏపీ స్కూళ్లు..  
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి పాఠశాల విద్యా శాఖ అధికారులు ఇప్పటికే ఢిల్లీతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించారు. ఆ రాష్ట్రాల్లో మౌలిక వసతుల తీరుపై అధ్యయనం చేసి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ తయారు చేశారు. ఈ రెండింటిలో ఒక రాష్ట్రంలో అనుసరిస్తున్న తీరును ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలుత విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలలను ఎంపిక చేసుకోనుంది. ఇలా ఎంపిక చేసుకున్న పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా పూర్తిస్థాయి భవనం, టాయిలెట్లు, కిచెన్‌ షెడ్లు, ఫర్నెచర్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్‌ సామగ్రి, బోధన, అభ్యసన పరికరాలు తదితరాలు సమకూరుస్తారు. వీటితోపాటు డిజిటల్‌ పద్ధతిలో పాఠ్యాంశ బోధన కోసం డిజిటల్‌ క్లాస్‌రూమ్స్‌ ఏర్పాటు చేస్తారు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement