సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు జన్మదినం సందర్భంగా ఇచ్చిన పిలుపు మేరకు ‘గిఫ్ట్ ఏ స్మైల్’పేరిట శాసనసభ్యులు అంబులెన్సులను విరాళంగా అందజేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా శనివారం ప్రగతిభవన్‌లో 21 అంబులెన్సులను ప్రారంభించిన మంత్రి.. వివిధ నియోజకవర్గాల్లో ఆరోగ్య సేవల కోసం వాటిని అందజేశారు. మంత్రులు ఈటల రాజేందర్, మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీలు రంజిత్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డి మూడేసి చొప్పున, ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి ఒక అంబులెన్సును విరాళంగా అందజేశారు. మంత్రి నిరంజన్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి రెండు, నన్నపునేని నరేందర్, ఆరూరు రమేశ్, వినయ్ భాస్కర్‌తో పాటు వరంగల్‌కు చెందిన లక్ష్మణరావు ఒక్కో అంబులెన్సు చొప్పున ఇచ్చారు. వీటిని ఉమ్మడి మహబూబ్‌నగర్, హైదరాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో సేవలందించేందుకు ఉపయోగిస్తారు. ఈ అంబులెన్సుల్లో ఆక్సిజన్ వెంటిలేటర్‌తో సహా ఆధునిక సదుపాయాలున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్‌తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి రూ.20.50 లక్షల వ్యయంతో సమకూర్చిన అంబులెన్సును కూడా కేటీఆర్ ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment