గ్రేటర్‌ ఎన్నికలు: ఆఖరి గంట అద్భుతం | GHMC Elections 2020 What Happened In Final Hour | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌ ఎన్నికలు: ఆఖరి గంట అద్భుతం

Published Wed, Dec 2 2020 12:18 PM | Last Updated on Wed, Dec 2 2020 5:29 PM

GHMC Elections 2020 What Happened In Final Hour - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గ్రేటర్ పోలింగ్లో ఆఖరి గంట సమయంలో ఏం జరిగిందనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఇప్పటి వరకూ చాలా ఎన్నికల సరళిని చూసిన రాజకీయ పార్టీలకు, ఎన్నికల బాధ్యతలు నిర్వహించిన అధికారులు, ఎన్నికల విధులు నిర్వర్తించిన సిబ్బందికి మంగళవారం సాయంత్రం 5 నుంచి 6 గంటల సమయంలో ఎలాంటి మిరాకిల్ జరిగిందో తెలియడం లేదు. ఎందుకంటే ఒక్క గంటలోనే పోలింగ్ శాతం రెడ్ మార్కును దాటింది. 12 గంటల పాటు ఓటర్లు వస్తారేమోనని నిద్రాహారాలు మానుకుని.. కళ్లల్లో వత్తులేసుకుని ఎదురుచూసిన ఎన్నికల సిబ్బందికి ఆ ఒక్కగంటలో వేలమంది ఓటర్లు క్యూ కట్టారు. అయినా ఎన్నికల్లో చీమ చిటుక్కుమన్నా హడావుడి చేసే మీడియా… ఇష్టం వచ్చినట్లు రాసుకునే స్వేచ్ఛ ఉన్న సోషల్ మీడియాకు ఎక్కడా బారులు తీరిన ఓటర్లు కనిపించలేదు. అయినా ఆఖరి గంటలో మాత్రం అన్నికేంద్రాల్లో ఓటర్లు బారులు తీరి… సమయం దాటినా లైన్‌లో ఉండి ఓట్లేశారని ఎన్నికల సంఘం చెప్పిన లెక్కల ప్రకారం తెలుస్తోంది.

అసలేం జరిగింది..?
ఆఖరి గంటలో ఎక్కడా హడావుడి లేకుండా, క్యూ లైన్లు కనిపించకుండా పోలింగ్ ఎలా పెరిగిందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మంగళవారం నాటి పోలింగ్‌తో పట్టణ ఓటర్లు బద్దకిస్తులు అనేది తేలిపోయింది. గ్రామవాసులకు తెలిసిన ఓటు విలువ పట్టణాల్లో ఉండే వారికి తెలియదంటూ ఆటాడుకున్నారు. ఇదంతా ఒకవైపు ఉంటే… సాయంత్రం ఆఖరి గంట మాత్రం దాదాపు సగం రోజు ఓట్లను రాబట్టినట్లు ఎన్నికల సంఘం లెక్కలు చెప్పుతున్నాయి. దీంతో అసలేం జరిగిందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ( మావైపే గ్రేటర్‌ ఓటర్.. కాదు మా వైపు‌! )

అయితే ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం పనితీరును రాష్ట్రమంతా తప్పు పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ప్రలోభాలు నివారించలేదని, ప్రచారంలో కచ్చితమైన నిబంధనలు పాటించలేదని, అధికారులకు వత్తాసు పలికారని, గొడవలు ఆపలేకపోయారని ఎన్నికల సంఘం అపవాదు మూటగట్టుకుంది. గతంలో రాష్ట్రమంతా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించిన ఎస్ఈసీ.. కేవలం మహా నగరంలో జరిగిన కేవలం 150 డివిజన్ల ఓట్లలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. పోలింగ్ నిర్వహించలేక చేతులెత్తేసింది.

ఆఖరి గంట అద్భుతం
మంగళవారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు జరిగిన పోలింగ్ కేవలం 3.96 శాతమే. చలి ఉంది కాబట్టి ఓటర్లు రాలేదనుకున్నారు. ఇక కొంచెం ఎండ వచ్చి చలి పోతుండటంతో ఓటర్లు వస్తారనుకున్నారు. కానీ 11 గంటల వరకు కూడా అదే పరిస్థితి. ఇంకో నాలుగున్నర శాతం వచ్చారు. అంటే 8.90 శాతం పోలింగ్. ఇక మధ్యాహ్నం ఓటర్లు వస్తారని, తినే తీరిక ఉండదనే ఎదురుచూపుల్లో సిబ్బంది ఉన్నారు. అయినా మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఇంకో పదిశాతం పోలైంది. దీంతో సగం రోజులో 18శాతం పోలింగ్ జరిగింది. ఆ తర్వాత కూడా గంటలకు మూడు, నాలుగు శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచి అసలు ఇవి ఎన్నికలేనా.. అన్నట్టు సాగిన పోలింగ్ ఆఖరి గంట మాత్రం అద్భుతాన్ని సృష్టించింది.

ఈ అద్భుతం అధికార పార్టీ ముసుగులో ఎన్నికల సంఘం సృష్టించిందా.. అంతా తప్పుపడుతున్నట్టే పోలీసుల సమక్షంలోనే జరిగిందా అనేది రాష్ట్రమంతా తొలిచివేస్తున్న ప్రశ్న. సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పోలింగ్ శాతం 35.80 శాతం. అప్పటికే అధికారుల మీద, రాజకీయ పక్షాల మీద ఒత్తిడి, ఆరోపణలు పెరుగడంతో ఎలాగోలా తీసుకువచ్చి ఓట్లేయించారు. కొంతమంది దొంగ ఓట్లు వేస్తుంటే గుర్తించి పట్టకున్నారు. ఎందుకంటే అప్పుడు సమయం సాయంత్రం 5 గంటలలోపే. ఇక అప్పటి వరకు ప్రతి గంట గంట పోలింగ్‌ను పది నిమిషాల్లో ప్రకటించిన ఎన్నికల సంఘం సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ శాతాన్ని నిలిపివేసింది. కారణాలను మాత్రం తెలుపలేదు.

దీంతో పోలింగ్ శాతం 38 శాతం ఉంటుందని భావించారు. 2016 గ్రేటర్ ఎన్నికల కంటే తక్కువ జరిగిందనే అంచనాకు వచ్చారు. ఎందుకంటే అనుకున్న సమయానికే పోలింగ్ ముగిసింది. ఎక్కడా ఓటర్లు లైన్‌లో ఉన్నట్లు, పోలింగ్ కోసం అదనపు సమయం తీసుకున్నట్లు ప్రకటించలేదు. దీంతో పోలింగ్ ముగిసినట్లుగానే భావించారు. కానీ ఆఖరి గంట పోలింగ్ శాతాన్ని మాత్రం అర్థరాత్రి 12 గంటల తర్వాత ప్రకటించారు. మొత్తం పోలింగ్ 45.70 శాతంగా నమోదైనట్లు ఎస్ఈసీ వెల్లడించింది. గత ఎన్నికల్లో జరిగిన పోలింగ్ 45.29 శాతం మాత్రమే. కానీ ఈసారి 0.50 శాతం ఎక్కువగా జరిగింది. ఈ లెక్కన సాయంత్రం ఆఖరి గంటలో జరిగిన పోలింగ్ శాతం 10 శాతంగా నమోదైంది.

అప్పటి వరకు పోలింగ్ కేంద్రాల వైపు చూడని ఓటర్లు ఒక్కసారిగా కేంద్రాల్లోకి పోటెత్తారు. సమయం మించిపోతుందని కేంద్రాల్లోకి చొచ్చుకువచ్చారని ఎన్నికల సంఘం లెక్కలు చెప్పుతున్నాయి. కానీ ఇదెలా సాధ్యం. 12 గంటల పాటు రాని ఓటర్లు ఒక్కసారిగా ఎలా వచ్చారు… ఎక్కడి నుంచి వచ్చారు… అసలు ఒక్కచోట కూడా సమయం దాటిన తర్వాత లైన్లలో ఉన్నట్లు ఎన్నికల సంఘం కనీసం ప్రకటించలేదు. పోలింగ్ ముగిసినట్లుగానే భావించారు. కానీ సమయం దాటినా ఓట్లు వేసినట్లు పోలింగ్ శాతాన్ని చూస్తే తెలుస్తోంది. మరి ఎక్కడ ఇలా లైన్‌లు కట్టి ఓట్లేశారు… నిజంగానే ఇదంతా ఓ మిరాకిల్‌లా ఉంది… అంటూ రాజకీయ పక్షాలు విషయం తెలియక తలలు బద్దలు కొట్టుకుంటున్నారు.

దొంగ ఓట్లా… రిగ్గింగా…?
‘అవేవో… అప్పడెప్పడో తెలుగు సినిమాలు ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి. అప్పుడు రాయలసీమలో ఎన్నికలంటేనే పోలీసులు పక్కన కాపలా ఉంటే రాజకీయ నేతలు వచ్చి బ్యాలెట్ పేపర్లలో తమ గుర్తుపై ఓటు గుద్దుకుని బాక్స్ ల్లో వేసుకుంటారు. ఇది హీరో అడ్డుకుందామంటే చాలా కష్టాలు ఎదుర్కొవాల్సిందే. ఆ ఫైట్లు, బాంబుల మోతలు చూసి రిగ్గింగ్ పై ఈలలు వేసుకునేది. కానీ తెలంగాణలో ఇప్పుడు సీన్ మారిందని చెప్పుతున్నారు. పోలింగ్ శాతం పెరుగడంలో అంతా అలాగే జరుగుతుందని, కానీ ఫైట్లు, బాంబుల మోతలు మాత్రమే లేవంటున్నారు ప్రతిపక్షాలు. ఎందుకంటే ఆఖరి గంట సమయంలో దొంగ ఓట్లు వేయించారని, రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

పోలీసులు, ఎన్నికల సంఘం సంయుక్తంగా అధికార పార్టీకి ఓట్లేయించారని మండిపడుతున్నారు. కానీ ఆరోపణలకు బలం చేకూర్చినట్టుగానే అసలు కనీసం ఎక్కడా ఒక్క లైన్ లేకుండా… సమయంలో ఓటర్లు వచ్చినా.. సమయం దాటినా లైన్లలో లేకున్నా ఓటింగ్ శాతం ఎలా పెరిగిందో అంతు చిక్కకుండా మారింది. ఇక స్వయంప్రతిపత్తి కలిగిన రాష్ట్ర ఎన్నికల సంఘం అధికార పార్టీకి తొత్తుగా పని చేసిందనే రాజకీయ పక్షాల ఆరోపణలకు ఆఖరి గంట మరింత బలాన్ని చేకూర్చుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement