‘మూసీ’ చుట్టూ అందరి ప్రదక్షిణం | GHMC Elections 2020: TRS And Other Parties Fighting For Musi Development | Sakshi
Sakshi News home page

నీళ్లపై నిప్పులు!

Published Wed, Nov 25 2020 3:45 AM | Last Updated on Wed, Nov 25 2020 7:31 AM

GHMC Elections 2020: TRS And Other Parties Fighting For Musi Development - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: గ్రేటర్‌ ఎన్నికల్లో తాగునీరు, మూసీ సుందరీకరణ అంశాలు ప్రధాన పక్షాలైన టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య కాక పుట్టిస్తున్నాయి. ఇవే ప్రధానాస్త్రాలుగా మూడు పార్టీలు మాటల తూటాలు పేలుస్తున్నాయి. తాగునీటి గోస తీర్చడంలో వైఫల్యం మీదంటే.. మీదంటూ కత్తులు దూసుకుంటున్నాయి. చెరువులు, కుంటలు, నాలాల కబ్జాలు, ఆక్రమణలకు అధికార పార్టీనే కారణమంటూ బీజేపీ, కాంగ్రెస్‌ విమర్శిస్తుంటే, అరవై ఏళ్లుగా ఆవేదన పడుతున్న ప్రజల కన్నీళ్లను తుడిచేందుకే అనేక చర్యలు తీసుకున్నామని టీఆర్‌ఎస్‌ తిప్పికొడుతోంది. అన్ని డివిజన్లలో తాగునీటి అంశమే ప్రధాన ఎజెండాగా సాగుతున్న విమర్శలతో ప్రచారం వేడెక్కుతోంది. 

‘మూసీ’ చుట్టూ అందరి ప్రదక్షిణం 
‘గ్రేటర్‌’ పోరులో ప్రధాన పార్టీల ప్రచారమంతా మూసీ చుట్టూనే తిరుగుతోంది. 250కిలోమీటర్ల మూసీ నది ప్రక్షాళనలో టీఆర్‌ఎస్‌ విఫలమైందని, ఆ పార్టీ నేతలే కబ్జాదారులుగా మారి ఆక్రమణలకు పాల్పడ్డారని బీజేపీ, కాంగ్రెస్‌ దుమ్మెత్తిపోస్తున్నాయి. ఉస్మాన్‌సాగర్‌ నుంచి వడపల్లి వరకు మూసీ పరీవాహకంలో 490 పరిశ్రమల నుంచి 27 డ్రెయిన్‌ల ద్వారా రోజుకు 1,400 ఎంఎల్‌డీల మురుగు వచ్చి చేరుతున్నా, 800 ఎంఎల్‌డీలకు మించి శుద్ధి చేయట్లేదని అవి ఆరోపిస్తున్నాయి. మూసీ కంపు పోవాలంటే మాకు ఓటెయ్యాలంటూ 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో లబ్ధిపొందిన టీఆర్‌ఎస్‌.. మూసీ పరీవాహక ప్రాంతాల అభివృధ్ధికి రూ.1,400 కోట్లు వెచ్చిస్తామని చెప్పి మాట తప్పిందని బీజేపీ తన చార్జిషీట్‌లో నిలదీసింది.

మూసీలోకి కాలుష్యకారకాల నియంత్రణ, కబ్జాల నియంత్రణ, ఆక్రమణల కూల్చివేతలు, నాలాల పునరుద్ధరణలో విఫలం కావడంతో ఇటీవల వరదలతో నగరం నీట మునిగిందని ఆరోపణలు గుప్పిస్తోంది. చెరువులు, కుంటల ఆక్రమణదారుల్లో అధికంగా టీఆర్‌ఎస్‌ నేతలే ఉన్నారంటూ కాంగ్రెస్‌ మరోవైపు ప్రచారం చేస్తోంది. మూసీ సుందరీకరణకు సబర్మతీ తరహా యాక్షన్‌ప్లాన్‌ ఏమైందంటూ ప్రశ్నాస్త్రాలు సంధిస్తోంది. దీనిపై టీఆర్‌ఎస్‌ గట్టిగానే ప్రతిస్పందిస్తోంది. 60 ఏళ్లుగా మూసీ ప్రక్షాళనను పట్టించుకోని గత పాలకులు తమను విమర్శిస్తున్నారని ఎదురుదాడికి దిగుతోంది.

మూసీతో గోదావరి నీటిని అనుసంధానించి స్వచ్ఛందంగా మారుస్తామని సీఎం ప్రకటించారు. నదికి ఇరువైపులా ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయడంతోపాటు చెత్తాచెదారాన్ని తొలగించి, మురుగునీటి శుద్ధికి 59 ఎస్‌టీపీలు నిర్మిస్తామని మేనిఫెస్టో విడుదల సందర్భంగా సీఎం వెల్లడించారు. చెరువుల కబ్జాల నివారణకు జీహెచ్‌ఎంసీ కొత్త చట్టంలో కఠిన నియమాలు పొందుపరుస్తామని కేటీఆర్‌ చెబుతూ వస్తున్నారు. వరదలతో నష్టపోయిన వారికి 10 వేల సాయం చేస్తా మని మాటిచ్చి.. కోట్ల రూపాయల మేర కార్యకర్తలే జేబులు నింపుకున్నారని విపక్షాలు ఎత్తిపొడుస్తుంటే, వరద ప్రాంతాల్లో కనీసం పర్యటిం చని వారు.. ప్రజల పక్షాన నిల్చిన వారిపై అభాండాలు మోపుతున్నారని అధికార పక్షం కౌంటరిస్తోంది.  

తాగునీటి గోసకు కారకులు మీరంటే మీరే.. 
హైదరాబాద్‌ తాగునీటి ఇక్కట్లపైనా పార్టీల మధ్య పెద్ద దుమారమే నడుస్తోంది. కృష్ణా నీళ్లను నాగార్జునసాగర్‌ నుంచి అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ మీదుగా హైదరాబాద్‌కు తీసుకొచ్చిన ఘనత తమదేనని కాంగ్రెస్‌ చెప్పుకుంటోంది. 20 టీఎంసీల ఎల్లంపల్లి బ్యారేజీ నిర్మాణాన్ని తమ హయాంలోనే పూర్తిచేశామని, దానిద్వారా హైదరాబాద్‌కు తాగునీటి అందించింది తామేనని అంటోంది. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లిస్తామన్న ముఖ్యమంత్రి, బస్తీల్లో ఇంకా తాగునీటి గోస తీర్చలేకపోయారని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఎత్తిచూపుతున్నారు.

కాళేశ్వరం నుంచి లక్ష కోట్లతో తన సొంత ఫామ్‌హౌస్‌ దగ్గరి కొండపోచమ్మసాగర్‌ వరకు నీటిని ఎత్తిపోసిన ముఖ్యమంత్రి, హైదరాబాద్‌కు నీటిని తరలిస్తామన్న హామీని మాత్రం మరిచిపోయారని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఎద్దేవా చేస్తున్నారు. హుస్సేన్‌సాగర్‌ నీళ్లను కొబ్బరినీళ్లలా చేస్తామన్న హామీ ఏమైందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సైతం గట్టిగానే ప్రశ్నించారు. అయితే దీనిపై గట్టిగానే బదులిస్తున్న టీఆర్‌ఎస్‌.. హైదరాబాద్‌ భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని యాభై ఏళ్లకు సరిపోయేలా తాగునీటి వసతుల కోసం కేశవాపురం రిజర్వాయర్‌ నిర్మిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. హుస్సేన్‌సాగర్‌ అభివృద్ధికి ఇప్పటికే రూ.289 కోట్లు, చెరువుల పనులకు రూ.376 కోట్ల మేర ఖర్చు చేశామని ప్రతిపక్షాలకు అధికార పార్టీ కౌంటర్‌ ఇస్తోంది.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement