సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య విభేదాలు, వివాదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. శాసనసభ, శాసనమండలి ఆమోదం పొందిన బిల్లులను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నెలన్నర రోజులుగా పెండింగ్‌లో ఉంచడం చర్చనీయాంశమవుతోంది. మరోవైపు తన సొంత ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకోరాదని గవర్నర్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
దీపావళి సందర్భంగా సోమవారం రాజ్‌భవన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించిన గవర్నర్, సామాన్యప్రజానీకం నుంచి పండుగ శుభాకాంక్షలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ బిల్లుల విషయమై చేసిన వ్యాఖ్యలు చర్చనీ యాంశమమ్యాయి. ‘శాసనసభలో పాసైన బిల్లులకు ఆమోదం తెలిపే అంశం పూర్తిగా నా పరిధిలోనిది.
గవర్నర్‌గా నాకు విస్తృత అధికారాలుంటాయి. నా పరిధిలోనే నేను నడుచుకుంటున్నాను..’ అని తమిళిసై స్పష్టం చేశారు. రాజ్‌భవన్‌లో పెండింగ్‌లో ఉన్న బిల్లులను త్వరలో పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని, గవర్నర్‌గా తన బాధ్యతల మేరకే నిర్ణయాలు తీసుకుంటానని చెప్పారు.
నెలన్నర రోజులుగా...: గత నెల 13న రాష్ట్ర శాసనసభ, శాసనమండలిలో ఆమోదించిన మొత్తం 8 బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం మరుసటి రోజు గవర్నర్ ఆమోదముద్ర కోసం పంపించింది. గవర్నర్ వాటిని పరిశీలించి, ఆమోదించిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంటుంది. అప్పుడే బిల్లులు చట్టరూపం దాల్చి అమల్లోకి వస్తాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిన 8 బిల్లుల్లో కేవలం జీఎస్టీ చట్ట సవరణ బిల్లుకు మాత్రమే తమిళిసై ఆమోదం తెలిపారు. మిగిలిన ఏడు బిల్లులను పెండింగ్‌లో ఉంచారు.
ములుగు అటవీ కళాశాల పేరును తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయంగా మార్చడం, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లోని కొలువుల భర్తీకి ఉమ్మడి బోర్డు ఏర్పాటు వంటి రెండు కొత్త బిల్లులు కూడా ఇందులో ఉన్నాయి. ఇక ప్రైవేటు వర్సిటీల చట్టం, పురపాలికల చట్టం, అజామాబాద్ పారిశ్రామిక ప్రాంత చట్టం, పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్టం, మోటార్ వాహనాలపై పన్నులు సంబంధిత చట్టం సవరణ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. గవర్నర్ ఆమోదిస్తే ఈ బిల్లులను తక్షణమే అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిరీక్షిస్తుండడం గమనార్హం.
గవర్నర్ సోదరి విషయంలో అధికారుల అభ్యంతరం!
రాష్ట్ర గవర్నర్‌గా రాజ్‌భవన్‌లో తన ఖర్చులు మొత్తం తానే భరిస్తున్నట్లు తమిళిసై ఇటీవల చెన్నైలో వ్యాఖ్యానించారు. ప్రతినెలా తనకయ్యే ఖర్చును తానే సొంతంగా చెల్లిస్తున్నానని, ప్రభుత్వ సొమ్మును ఉపయోగించుకోవడం లేదని తెలిపారు. గవర్నర్ సోదరి ఒకరు కొంత కాలం పాటు రాజ్‌భవన్‌లో తమిళిసై కుటుంబంతో కలిసి ఉన్నారు. అయితే ఇది ప్రోటోకాల్ నిబంధనలకు వ్యతిరేకమని రాజ్‌భవన్ అధికారులు అభ్యంతరం తెలిపినట్టు తెలిసింది. దీంతో గవర్నర్ తన సోదరిని పంపించి వేశారని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే తన ఖర్చులను స్వయంగా భరించాలని గవర్నర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment