సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మధ్య పెండింగ్ బిల్లుల జగడం మళ్లీ రాజుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ, మండలిలో 12 బిల్లులను పాస్ చేసి గవర్నర్ తమిళిసై ఆమోదం కోసం పంపించగా.. వారం రోజుల నుంచి రాజ్‌భవన్‌లోనే పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్టీసీ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఉద్దేశించిన టీఎస్‌ఆర్టీసీ చట్ట సవరణ బిల్లు–2023 కూడా వీటిలో ఉంది. గవర్నర్ ఆమోదించాక, ప్రభుత్వం గజిట్ నోటిఫికేషన్లను జారీ చేశాక ఈ బిల్లులు చట్టరూపం దాల్చి, అమల్లోకి రానున్నాయి.
రెండోసారి పంపినా నిరీక్షణ
గవర్నర్ తమిళిసై గతంలో తిప్పి పంపిన 3 బిల్లులు, తిరస్కరించిన మరో బిల్లుతో కలిపి మొత్తం 4 బిల్లులను ప్రభుత్వం ఇటీవల రెండోసారి అసెంబ్లీలో ఆమోదించింది. వీటితోపాటు మరో 8 కొత్త బిల్లులను సైతం ఆమోదించి.. మొత్తం 12 బిల్లులను రాజ్‌భవన్‌కు పంపింది. వీటి విషయంలో గవర్నర్ కార్యాలయం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను అసెంబ్లీ మళ్లీ ఆమోదించి పంపిస్తే.. గవర్నర్ ఆమోదించక తప్పదని రాజ్యాంగంలోని నిబంధనలు పేర్కొంటున్నాయి.
ఈ మేరకు సదరు నాలుగు బిల్లులను ఆమోదించడం తప్ప గవర్నర్‌కు గత్యంతరం లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మరికొన్ని రోజులు గవర్నర్ స్పందన కోసం నిరీక్షించిన అనంతరం.. పెండింగ్ బిల్లుల వ్యవహారంపై మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. రెండు నెలల్లో శాసనసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో.. ఆలోగానే బిల్లులను అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.
ఎమ్మెల్సీ అభ్యర్థులపై ‘పరిశీలన’!
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎరుకల సామాజికవర్గానికి చెందిన కుర్ర సత్యనారాయణ, బలహీనవర్గాల నుంచి దాసోజు శ్రవణ్‌లను నామినేట్ చేయాలని రాష్ట్ర కేబినెట్ గత నెల 31న తీర్మానం చేసి పంపినా.. గవర్నర్ తమిళిసై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎమ్మెల్సీలుగా నియమించేందుకు వారికి ఉన్న అర్హతలను గవర్నర్ పరిశీలిస్తున్నారని రాజ్‌భవన్ వర్గాలు చెప్తున్నాయి. ఈ ఇద్దరు నేతలు గతంలో కొంతకాలం బీజేపీలో పనిచేసి.. తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరినవారే. గతంలో కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేసేందుకు గవర్నర్ సమ్మతించకపోవడం నేపథ్యంలో.. ప్రస్తుతం ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.
నెలల తరబడి పరిశీలనలోనే..!
పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళిసై న్యాయ సలహా కోరినట్టు సమాచారం. బిల్లులు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా? లేదా? అన్న అంశంపై పరిశీలన కోసం తనకు అవసరమైనంత సమయం తీసుకుంటానని గవర్నర్ గతంలో పలుమార్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో నెలల తరబడి బిల్లులు రాజ్‌భవన్ ‘పరిశీలన’లో ఉండిపోతున్నాయి.
రాజ్‌భవన్‌లో ఉన్న బిల్లులు ఇవీ..
రెండోసారి ఆమోదించి పంపినవి..
- తెలంగాణ మున్సిపల్ బిల్లు–2022
- తెలంగాణ ప్రైవేటు వర్సిటీల బిల్లు–2022
- రాష్ట్ర పంచాయతీరాజ్ బిల్లు–2023
- తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్ యాన్యూయేషన్) బిల్లు–2022
తొలిసారిగా ఆమోదించి పంపినవి..
- తెలంగాణ పంచాయతీరాజ్ (మూడో సవరణ) బిల్లు – 2023
- తెలంగాణ మున్సిపాలిటీల (రెండో సవరణ) బిల్లు–2023
- తెలంగాణ ఆర్టీసీ బిల్లు (సర్కారులో ఉద్యోగుల విలీనం) – 2023
- తెలంగాణ పంచాయతీరాజ్ (రెండో సవరణ) బిల్లు–2023
- తెలంగాణ జీఎస్టీ చట్ట సవరణ బిల్లు–2023
- తెలంగాణ స్టేట్ మైనారిటీస్ కమిషన్ బిల్లు–2023
- ఫ్యాక్టరీల చట్ట సవరణ బిల్లు–2023
- టిమ్స్ వైద్య సంస్థల బిల్లు–2023
Comments
Please login to add a commentAdd a comment