‘సాలు దొర’.. ‘సంపకు మోదీ’  | Fight Between BJP And TRS About Flexsi-Banners Of KCR And Narendra Modi | Sakshi
Sakshi News home page

‘సాలు దొర’.. ‘సంపకు మోదీ’ 

Published Thu, Jun 30 2022 1:11 AM | Last Updated on Thu, Jun 30 2022 7:57 AM

Fight Between BJP And TRS About Flexsi-Banners Of KCR And Narendra Modi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో సరికొత్త పోరు మొదలైంది. విమర్శలు ప్రతి విమర్శలు ముదిరి ఫ్లెక్సీలు, కటౌట్ల వార్‌ వరకు వెళ్లింది. ఇటు ఫ్లెక్సీలు, కటౌట్లతో ‘సాలు దొర.. సెలవు దొర’అంటూ బీజేపీ మోత మోగిస్తుంటే.. దానికి ప్రతిగా ‘సాలు మోదీ.. సంపకు మోదీ’అంటూ టీఆర్‌ఎస్‌ దీటుగా హోరెత్తిస్తోంది. ఇరు పార్టీలు హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లు, ముఖ్య ప్రాంతాల్లో ఫ్లెక్సీలు పెట్టడంతోపాటు సోషల్‌ మీడియాలోనూ పరస్పర విమర్శల యుద్ధం చేస్తున్నాయి. బీజేపీ కార్యవర్గ సమావేశాలు ముగిసేవరకు ఈ ప్రచార యుద్ధం జోరుగా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.

బీజేపీ ఆఫీస్‌ వద్ద డిస్‌ప్లేతో మొదలై..
హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తుండటంతో ఆ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద ‘సాలు దొర.. సెలవు దొర’అంటూ డిజిటల్‌ కౌంట్‌ డౌన్‌తో బీజేపీ డిస్ప్లే ఏర్పాటు చేసింది. దీనికి అనుగుణంగా సామాజిక మాధ్యమాల్లో సీఎం కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్‌ను విమర్శిస్తూ పెద్ద సంఖ్యలో ప్రచారానికి దిగింది. ఇక కార్యవర్గ సమావేశాలు, బహిరంగ సభ నిర్వహణ కోసం చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా పెడుతున్న పోస్టర్లు, ఫ్లెక్సీలు, కటౌట్ల పైనా టీఆర్‌ఎస్‌ సర్కారును, కేసీఆర్‌ను టార్గెట్‌ చేస్తూ కామెంట్లు పెట్టింది. అయితే బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద పెట్టిన డిజిటల్‌ డిస్ప్లే బోర్డును అనుమతి లేదంటూ అధికారులు తొలగించారు.

పోటీగా రంగంలోకి టీఆర్‌ఎస్‌..
బీజేపీ ప్రచారాన్ని, విమర్శలను తిప్పికొట్టేలా టీఆర్‌ఎస్‌ నేతలు హైదరాబాద్‌లోని పలు కూడళ్లలో ‘సాలు మోదీ.. సంపకు మోదీ’అంటూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ‘బైబై మోదీ’అంటూ పెద్ద అక్షరాలతో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలపై.. ‘సాగు చట్టాలు తెచ్చి రైతులను చంపావు’, ‘నాలుగేళ్ల కాంట్రాక్టు ఉద్యోగాలతో యువత కడుపు కొట్టావు’, ‘లాక్‌డౌన్‌ పేరిట గరీబోళ్లను సంపావు’అనే నినాదాలను ముద్రించారు. నోట్ల రద్దు, రైతుచట్టాలు, నల్లధనం వెనక్కి రప్పించడం తదితర అంశాలను ప్రస్తావించారు. ‘ప్రజల ఖాతాల్లో వేస్తానన్న రూ.15 లక్షలు ఎక్కడ?’అని ప్రశ్నలు పెట్టారు. ఈ ఫ్లెక్సీలను ప్రస్తావిస్తూ ‘పరేడ్‌ గ్రౌండ్‌కు వస్తున్నవు కదా.. ఈ పోస్టర్లు ఏపియమంటవా మోదీజీ.. ఎనిమిదేళ్లలో మీ పథకాలు ఎంత మందిని చంపాయో కౌంట్‌ చేద్దామా తరుణ్‌ చుగ్గు..’అని ఎద్దేవా చేస్తూ టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌ మన్నె క్రిషాంక్‌ ట్వీట్‌ చేశారు.

హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలతో హల్‌చల్‌
జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ముఖ్య కూడళ్లను కాషాయ పతాకాలతో అలంకరించడంతోపాటు, ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని బీజేపీ నేతలు భావించారు. కానీ బీజేపీ జెండాలు, ఫ్లెక్సీల కంటే టీఆర్‌ఎస్‌ గులాబీ రంగే ఎక్కువగా కనబడేలా హైదరాబాద్‌లో ప్రధాన రహదారులు, జంక్షన్లు, మెట్రో మార్గాల్లో ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, బస్‌ షెల్టర్ల వద్ద ఫ్లెక్సీలు వెలిశాయి. వాటిపై టీఆర్‌ఎస్‌ అమలు చేస్తున్న రైతుబంధు, కేసీఆర్‌ కిట్, డబుల్‌ బెడ్రూం ఇళ్లు తదితర సంక్షేమ కార్యక్రమాల వివరాలు, నినాదాలను రాశారు. బీజేపీ సభ జరిగే పరేడ్‌ గ్రౌండ్స్‌ పరిసర ప్రాంతాల్లో, వివిధ మార్గాల్లో మెట్రో పిల్లర్లన్నీ టీఆర్‌ఎస్‌ హోర్డింగ్‌లతో నిండిపోయాయి. టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా వింగ్‌ ప్రారంభించిన ‘బై బై మోదీ’హ్యాష్‌ట్యాగ్‌ ట్విట్టర్‌తోపాటు ఇతర సోషల్‌ మీడియా వేదికలపై ట్రెండింగ్‌ అవుతోంది.

ఫ్లెక్సీలు, కటౌట్లకు చలానాలు
హైదరాబాద్‌వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కటౌట్లు, ఫ్లెక్సీలకు జీహెచ్‌ఎంసీ చలానాలు జారీ చేస్తోంది. కొద్దిరోజుల ముందు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ‘సాలు దొరా.. సెలవు దొరా’అంటూ పెట్టిన డిజిటల్‌ డిస్‌ప్లే బోర్డుకు రూ.50 వేలు, ప్రధాని మోదీ– బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫొటోలతో ఉన్న బ్యానర్, కటౌట్‌లకు రూ.5 వేలు కలిపి రూ.55 వేల జరిమానా విధించింది. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లపై పౌరుల ఫిర్యాదు మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరిట ఈ–చలానాలు జారీ చేస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ సెంట్రల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సెల్‌ పేర్కొంది.

ఇక ట్విట్టర్‌ వేదికగా వస్తున్న ఫిర్యాదులకు అనుగుణంగా కూడా జీహెచ్‌ఎంసీ చలానాలు జారీ చేస్తోంది. ముఖ్యంగా బీజేపీ ఫ్లెక్సీలపై భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. బుధవారం సాయంత్రం వరకు హైటెక్‌సిటీ, అబిడ్స్, బంజారాహిల్స్, మాదాపూర్, బేగంపేట తదితర ప్రాంతాల్లో వెలసిన ఫ్లెక్సీలు, హోర్డింగులకు దాదాపు రూ. 3.50 లక్షల పెనాల్టీలతో ఈ–చలానాలు జారీ అయినట్టు తెలిసింది. హైటెక్‌ సిటీలో బండ కార్తీకచంద్రారెడ్డి పేరిట వెలిసిన హోర్డింగ్‌కు రూ.లక్ష చలానా వేశారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి పేరిట ఎక్కువ చలానాలు జారీ అయ్యాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement