నగరంలో ఐటీ దాడుల కలకలం | A flurry of IT attacks in the city | Sakshi
Sakshi News home page

నగరంలో ఐటీ దాడుల కలకలం

Published Fri, Nov 3 2023 1:32 AM | Last Updated on Fri, Nov 3 2023 5:40 PM

A flurry of IT attacks in the city - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోని కాంగ్రెస్‌ నాయకులు, వారి బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు గురువారం విస్తృత సోదాలు నిర్వహించారు. ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న సమయంలో జరిగిన తనిఖీలు నగరంలో కలకలం రేపుతున్నాయి. ఉదయం 5 గంటల నుంచే ప్రత్యేక బృందాలు దాడులు ప్రారంభించాయి. కోకాపేటలోని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తోడల్లుడు, రియల్‌ ఎస్టేల్‌ వ్యాపారి గిరిధర్‌రెడ్డి ఇంట్లో సోదాలు చేశాయి.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్‌ఆర్‌)కి చెందిన ఇళ్లు, విల్లా, ఫామ్‌హౌసుల్లో తనిఖీలు చేపట్టాయి. బాలాపూర్‌లోని బడంగ్‌పేట్‌ మేయర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి చిగురింత పారిజాత నర్సింహారెడ్డి, వారి బంధువులు, అనుచరుల ఇళ్లలో, బాలాపూర్‌ గణపతి లడ్డూను వేలంలో కొనుగోలు చేసిన వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేశారు. సీఆర్పిఎఫ్‌ బలగాల బందోబస్తు మధ్య దాదాపు 14 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగాయి. ఇవి శుక్రవారం సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  

ఏకకాలంలో ఇద్దరి ఇళ్లపై దాడి 
తుక్కుగూడ సమీపంలో కేఎల్‌ఆర్‌ అక్బర్‌ ఫాం హౌస్‌లోని ఇంట్లో, ఆయన సొంత గ్రామమైన రంగారెడ్డి జిల్లా మాసానిగూడ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో, చర్లపల్లి, మొయినాబాద్‌ ఫామ్‌ హౌసుల్లో, గచ్చిబౌలి  ఎన్సీసీలోని విల్లాలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఉదయం ఐదు గంటలకు మూడు ప్రైవేటు వాహనాల్లో ఐటీ అధికారులు కేఎల్‌ఆర్‌ నివాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగాయి. కొద్దిపాటి నగదు సహా కీలక డాక్యుమెంట్లు స్వాదీనం చేసుకున్నట్లు తెలిసింది.

కేఎల్‌ఆర్‌ పలు రియల్‌ ఎస్టేట్‌ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం అందడంతో పాటు, ఆదాయం, పన్ను చెల్లింపుల్లో భారీ వ్యత్యాసం కనిపించడం, ఆయన వ్యాపార లావాదేవీలకు సంబంధించి పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ సోదాలు జరిగినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో పారిజాత నర్సింహారెడ్డి ఇంట్లోనూ ఐటీ అధికారుల సోదాలు కొనసాగాయి. ఆ సమయంలో పారిజాత, ఆమె భర్త నర్సింహారెడ్డి ఇంట్లో లేరు. పారిజాత తిరుపతికి వెళ్లగా, నర్సింహారెడ్డి ఢిల్లీలో ఉన్నట్టు తెలిసింది. ఇంట్లో ఉన్న కుమార్తె నుంచి మొబైల్‌ ఫోన్‌ను అధికారులు స్వా«దీనం చేసుకున్నారు.

పారిజాత, నర్సింహారెడ్డికి సమాచారం ఇచ్చారు. ఇంట్లో లభించిన బ్యాంక్‌ పాస్‌బుక్కులు, డాక్యుమెంట్లను పరిశీలించారు. మరోవైపు కొందరు అధికారులు మేయర్‌ను తిరుపతిలో అదుపులోకి తీసుకుని చెన్నై మీదుగా సాయంత్రానికి నగరానికి తీసుకొచ్చారు. సాయంత్రం 4.56కు శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగిన నర్సింహారెడ్డిని కూడా అదుపులోకి తీసుకుని ఇంటికి తీసుకువచ్చి విచారణ మొదలుపెట్టారు.

గత కొంతకాలంగా వారు చేసిన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. పొద్దుపోయే వరకు సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొంత నగదుతో పాటు కీలక డాక్యుమెంట్లు లభ్యమైనట్లు సమాచారం. కాగా మహేశ్వరం కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన వారిలో పారిజాత కూడా ఉన్నారు. మహేశ్వరం టికెట్‌ కోసం భారీ ఎత్తున లాబీయింగ్‌ జరగడంతో కేఎల్‌ఆర్, పారిజాతల ఆర్థిక లావాదేవీలపై ఐటీ నిఘా పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. 

కోకాపేట హిడెన్‌ గార్డెన్‌లో.. 
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తోడల్లుడు, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ ఎంపీపీ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గం కో ఆర్డినేటర్‌ గిరిధర్‌రెడ్డి ఇంట్లోనూ ఐటీ సోదాలు కొనసాగాయి. ఈయన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో ఉన్నారు. హైదరాబాద్‌ కోకాపేటలోని హిడెన్‌ గార్డెన్‌లో ఆయన నివాసం ఉంటున్నారు. గిరిధర్‌ రెడ్డి గత కొంతకాలంగా చేసిన ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారులు దృష్టి పెట్టినట్టు తెలిసింది.

మరోవైపు బాలాపూర్‌కు చెందిన వ్యాపారవేత్త వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు కొనసాగాయి. ఈ సమయంలో లక్ష్మారెడ్డితో పాటు కుటుంబసభ్యులు.. లక్ష్మారెడ్డి అన్న కొడుకు 3 రోజుల క్రితం మరణించడంతో అస్తికలు గంగలో కలిపేందుకు బయలుదేరుతున్నారు. దీంతో లక్ష్మారెడ్డితో కొద్దిసేపు మాట్లాడిన అధికారులు ఓ కాగితంపై సంతకం తీసుకుని ఆయన బయటకు వెళ్లేందుకు అనుమతించినట్లు తెలిసింది.  


రాజకీయ కక్షలో భాగంగానే..: కేఎల్‌ఆర్‌  
♦ రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తన ఇల్లు, కార్యాలయాలు, తన బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారని కేఎల్‌ఆర్‌ అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు కలిసి కుట్రపన్ని ఐటీ దాడులు చేయిస్తున్నాయని ఆరోపించారు. మహేశ్వరం కాంగ్రెస్‌ టికెట్‌ తనకు కేటాయించిన తరువాత, ఉద్దేశపూర్వకంగా ఈ సోదాలు చేస్తున్నారని చెప్పారు.  

మంత్రి సబిత ప్రోద్బలంతోనే..: మేయర్‌ పారిజాత 
కాంగ్రెస్‌ పార్టీ బీ ఫాం కోసం ఎదురు చూస్తున్నా. ఈ సమయంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ఐటీ రైడ్స్‌ చేస్తున్నారు. రాజకీయ కుట్రలో భాగంగా, మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతోంది. మంత్రిగా ఆమె వేల కోట్లు సంపాదించారు. ఎన్నో ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా చేశారు. ఆమె ఇంటిపై దాడులు చేయకుండా కేవలం కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఆశిస్తున్న నాపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసం?. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement